
‘‘కింగ్‌డమ్’ చిత్రం విడుదలకు ముందు చివరి నిమిషం వరకూ తుది మెరుగులు దిద్దడానికి ప్రయత్నించాం. దాని వల్ల నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను. ఏ కథైనా, సన్నివేశమైనా అందులో ఉన్న భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయగలగాలి. ‘కింగ్‌డమ్’ విషయంలో కూడా అదే సూత్రం ఫాలో అయ్యాను. ఇందులో యాక్షన్ ఉన్నప్పటికీ దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉంటుంది. ఆ భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి కాబట్టే యాక్షన్ వర్కౌట్ అయింది’’ అని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెలి పారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జూలై 31న విడుదలైంది. సోమవారం గౌతమ్ తిన్ననూరి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిజానికి విజయ్ దేవరకొండతో చేద్దామనుకున్న కథ వేరు. కానీ, మా ప్రయాణం మొదలైన తర్వాత ‘కింగ్‌డమ్’ కథ ఆయనకి సరిగ్గా సరిపోతుందని భావించి చెప్పగానే ఒప్పుకున్నారు. వెంకటేశ్‌ని ఆడిషన్ చేసినప్పుడు సినిమా పట్ల, నటన పట్ల తన తపన చూసి మురుగన్ పాత్రకి తీసుకున్నాం.
శివ పాత్ర నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు సత్యదేవ్. ‘కింగ్‌డమ్’ నుంచి ‘హృదయం లోపల...’ పాటని తొలగించాం. కథా గమనానికి అడ్డంకిగా ఆ పాట ఉందనిపించి నేను, ఎడిటర్ నవీన్ నూలిగారు, నాగవంశీగారు, విజయ్‌గారు.. ఇలా అందరం చర్చించుకొని తొలగించాం. ఓటీటీ వెర్షన్‌లో ఆ సాంగ్‌తో పాటు కొన్ని సన్నివేశాలు కూడా జోడించే ఆలోచన ఉంది. ‘కింగ్‌డమ్’ రెండో భాగం మూల కథ ఉంది. స్క్రిప్ట్ వర్క్ త్వరలో ప్రారంభిస్తాం. ఈలోపు ఓటీటీ కోసం ఓ వెబ్ ఫిల్మ్ చేస్తాను’’ అని తెలి పారు.