RRR :మా కోసం చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు.. రాజమౌళి

Karnataka CM Basavaraj Bommai Speech At RRR Pre Release Event - Sakshi

–  కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

సాక్షి, బెంగళూరు: ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్వాతంత్య్ర పోరాట యోధుల సినిమా కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్రం తెచ్చారు. వారి  గురించి, ఆ పోరాటం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగింది.

శనివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ – ‘‘దేశం గర్వించదగ్గ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తెరకెక్కించారు రాజమౌళి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలి. కన్నడలోనూ ఈ సినిమా రావడం  గర్వంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయవంతమై చరిత్రలో నిలిచిపోవాలి. ఈ సమయంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ను మరవడం సాధ్యం కాదు. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్‌ జీవితంలో నెరవేరాయి. పునీత్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తాం’’ అన్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రికార్డ్స్‌ ఒక్కటే’’ అని మరో అతిథి, కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కె. సుధాకర్‌ అన్నారు.

‘‘కొంచెం సంతోషం, కొంత బాధగా ఉంది. మా తమ్ముడు పునీత్‌ మరణంతో నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ, కన్నడనాడు దుఃఖంలో ఉంది. రామ్‌చరణ్, తారక్‌ (ఎన్టీఆర్‌)లో పునీత్‌ను చూస్తున్నాను. దక్షిణాది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒక దర్శకుడు (రాజమౌళి) ఎదగడం గర్వంగా ఉంది’’ అన్నారు మరో అతిథి, కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌.

రాజమౌళి మాట్లాడుతూ– ‘‘పునీత్‌ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన ‘జేమ్స్‌’ సినిమా విజయమే నిదర్శనం. ‘ఆర్‌ఆర్‌ ఆర్‌’ తెలుగు సినిమాకి గర్వకారణం కాబట్టి టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిగారికి, మంత్రి పేర్ని నాని, కొడాలి నానీగార్లకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారికి, ఎంపీ సంతోష్‌కుమార్‌గారికి, ప్రకాశ్‌రాజ్‌కి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మాట్లాడి టికెట్‌ రేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్‌చరణ్‌), నా భీముడు (ఎన్టీఆర్‌) శరీరంలోని ప్రతి అణువును పెట్టారు’’ అన్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ – ‘‘ఏపీ, తెలంగాణ తర్వాత కర్నాటక పెద్ద మార్కెట్‌. ప్రతి ఒక్కరూ థియేటర్‌లోనే సినిమా చూడాలి’’ అన్నారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ముగ్గురూ అత్యుత్తమ ప్రదర్శనను ఈ సినిమాలో కనబరిచారు’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి .

‘‘ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు  ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య. సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న వెంకట నారాయణ్‌ మాట్లాడుతూ– ‘‘ఆర్‌’ అనే అక్షరానికి ఎంతో పవర్‌ ఉంది. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీ ఆర్, కర్నాటకలో రాజ్‌కుమార్, హిందీలో రాజ్‌కపూర్.... ఇలా ‘ఆర్‌’కు ఎంతో పవర్‌ ఉంది. అలాంటిది ఇప్పుడు మూడు ‘ఆర్‌’లు కలసి వస్తున్నారు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top