
దర్శన్ రావల్ పాడిన ‘భులా దియా’ వీడియో సాంగ్ గుర్తుండే ఉంటుంది.. యూట్యూబ్ అభిమానులకు. అందులో అభినయించిన అమ్మాయి ఆ ఒక్క పాటతోనే పాపులర్ అయిపోయింది. ఆమె పేరు నమ్రతా సేథ్. ఇప్పుడు గిల్టీ మైండ్స్ అనే సిరీస్‌తో వెబ్ స్టార్‌గా వెలుగుతోంది. నటనా రంగంలో తన ప్రాముఖ్యాన్ని గుర్తుచేస్తోంది..
గుర్తుచేస్తోంది..
పుట్టింది, పెరిగింది ముంబైలోనే. తండ్రి అమిత్ సేథ్.. రచయిత. చిన్నప్పుడే కథక్ డాన్స్ నేర్చుకుంది. డిగ్రీలో ఓ కాలేజ్ ఫంక్షన్‌లో కథక్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఆమె అభినయం, సన్నజాజి తీగలాంటి ఆమె ఆకృతి చూసి మోడలింగ్ అవకాశాలు నమ్రతా చదువుతున్న కాలేజ్ క్యాంపస్ ముందు క్యూ కట్టాయి. అయితే మోడలింగ్‌లో అవకాశాలు వచ్చినంతగా సక్సెస్ రాలేదు.అన్నేళ్లు మోడలింగ్‌లో ఉన్నా ‘భులా దియా’ పాట దాకా ఆమెకు గుర్తింపు రాలేదు. నటనారంగంలో ఆమె రాతను మార్చింది ఆ వీడియో సాంగే. 70 మిలియన్ల వ్యూస్‌తో వెబ్ రంగం దృష్టిలో పడింది. ‘గిల్టీ మైండ్స్’ సిరీస్‌తో చాన్స్ అందుకుంది. శుభాంగి సక్సేనా అనే లాయర్‌గా నటించింది. వెబ్ వీక్షకుల వీరాభిమానాన్ని ఆస్వాదిస్తోంది.
ఫిట్‌నెస్ అంటే ప్రాణం పెడుతుంది నమ్రతా. అందుకే మిన్ను విరిగి మీద పడినా వ్యాయామాలు ఆపదు. ఇండోర్.. అవుట్ డోర్ షూటింగ్‌లో ఉన్నా.. క్షణం తీరికలేకుండా ఉన్నా.. ఆ షెడ్యూల్‌లో ఎక్సర్‌సైజ్ తప్పకుండా భాగమవుతుంది.
ప్రయాణాలు, సంగీతం, నాట్యం.. ఆమె అభిరుచులు..
అభిమాన ధనం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. అది నా కాన్ఫిడెన్స్‌ను రెట్టింపు చేస్తోంది. అదే సమయంలో బాధ్యతనూ తెలియజేస్తోంది భవిష్యత్‌లో నేను ఎంచుకునే పాత్రల విషయంలో. సక్సెస్‌ను నిభాయించుకోవడం కష్టం అని పెద్దలు ఎందుకు చెప్తారో ఇప్పుడు అర్థమవుతోంది.
– నమ్రతా సేథ్