Mahesh Babu About Sitara: ఆ రియాక్షన్ నేను ఎప్పుడూ చూడలేదు: మహేశ్ బాబు

Mahesh Babu About Sitara In Chit Chat With Youtubers: 'ఆ సీన్ చూసి సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో భాగంగా శనివారం (మే 21) పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్ బాబు తెలిపాడు.
''ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది. దీంతో డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి 'మేడమ్.. మీరు సార్‌ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ను మీరు తిట్టాలి.' అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకు అర్థమైంది. అప్పుడు నేను 'పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు' అని చెప్పాను. దానికి ఆమె 'సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు.' అని చెప్పింది. 'నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.' అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాం. కానీ మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది.'' అని చెప్పుకొచ్చాడు మహేశ్‌బాబు.
చదవండి: అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు
ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు