టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ రివ్యూ.. 8 హిట్‌ సినిమాలు ఇవే

Hit Movies in 2021: List of Best Telugu Movies in Tollywood, Box Office Collection Wise - Sakshi

కంటికి కనిపించని కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌కు 9 నెలల పాటు థియేటర్స్ మూసేశారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులు మళ్లీ థియేర్లకు వస్తారా? సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?అని చిత్ర పరిశ్రమ పెద్దలు ఒకింత భయాందోళనకు గురవుతుండగా.. మేము అండగా ఉంటామని ధైర్యాన్ని నూరిపోశారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలు విడుదల చేయండి, థియేటర్స్‌కి తప్పకుండా వస్తామని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే గత మూడు నెలలుగా విడుదలైన సినిమాలన్నింటిని ఆదరించి చిత్ర పరిశ్రమే షాకయ్యేలా చేశారు. సినిమా సందడి మళ్లీ మొదలైంది. చూస్తుండగానే ఈ ఏడాదిలో మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలల్లో టాలీవుడ్‌లో దాదాపు 66 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మంచి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నేటితో మొదటి మూడు నెలలు ఫినిష్ అయ్యాయి.మరి ఫస్ట్‌ క్వార్టర్‌లో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టాయో చూద్దాం.

కిర్రాక్‌ అనిపించిన ‘క్రాక్‌’
థియేటర్లు రీఓపెన్‌ అయ్యాక వచ్చిన తొలి బిగ్‌ మూవీ ‘క్రాక్‌’. కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ టాలీవుడ్‌ ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన చిత్రమిది. జనవరి 9నదసంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి నిర్మాతలలో నమ్మకం పెంచేసింది. రవితేజ, శ్రుతీహాసన్‌ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా దాదాపు 38 కోట్లు వసూలు చేసింది. పోలీసు అధికారి పోత రాజు వీర శంకర్‌గా మాస్‌ మహారాజా రవితేజ చించేశాడు. చాలా రోజుల తర్వాత మాస్‌ మహారాజాలోని ఫైర్‌ తెరపై కనిపించింది. గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

 విజయ్‌ ‘మాస్టర్’ పాఠాలు బాగున్నాయి
విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్‌ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ ఈ ఏడాది ‘మాస్టర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సినిమా కాకపోయినా కూడా టాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన ఈ సినిమా సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసి, తెలుగులో కూడా విజయ్‌కు భారీ మార్కెట్‌ ఉందని నిరూపించింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్‌ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. 

పర్వాలేదనిపించిన ‘రెడ్‌’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్‌’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత కిశోర్ తిరుమల,రామ్‌ కాంబోలో హ్యాట్రిక్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. సేఫ్‌జోన్‌లోకి వెళ్లింది.

యాంకర్‌ ప్రదీప్‌ తొలి ప్రయత్నం ఫలించింది
యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30’రోజుల్లో ప్రేమించడం ఎలా. తొలి సినిమాతోనే మంచి హిట్‌ కట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అయిందా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. కానీ పెట్టిన బడ్జెట్‌.. అమ్మిన రేట్లతో పోలిస్తే మాత్రం యాంకర్ ప్రదీప్ తొలి సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.కొందరు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కూడా తీసుకొచ్చింది.

రికార్డులు షేక్‌ చేసిన జాంబి రెడ్డి
కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్‌ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.

మెగా మేనల్లుడి రికార్డు.. ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్లు
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది నిర్మాతలకు ధైర్యం నూరిపోసిన సినిమా ఇది. బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన ఏకంగా 51 కోట్లు షేర్ వసూలు చేసింది. 

అల్లరి నరేశ్‌ నట విశ్వరూపానికి ‘నాంది’
 8 ఏళ్లుగా సరైన హిట్‌ లేక సతమతమవుతున్న అల్లరి నరేశ్‌కు ‘నాంది’తో మంచి విజయం దక్కింది. ‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’ అంటూ అల్లరి నరేశ్‌ చేసిన నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది‌. నరేశ్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా 6.5 కోట్ల షేర్ వచ్చింది. చేసిన బిజినెస్‌తో పోలిస్తే సినిమా లాభాల్లోకి వచ్చేసింది.


బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన ‘జాతి రత్నాలు’
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ జాతిరత్నాలు.  అనుదీప్ దర్శకత్వంలో వచ్చినఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదలైన జాతి రత్నాలు బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా పెద్ద సినిమాలకు రానీ కలెక్షన్స్‌తో రాబట్టింది.నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top