
‘‘వార్ 2’ టీజర్‌కి ప్రజల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే నేను నటుణ్ణి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రేమ లభించడం ఒక వరంలా అనిపిస్తోంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందిస్తూ– ‘‘వార్ 2’లో నా పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. యూనిట్ అంతా సరదాగా కలిసి పని చేశాం. థియేటర్లో మీ స్పందన చూడటానికి నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ‘వార్ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమని చూసి ఉప్పొంగిపోయాను. టీజర్ ఇంతటి ప్రభావం చూపించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.