ఏపీ దిశ యాప్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది

Ishq  Movie Connects To AP Disha App - Sakshi

‘‘భారతదేశంలో సినిమా షూటింగ్‌లకు సింగిల్‌ విండో విధానంలో అనుమతి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఏపీలోని ఏ ప్రాంతంలోనైనా షూటింగ్‌ చేసుకునే అనుమతులు వచ్చే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు కల్పించారు. మా ఎగ్జిబిటర్స్‌ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళితే తప్పకుండా పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ అన్నారు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా యస్‌.యస్‌. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్‌’. ఆర్‌బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్‌ జైన్, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఎన్వీ ప్రసాద్‌ చెప్పిన విశేషాలు.

థియేటర్లో సినిమా చూస్తే వచ్చే థ్రిల్‌ ఓటీటీలో రాదు. లాక్‌డౌన్‌ వల్ల థియేటర్ల వ్యవస్థ బాగా దెబ్బతింది. థియేటర్స్‌ మూత పడ్డా కూడా జీతాలు చెల్లించాలి.  కరెంటు అనేది ప్రతి థియేటర్‌కి మినిమం లక్ష రూపాయలు చెల్లించాల్సిందే. మా అగ్రిమెంట్‌ ప్రకారమే చెల్లిస్తున్నాం. ఒకప్పుడు సినిమా వాళ్లకి ఐడీబీఎల్‌ లోన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎవరూ లోన్‌ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం ఇస్తున్న సినిమా ఇండస్ట్రీని నాన్‌ ప్రియారిటీ సెక్షన్‌లో పెట్టడం ఎంత వరకు సమంజసం?

థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్‌’. ప్రేమకథలోనే థ్రిల్లింగ్‌ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ‘ఇష్క్‌’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాలు డబ్‌ అవుతుండటం సంతోషం. థియేటర్లు ప్రారంభం అవుతున్నాయి కాబట్టే ఓటీటీ వాళ్లు ఇప్పుడు మరింత డబ్బు ఇచ్చి, సినిమాలు కొనేందుకు వస్తారు.. నిర్మాతలు జాగ్రత్తపడాలి. చిరంజీవిగారితో మేము నిర్మించనున్న సినిమా ఆగస్టు 13న ప్రారంభం అవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top