చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్వీట్‌కి నాని రిప్లై

IPL 2021: Hero Nani Replies To Chennai Super Kings Tweet - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన జెర్సీ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాలో కొన్ని స‌న్నివేశాలు ఎంత ఉద్వేగ‌భ‌రితంగా ఉంటాయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా త‌న‌కు రంజీ జ‌ట్టులో చోటు ద‌క్కాక‌.. నాని వెళ్లి రైల్వే స్టేష‌న్‌లో ట్రైన్ శ‌బ్దం మాటున గ‌ట్టిగా అరుస్తూ భావోద్వేగానికి గుర‌య్యే స‌న్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. జీవితంలో ఒక గొప్ప విజ‌యం సాధించిన సంద‌ర్భంలో అలాంటి భావోద్వేగానికి గురవుతారు. గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాని చాలా సహజంగా, వాస్తవానికి దగ్గరగా తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా గురించి ఐపీఎల్‌లో చెన్నె సూపర్‌ కింగ్స్‌కు సెలెక్ట్‌ అయిన తెలుగు యవతేజం హరిశంకర్‌ రెడ్డి మాట్లాడాడు. తాను సీఎస్‌కే టీమ్‌కు ఎంపికైనట్లు తెలిసినప్పుడు కూడా జెర్సీ సినిమాలో నాని మాదిరే భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు.  

ప్ర‌స్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న హరిశంకర్‌.. తాజాగా చెన్నై మీడియం టీమ్‌తో మాట్లాడుతూ..‘జెర్సీ సినిమాతో నేను ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యాను.. క్రికెట‌ర్ల భావోద్వేగాల‌ను ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ట్రైన్ సీన్ చూసి నేను చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. సాధారణ ప్రజలకు ఆ సీన్ ఓవరాక్షన్‌లా ఉండొచ్చు. కానీ క్రికెటర్లకు ఆ బాధ ఏంటో తెలుసు. నేను ఐపీఎల్ వేలానికి ఎంపికైనప్పుడు సహచర ఆటగాళ్లంతా అభినందించారు. కానీ నేను రూమ్‌లో వెళ్లి ‘అమ్మా'అని గట్టిగా అరిచా. ఇది కలా? నిజమా? అని తెలియలేదు. ఆ క్షణం నాకు జెర్సీ సినిమాలోని సీన్ గుర్తొచ్చింది’ అని హరిశంకర్‌ రెడ్డి చెప్పుకొచ్చాడు

దీనితో ఈ స్పెషల్ వీడియోని చూడాలని చెన్నై సూపర్ కింగ్స్ తన సోషల్‌ మీడియా షేర్‌ చేసింది. అంతేకాదు ఈ వీడియో చూడాలని నానిని కోరింది.  దీనికి నాని చూసేశా అని బదులిస్తూ.. లవ్ ఏమోజీతో రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. కాగా, ఫిబ్రవరిలో జరిగిన మినీ ఐపీఎల్‌ వేలంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన హరిశంకర్‌ రెడ్డిని సీఎస్‌కే రూ. 20 లక్షల కనీధరకు కొనుగోలు చేసింది. ఇటీవల జట్టు ప్రాక్టీసులో భాగంగా అతడు ఏకంగా కెప్టెన్ ధోనీనే బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top