Director Pa Ranjith: శిష్యులకు దారిచూపుతున్న స్టార్ డైరెక్టర్.. సొంత సంస్థలో..

తమిళ సినిమా: సామాజిక అంశాలను ఇతివృత్తంగా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు పా రంజిత్ దిట్ట. నీలం ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి తన శిష్యులకు దర్శకులుగా అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నీలం ప్రొడక్షన్స్, లెమన్ లీఫ్ క్రియేషన్స్ సంస్థ అధినేత గణేశమూర్తితో కలిసి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అశోక్ సెల్వన్, శాంతను భాగ్యరాజ్, పృథ్వీ పాండియరాజన్, కీర్తి పాండియన్, దివ్య దురైస్వామి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా పా.రంజిత్ శిష్యుడు జైకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు వివరిస్తూ.. క్రికెట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. స్నేహానికి ప్రాధాన్యతను ఇస్తూ కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. చిత్ర షూటింగ్‌ను అరక్కోణం పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. గోవింద్ వసంత సంగీతం, తమిళగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.