Golden Globe Awards 2023: తెలుగు నాటు యమా హిట్టు

Golden Globe Awards 2023: RRR Wins Best Original Song For Naatu Naatu - Sakshi

చరిత్రాత్మకం

నాటుదనంలో మాయామర్మం ఉండదు. నాటుదనంలో కల్లాకపటం ఉండదు. నాటుదనంలో హొయలు వగలు ఉండవు. నాటుదనంలో తళుకూ జిలుగూ ఉండవు. నాటుదనం గ్రామీణం. నాటుదనం భోళాతనం. నాటుదనం సాంస్కృతిక వరం. నాటుదనం మేకప్పు లేని సౌందర్యం. అందుకే ప్రపంచం మెచ్చింది. తెలుగు నాటుదనానికి చరిత్రాత్మక గుర్తింపునిచ్చింది. 78 ఏళ్లుగా ఇస్తున్న హాలీవుడ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో భారతదేశం నుంచి అందునా తెలుగు నుంచి మొట్ట మొదటిసారి ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’గా ఆర్‌.ఆర్‌.ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట అవార్డు గెలుచుకుంది.
 సంగీత దర్శకుడు కీరవాణి తెలుగు కీర్తిని పెంచారు. రాసినవారు, పాడినవారు, ఆడినవారు, ఆడించినవారు, ఆదరించిన తెలుగు కుటుంబాలు సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన సమయం ఇది. పరమ నాటు సమయం.

పాట కూడా ఒక్కోసారి బాకులా గుచ్చుకుంటుంది. గజమో రెండు గజాలో దూరం కాకుండా సముద్రాలు దాటి తియ్యటి గాటు పెడుతుంది. పల్లవి చెంప నిమురుతుంది. చరణం గుండె తడుముతుంది. పదం పదం కలిసి జ్వరం తెప్పించి వెర్రెక్కిస్తుంది. భాష తెలియని భావం అక్కర్లేని నాదం ముందుకు దుముకుతుంది. హోరున తాకే జలపాతం కింద నిలబడినవాడి జాతి ఏదైతే ఏంటి... రీతి ఏదైతే ఏంటి... నిలువునా తడిపేస్తుంది. పాట కూడా అంతే.

ప్రణతి, ఎన్టీఆర్, రాజమౌళి, రమ, శ్రీవల్లి, కీరవాణి, ఉపాసన, రామ్‌చరణ్, కార్తికేయ, శోభు యార్లగడ్డ

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు...

అది గుంటూరు మిర్చి పొలం కావచ్చు. బహుశా నెల్లూరు పోలేరమ్మ జాతర కావచ్చు. కాకుంటే లష్కర్‌ బోనాలు కావచ్చు. అయితే మేడారం మహా సంగమం కావచ్చు. తెలుగుదనం అది. తెలుగు ఘనం. తెలుగు జనం. తెలుగు జయం. గ్రామీణ తేటదనం. అమాయక నాటుదనం. అది ఊరి పెద్దమనిషి తలపాగ. పేదరైతు భుజాన కండువ. నిండు గాజుల ఇల్లాలి నుదుటి బొట్టు. రోకలి దంచే యువతి చెంపన చెమట చుక్క. అది నిర్మల్‌ కొయ్యబొమ్మ. కొండపల్లి పూలకొమ్మ. ఉత్త నాటు సౌందర్యం. బహుమేటి సౌందర్యం.

నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు

ఈ నాటు ఇప్పడు ప్రపంచాన్ని గెలిచింది. సినిమా ద్వారా అయితేనేమి తెలుగు మాట ఖండాతరాలలో మోగింది. తెలుగు బాణి దేశదేశాల వాళ్లతో చిందులు వేయించింది. తెలుగు దరువు భూగోళాన్ని డండనకర ఆడించింది. తెలుగువారికి ఏం తక్కువ? మనకంటే ఎవరు ఎక్కువ?

చులకన చేయని ఘనత
ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ‘నాటు నాటు’ పాట వచ్చే సందర్భం ఆంగ్లేయులు తమను తాము గొప్ప చేసుకుంటూ తెలుగు వారికి ఏం వచ్చు అని ప్రశ్నించే సందర్భం. వాళ్ల స్టయిలు డాన్సులు, నైసు స్టెప్పులే గొప్ప అనుకుంటూ కథా నాయకులైన రామ్‌ను, భీమ్‌ను నిలదీసే సందర్భం. దానికి జవాబుగా తెలుగువారు రంగంలోకి దిగితే పరిస్థితి ఎంత నాటుగా ఉంటుందో హీరోలు చెప్పాలి. అందుకు పాట కావాలి. గీత రచయిత చంద్రబోస్‌కు సిట్యుయేషన్‌ చెప్పి ‘నువ్వు ఏదైనా రాయి మన ఘనత చాటుకునేలా ఉండాలి. ఎదుటివారిని అవమానించేలా తిట్టేలా ఉండకూడదు’ అన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంగ్లిష్‌ వాణ్ణి తిట్టకుండా చెంప పగులగొట్టాలన్న మాట. చల్లగరిగ (జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా) లాంటి చిన్న పల్లెలో పుట్టిన చంద్రబోస్‌కి తెలుగు వేగం, తెలంగాణ యోగం తెలియనిది ఏముంది? పాట పుట్టింది.

కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు
నా పాట చూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు

చంద్రబోస్‌ మొత్తం పాట రాశాక కీరవాణి దానికి ట్యూన్‌ చేశాడు. పాట రాశాక ఫైనల్‌ వెర్షన్‌గా పాట బయటపడటానికి మధ్య దాదాపు 19 నెలలు ఉన్నాయి కరోనా వల్ల. ‘లోపలున పానమంతా దముకు దుముకులాడేలా’ చంద్రబోస్‌ రాయడం, ‘వొంటిలోన రగతమంతా రంకెలేసి ఎగిరేలా’ కీరవాణి ట్యూన్‌ చేయడం... దాంతో అది కోటి ఈలల పాటైంది. జపాన్‌ వాడి ఈల.. రష్యావాడి ఈల... చైనా వాడిదీ... వమెరికా వాడిదీనూ.

పాదాల తుఫాను
రికార్డింగ్‌ థియేటర్‌లో వాయుగుండం బలపడింది. ఇక అది తెర మీద తుఫానులా తాకాలి. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయాలి. పులి ఒకరు, బెబ్బులి ఒకరుగా ఇద్దరు హీరోలు... ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ సిద్ధంగా ఉన్నారు. వీరి కాళ్లకు గజ్జెలు కట్టే వీరుడు కావాలి. ప్రేమ రక్షిత్‌. ఈ పాండిచ్చేరి కుర్రాడు హైదరాబాద్‌నే తన రెండో ఇల్లు చేసుకున్నాడు. కొరియోగ్రఫీని ఒంట్లో నింపుకున్నాడు. ‘ఈ పాటను నువ్వు ఎలాగైనా కంపోజ్‌ చెయ్‌. కాని ఇద్దరు హీరోలు ఈక్వల్‌గా కనిపించాలి’ అనేది దర్శకుడి షరతు. ‘ఎవరి ఎనర్జీ లెవల్‌ కూడా తగ్గినట్టుగా స్క్రీన్‌ మీద ఉండరాదు’ అన్నాడు దర్శకుడు. ప్రేమ్‌ రక్షిత్‌ పాటను అందుకున్నాడు. నెల రోజులు తపస్సు చేశాడు. హుక్‌ స్టెప్‌ (వైరల్‌ అయిన స్టెప్‌) కోసం యాభై రకాల మూవ్‌మెంట్స్‌ సిద్ధం చేస్తే దర్శకుడికి ఇప్పుడు ఉన్నది నచ్చింది. పాట కోసం మొత్తం 94 రకాల మూవ్‌మెంట్స్‌ని కంపోజ్‌ చేశాడు ప్రేమ్‌ రక్షిత్‌. పాటను ఉక్రెయిన్‌లో ప్రెసిడెంట్‌ ప్యాలెస్‌ దగ్గర 20 రోజులు షూట్‌ చేశారు. ఇద్దరూ సింగిల్‌ టేక్‌ ఆర్టిస్టులే అయినా పర్‌ఫెక్ట్‌ సింక్‌ కోసం దాదాపు 46 రీటేకులు అయ్యాయి.

నాటు నాటు నాచో నాచో
తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో నాటు నాటు వీర నాటు హిట్‌ కొట్టింది. ఇందులోని హుక్‌ స్టెప్‌ను ఆబాల గోపాలం ఇమిటేట్‌ చేసింది. యూ ట్యూబ్‌ షాట్స్, ఇన్‌స్టా రీల్స్‌ వందల వేలుగా తయారయ్యాయి. సల్మాన్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌ కూడా ఈ స్టెప్‌ను రిపీట్‌ చేశారు. ప్రపంచమంతా తెలుగు మోత మోగింది. ఒకప్పుడు రాజ్‌ కపూర్‌ చేసిన ‘ఆవారా హూ’ పాట ఇంత పెద్ద హిట్‌ అయ్యింది. తమిళంలో రహెమాన్‌ చేసిన ‘తిల్లానా తిల్లానా’ ఇలాగే హిట్‌ అయ్యింది. ఇప్పుడు తెలుగు వంతు.
మన జానపదం, మన నాటుదనం ఇప్పుడు కేకమీదున్నాయి. ఇది తెలుగు ఘనం. ఇది తెలుగు జయం.

ఇద్దరు స్టార్స్‌కి కొరియోగ్రాఫ్‌ చేయడం అనేది పెద్ద సవాల్‌. ఎందుకంటే ఒక్కో స్టార్‌కి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. ‘నాటు నాటు..’కి రెండు స్టయిల్స్‌ తీసుకుని, ఒకే స్టయిల్‌గా మార్చడం జరిగింది. నేను సవాల్‌గా తీసుకుని ఈ పాట చేశాను. కొరియోగ్రాఫ్‌ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. చిత్రీకరణకు 20 రోజులు. 43 రీటేక్స్‌ తీసుకోవడం జరిగింది. మొదట్లో కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ఇద్దరు స్టార్స్‌ని సమానంగా చూపించాలి. అందుకే చివరి వరకూ పాటకు మెరుగులు దిద్దుతూనే ఉండేవాళ్లం.
– ప్రేమ్‌ రక్షిత్, కొరియోగ్రాఫర్‌

కీరవాణి సార్‌తో నా ప్రయాణం ఒక దశాబ్దం నాటిది. సార్‌ నన్ను న మ్మి ‘నాటు నాటు..’ ని నాలుగు భాషల్లో పాడేలా చేశారు. ఇది నాకు అద్భుతమైన అవకాశం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి పాడటం అనేది నాకో పెద్ద చాలెంజ్‌. నిరూపించుకోవాలని చాలా కష్టపడి పాట పాడాను. ఈ పాటను పెద్ద హిట్‌ చేసినందుకు యావత్‌ భారతదేశానికి ధన్యవాదాలు.
– రాహుల్‌ సిప్లిగంజ్, గాయకుడు

‘‘నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివి. ఎందుకంటే ‘నాటు నాటు’ పాట విశ్వ వేదిక మీద విజయం సాధించింది. రచయితగా చాలా చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు చంద్రబోస్‌.‘‘28 ఏళ్ల ప్రస్థానం, 850 చిత్రాలు, 3,600లకు పైగా పాటలు.. మొట్ట మొదటి పాట ‘తాజ్‌మహల్‌’లోని ‘మంచు కొండల్లోన చంద్రమా..’ నుండి ఇప్పటి ‘వాల్తేరు వీరయ్య’లోని పాట వరకూ..  ప్రతి పాటకూ తపస్సే, మథనమే జ్వలనమే. 3500 సార్లకు పైగా తపస్సు చేస్తే ఒక్కసారైనా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు కదా. ఈసారి ‘నాటు నాటు..’ పాటకు భగవంతుడు ప్రత్యక్షం అయి, వరం ఇచ్చాడని భావిస్తున్నాను.
– చంద్రబోస్, రచయిత

ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసింది
‘‘ఈ విజయం చాలా ప్రత్యేకం. కీరవాణి, ప్రేమ్‌ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్, రాహుల్‌ సిప్లిగంజ్‌లకు అభి నందనలు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతగానో గర్వించేలా చేసింది’’ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మరిన్ని విజయాలు సాధించాలి
‘నాటు నాటు’ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు సాధించి నందుకు ‘ఆర్‌ఆర్‌ ఆర్‌’ యూనిట్‌ని గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ అభినందించారు. ఈ పాటకు అవార్డు రావడం ద్వారా తెలుగు సినిమా ప్రపంచ సంగీత వేదికపై గర్వించదగ్గ స్థాయిలో నిలిచిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించా లని గవర్నర్‌ ఆకాంక్షించినట్లుగా రాజ్‌ భవన్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
– విశ్వభూషణ్‌ హరిచందన్, గవర్నర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు
 ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు సాధించి తెలుగుజెండాను రెపరెపలాడించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర యూనిట్‌ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధించిన ఈ విజయాన్ని చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ట్వీట్‌ చేశారు. చిత్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం. కీరవాణి, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, హీరోలు తారక్‌ (జూనియర్‌ ఎన్టీఆర్‌), రామ్‌ చరణ్‌తోపాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలిపారు.
– వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి

తెలుగు పాటకు దక్కిన గౌరవం
‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడం భారతీయ సంగీతానికి, ప్రత్యేకంగా  తెలుగు పాటకు దక్కిన అద్భుత గౌరవమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో పాటు యావత్‌ చిత్ర యూనిట్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మన సంగీతం, మన కొరియోగ్రఫీ, మన దర్శకత్వం, మన చిత్రాలు మరింత గుర్తింపును అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు.
    – కిషన్‌ రెడ్డి, కేంద్రమంత్రి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top