ఆ రెసిపీ ఎవరికీ తెలియదు | Krithi shetty talks about custody movie | Sakshi
Sakshi News home page

ఆ రెసిపీ ఎవరికీ తెలియదు

May 7 2023 4:33 AM | Updated on May 7 2023 4:33 AM

Krithi shetty talks about custody movie - Sakshi

‘‘నాకు షూటింగ్‌ లొకేషన్‌ హాలిడే స్పాట్‌లాంటిది. షూటింగ్‌ చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఏ రోజైనా షూటింగ్‌ లేదంటే నాకు బోర్‌ అనిపిస్తుంది. అంతగా ప్రొఫెషన్‌ అంటే నాకు ప్రేమ’’ అన్నారు కృతీ శెట్టి. నాగచైతన్య సరసన కృతీ నటించిన ‘కస్టడీ’ ఈ నెల 12న విడుదల కానుంది. పవన్‌కుమార్‌ సమర్పణలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు.

► ముందుగా ‘కస్టడీ’ స్టోరీ లైన్‌ గురించి..  
సాధారణంగా ఏ సినిమాలో అయినా విలన్‌ని చంపడం, ఓడించడం... కథ ఇలా ఉంటుంది. అయితే ‘కస్టడీ’లో మాత్రం విలన్‌ను కాపాడటానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. కొత్త స్టోరీ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

► స్టోరీ లైన్‌ కొత్తగా ఉంది... మీ పాత్ర?  
ఇందులో నటనకు మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశాను. సీరియస్‌గా నడుస్తున్న కథను నా పాత్ర బ్యాలెన్స్‌ చేయడమే కాకుండా స్క్రీన్‌ ప్లేలతో పాటు ప్రయాణం చేస్తుంది. నేనిప్పటివరకూ చేసిన సిని మాలన్నింట్లోకీ ఈ సినిమాలో చేసిన పాత్ర నిడివి ఎక్కువ.

► కానీ యాక్షన్‌ సినిమాల్లో హీరోయిన్‌కు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా?
అది కొంత నిజమే. అయితే ‘కస్టడీ’ యాక్షన్‌ సినిమా అయినప్పటికీ హీరోయిన్‌ క్యారెక్టర్‌ లెంగ్త్‌ ఎక్కువ. ఈ  సినిమాలో నాకు నచ్చిన అంశం కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే.. వేరే సినిమాలకు డ్యాన్స్‌ప్రాక్టీస్‌ చేశాను. కానీ ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్‌ ప్రాక్టీస్‌ చేశాను. అందుకే డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభుగారితో ఈ సినిమా చూశాక హాలీవుడ్‌ నుంచి నాకు మార్వెల్‌ ఫిలింస్‌కి, డిస్నీ సంస్థ నుంచి ఫోన్‌ వస్తుందేమో అని సరదాగా అన్నాను.

► ‘కస్టడీ’లో అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. ఆ చిత్రీకరణ ఎలాంటి అనుభూతిని మిగిల్చింది?
ఈ యాక్షన్‌ సీన్స్‌ తీయడానికి 15 రోజులు పట్టింది. ఇందులో 5 రోజులు పూర్తిగా 20 ఫీట్ల వాటర్‌ పూల్‌లో షూటింగ్‌ చేశాం. తీసే ముందు రెండు రోజులుప్రాక్టీస్‌ చేశాం. కొన్నిసార్లు 40 సెకండ్ల నుంచి ఒక నిమిషం వరకు ఊపిరి తీసుకోకుండా చేయాల్సి వచ్చింది. ఈ సీన్లలో చైతూ, సంపత్‌గారు, అరవింద్‌ స్వామిగారు, నేను ఉంటాం. అందుకే భయం వేసింది. ఎందుకంటే ఎవరికి ‘అన్‌ ఈజీ’గా అనిపించినా మళ్లీ సీన్‌ తీయాల్సి ఉంటుంది. నా కారణంగా అలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదని కోరుకున్నాను.  

► ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్యతో ‘కస్టడీ’ సినిమా చేశారు.. మీ కెమిస్ట్రీ గురించి?  
చైతన్య నా ఫేవరెట్‌ కో–స్టార్, అలాగే తన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. జనరల్‌గా ఆఫ్‌ స్క్రీన్‌లో కో–స్టార్స్‌ మధ్య మంచి రిలేషన్‌ ఉంటే అది ఆన్‌ స్క్రీన్‌ మీద రిఫ్లెక్ట్‌ అవుతుంది. ఆఫ్‌ స్క్రీన్‌ చై, నా రిలేషన్‌ బాగుంటుంది. తనతో ఉన్న సాన్నిహిత్యం మా కెమిస్ట్రీని మరింత అందంగా పండించింది. కొన్నిసార్లయితేప్రాక్టీస్‌ చేయకుండానే సహజంగానే నటించాం. చైతూతో ఆ కంఫర్ట్‌ ఉంటుంది.  

► ‘ఉప్పెన’ తర్వాత మీరు చేసిన సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితం సాధించలేదు. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకున్నారా?  
‘ఉప్పెన’ తర్వాత ‘శ్యామ్‌ సింగరాయ్, బంగార్రాజు’ వంటి మంచి సినిమాలు చేశాను. ఆ విషయం పక్కన పెట్టి ఫలితం గురించి చె΄్పాలంటే.. పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న నటులు ఉన్నారు. అయితే వారితో పాటు సక్సెస్‌ రెసిపీ ఎవరికీ తెలియదు. అది తెలిస్తే అన్నీ హిట్లే వస్తాయి. మా వంతుగా మేం చేయగలిగింది కష్టపడి పని చేయడమే. నేను చేసిన సినిమా ఫ్లాప్‌ అయినా పశ్చాత్తాపపడను. ఎందుకంటే ఆ సినిమా కూడా ఎంతో కొంత అనుభవాన్ని మిగుల్చు తుంది కదా. ఆ అనుభవం నా భవిష్యత్‌ సినిమాల ఎంపికకు పనికొస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ సెలక్షన్‌ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

► నటన కాకుండా మీకున్న వ్యాపకాలు?
దర్శకత్వం చేయాలనుంది. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు డైరెక్షన్‌కి సంబంధించిన విషయాల మీద ఆసక్తి చూపిస్తుంటాను. సెట్స్‌లో అందరూ ఆటపట్టిస్తుంటారు.. అయితే పదేళ్ల తర్వాతే డైరెక్షన్‌ చేస్తాను.

► తదుపరి సినిమాల గురించి...
మలయాళంలో ఒక సినిమా, శర్వానంద్‌తో తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement