చదివేస్తున్నారానందంగా... | Sakshi
Sakshi News home page

చదివేస్తున్నారానందంగా...

Published Sat, Sep 12 2020 2:51 AM

Heroines reading books during quarantine - Sakshi

హీరోయిన్లంటే తీరిక లేనంత బిజీ.  పలు భాషల్లో సినిమాలు చేస్తుంటారు. షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో సగం సమయం గడిచిపోతుంది.  హాబీలకు సమయం కేటాయించేంత వీలు ఎక్కువగా దొరకదు. కొందరికి బుక్స్‌ చదవడం ఓ హాబీ. కరోనా వల్ల పని ఒత్తిడి తగ్గి, పుస్తకాలు చేతిలో తీసుకునే ఛాన్స్‌ దొరికింది. ఆలస్యం చేయకుండా షెల్ఫ్‌లో ఉన్న పుస్తకాలన్నీ పూర్తి చేసే పనిలో పడ్డారు. అక్షరాలన్నీ నమిలేసే పుస్తకాల పురుగులయ్యారు. ఈ లాక్‌డౌన్‌లో నచ్చిన పుస్తకాల్ని ‘చదివేస్తున్నారానందంగా’.  మరి బుక్స్‌ పట్టిన భామల గురించి చదివేద్దామా?

‘‘ఈ క్వారంటైన్‌లో యోగా, పుస్తకాలు బిజీగా ఉంచాయి’’ అంటూ తాను చదివిన పుస్తకాల వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు శ్రియ. అనార్కీ, ఉమెన్‌ హూ రన్‌ దిత్‌ ది ఉల్వ్స్, లైవ్‌ సినిమా అండ్‌ ఇట్స్‌ టెక్నిక్స్, విపాసన యోగాకు సంబంధించిన పుస్తకాలు.. ఇంకా చాలా చదివానని తెలిపారామె. అంతే కాదు.. మంచి పుస్తకాలేమైనా ఉంటే నాకు సూచించరూ అని విన్నవించుకున్నారు శ్రియ.

పుస్తకాల పురుగు రాశీ ఖన్నా ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకం ‘ది పవర్‌ ఆఫ్‌ ఇంటెన్షన్‌’. ఈ లాక్‌డౌన్‌లో చదవడం మొదలెట్టారట. ‘‘ఈ పుస్తకం నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. కొంచెం నెమ్మదస్తురాలిని కూడా అయ్యాను’’ అన్నారు రాశీ ఖన్నా. దక్షిణాదిన క్రేజీ హీరోయిన్‌గా దూసుకెళుతోన్న రష్మికా మందన్నాకు కూడా పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఇటీవల చదివిన ‘ది లిటిల్‌ బిగ్‌ థింగ్స్‌’ చాలా బాగుందని పేర్కొన్నారామె.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో పాపులార్టీ తెచ్చుకున్న నభా నటేశ్‌ కూడా లాక్‌డౌన్‌ సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించారు. మరో తార ఆండ్రియా ‘‘జీవితాన్ని హ్యాండిల్‌ చేయలేనట్టుగా అనిపిస్తే పుస్తకాల్లోకి వెళ్లిపోతాను. ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకి ఎస్కేప్‌ అయి పేజీల మధ్యలో సంతోషాన్ని వెతుక్కోవడం నాకు భలే ఇష్టం’’ అంటారు.

‘మీరు పుస్తకాలు ఎందుకు చదువుతుంటారు’ అని అడిగితే ఈ బ్యూటీ ఇలా చెబుతారు. అది మాత్రమే కాదు.. ‘బ్రోకెన్‌ వింగ్‌’ అనే పుస్తకం కూడా రాశారామె. ఇందులో కవితలు ఉంటాయి. గతంలో ఒక పెళ్లయిన వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డారామె. అతడు ఆండ్రియాని మానసికంగా, శారీరకంగా వేధించాడట. అతన్నుంచి విడిపోయి, మానసికంగా చాలా కుంగిపోయారామె. తన వ్యక్తిగత అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు ఆండ్రియా. ఇక ఆమె చదివిన పుస్తకాల విషయానికొస్తే.. ‘ది లేజీ జీనియస్‌ వే’, ‘హామిల్టన్‌: ది రివల్యూషన్‌’, ‘ఇంటిమేషన్స్‌’.. ఇంకా చాలా ఉన్నాయి.

‘‘జీవితం ఏమో చిన్నది. చదవాల్సిన పుస్తకాలేమో చాలా!’’ అంటున్నారు శోభితా ధూళిపాళ్ల. క్వారంటైన్‌ సమయంలో అక్షరాల్ని నమిలేశారు ఈ తెలుగమ్మాయి. లియోనార్డ్‌ కోహెన్‌ రాసిన నవలలు, కవితలంటే చాలా ఇష్టం అంటున్నారు శోభితా. జ్ఞానం పెంచుకోవడానికి, సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా చదవడానికి, బాధ నుంచి బయటపడటానికి, టైమ్‌పాస్‌ కోసం... ఇలా ఏదైనాసరే మనకోసం ఒక పుస్తకం ఉంటుంది. ‘పుస్తకం మంచి నేస్తం’ అవుతుంది.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement