P.Susheela: లెజెండ్రీ సింగర్స్‌, ఆసక్తికర విషయాలు

Legendary Singers Sushilamma Lataji Rehman and Interesting Things - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు నేపథ్య సంగీతంలో ఆమె గళం అమరం. భావితరాలకు  మెలోడీ  క్వీన్‌  పాటే కొండంత వెలుగు..ఒక పాఠశాల. ఏ దేశమేగినా అని దేశభక్తిని పొంగించినా..  మీర జాలగలడా నా  ఆనతి అని పాడినా.. వస్తాడు నా రాజు అంటూ ఆమె గళమెత్తినా,  ‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’, ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’  అని రేడియోలో పాట ప్రసారం కాని  లేని దీపావళి లేదు.  ముత్యముంతా పసుపు ముఖమంతా ఛాయ అన్నా, ఝుమ్మంది నాదం సై అంది పాదం అని మురిపించినా ఆమెకు ఆమే సాటి.

లతాజీతో గురుబంధం
తనకు ఇష్టమైన  గాయని లతా మంగేష్కర్‌ అని  స్వయంగా సుశీలమ్మ గారే  చాలా సందర్భంగా గర్వంగా ప్రకటించారు. ఆమె పాటలు  వింటూ ఎదిగిన తాను, ఆమె గొంతును దొంగిలించాను అంటారామె. అలా  లతాజీ తన మానసిక గురువు ఆమె అని చెబుతారు. అలాగే లతాజీ కూడా సుశీలమ్మను తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు. అలాగే ముంబాయి వెళితే లతాజీని కలవకుండాక రారు సుశీలమ్మ. అంతటి  స్నేహం, గురుభావం ఇద్దరి మధ్య ఉంది.

హిందీ సినిమాలలో లతా మంగేష్కర్‌ ‘మహల్‌’ (1949) సినిమాతో స్టార్‌డమ్‌లోకి వస్తే పి.సుశీల ‘మిస్సమ్మ’ (1955) సినిమాతో స్టార్‌డమ్‌లోకి వచ్చారు. సుశీలమ్మను సౌత్‌ ఇండియా లతా మంగేష్కర్‌ అని కూడా పిలుచుకుంటారట.  వీరిద్దరి మధ్య స్నేహం ఉండేదట. ముఖ్యంగా  1969లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ ఉత్తమ గాయనిగా సుశీల ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలో ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్‌గారు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన తోటిగాయనిని ప్రత్యేకంగా  సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్‌ను కూడా బహుకరించారు. అలాగే ఒకసారి చెన్నై వచ్చి సుశీలమ్మ తలుపు తట్టి ఆశ్చర్యపరిచారట లతా మంగేష్కర్‌.

సుశీలమ్మ బయోపిక్‌, ఏ ఆర్‌ రహ్మాన్‌
సంగీత దర్శకుడు , ఆస్కార్ విన్నర్‌ ఏఆర్‌రహమాన్‌ ఇటీవల వెల్లడించారు.  తొలి ప్రొడక్షన్ , క్లాసిక్  మూవీ  ‘‘99 సాంగ్స్‌’’ ప్రమోషన్‌లో భాగంగా  సుశీల తన బయోపిక్‌ను తీయాలనే తన కోరికను వ్యక్తం చేసినట్లు  రెహమాన్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న థియేటర్‌లలో విడుదలైన  అనంతరం దీన​ఇన ఓటీటీలో కూడా విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌పై  ఈఏడాది మేలో ట్విటర్‌ స్పేస్ సెషన్‌లో రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 99 సాంగ్స్‌  చూశారా అని అడిగినపుడు చూడలేదని చెప్పారని, అయితే  ఈ మూవీ తెలుగు  వెర్షన్‌ను చూడాలని కోరినట్టు తెలిపారు. తన కోరిక మేరకు సినిమా  చూసిన సుశీలమ్మ  సినిమా చాలా బాగుందని ప్రశంసించడంతోపాటు, తన తన కథను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, మీరు సహాయం చేస్తారా? అని అడిగారని ఆ సందర్భంగా రివీల్‌ చేశారు. అంతేకాదు తన ఫ్యావరెట్‌ సింగర్‌ తన సినిమాకి ఈ విధంగా ప్రతిస్పందించడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. దీంతో  తమ అభిమాన గాయని బయోపిక్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

జానకికి తొలి అవార్డు
జానకితోపాటు, తోటిగాయనీ మణులందరితోనూ కూడా సన్నిహిత సంబంధాలను  కలిగి ఉండేవారు సుశీల. ముఖ్యంగా తన పేరిట తీసుకొచ్చిన తొలి అవార్డును ఎస్‌ జానకికి ఇచ్చి సత్కరించడాన్ని ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకుంటారు. రెండో ఏడాది గానగంధర్వుడు ఎస్‌ పీ బాలూకి,  మూడవ ఏడాది కేజే ఏసుదాసుగారికి ఇచ్చారు. అంతేకాదు కొన్నివేల మంది గాయకులకు 2 వేలు పెన్షన్‌ అందిస్తున్నారు.

ఫ్యామిలీ
సుశీలమ్మగారి సోదరుడి కోసం  వచ్చిన మోహన్‌రావు గారు సుశీలమ్మను  చూసి ఇష్టపడ్డారు.  ఆయనకు లతా మంగేష్కర్ అంటే మహా ఇష్టం. అయితే  అప్పటికే పాటలు పాడుతున్న సుశీలగారు అభిమాని కావడంలో  ఆశ్చర్యమేముంది. అలా  ఆ తరువాత  భర్త అయ్యారు. వివాహం తరువాత ఆయనకు నేనే లతా మంగేష్కర్. సుశీల భర్త వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు.. జయశ్రీ- శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ `ఇరువర్` అనే తమిళ చిత్రంలో ఏఆర్‌ రహమాన్‌తో కలసి అరంగేట్రం చేశారామె. అలా  రెహామాన్‌కి సుశీలమ్మ కుటుంబంతో గొప్ప అనుబంధం ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top