
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి'.. దర్వకుడు రవీంద్ర గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అడ్డుచెప్పింది. దీంతో చిత్ర యూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సర్టిఫికేషన్ దరఖాస్తులను తిరస్కరించడాన్ని సెన్సార్ను తప్పుబడుతూ వారు కోర్టులో సవాలు చేశారు.
'అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' చిత్రంలో యోగి ఆదిత్యనాథ్ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఆయన గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో చిత్ర నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించి తమ వాదనను వినిపించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలిపారు. దీంతో ఇదే విధంగానే న్యాయస్థానం కూడా సెన్సార్ బోర్డును ప్రశ్నించింది.
పుస్తకంపై ఎలాంటి సమస్యలు లేనప్పుడు సినిమాకు అభ్యంతరాలు ఎందుకని న్యాయమూర్తులు రేవతి మోహితే డెరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది సినిమా విడుదలకు ఎందుకు వస్తుందని న్యాయస్థానం నిలదీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని CBFCకి కోర్టు నోటీసు జారీ చేసింది.