
పిల్లల కోసం ఉద్యోగాలను త్యాగం చేస్తున్నారు కొందరు మహిళలు. ఏడాది నిండని కూతురు ఉన్నందున సెట్‌లో ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేయలేనంది దీపికా పదుకొణె. ఈ విషయంలో భేదాభిప్రాయలు రావడంతోనేగా.. స్పిరిట్ నుంచి తప్పుకుంది. అయితే తాను మాత్రం పిల్లల కోసం ఉద్యోగాల్ని పక్కన పెట్టలేనంటోంది బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్.
ఊహించలేదు
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో గౌహర్ ఖాన్ (Gauhar Khan) మాట్లాడుతూ.. 36 ఏళ్ల వయసులో నేను పెళ్లి చేసుకున్నాను. ఏడాదికే పిల్లల కోసం ప్లానింగ్ మొదలుపెట్టాం. తల్లినవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఒకసారి గర్భస్రావం కూడా జరిగింది. దాన్నుంచి కోలుకోవడానికి ఏడాదిన్నర పట్టింది. ఎందుకంటే అంతా మంచే జరుగుతుంది, నా చేతుల్లోకి చిన్ని బాబు/పాప రానుందన్న సంతోషంతోనే గడిపాను. ఇలా ఓ బిడ్డను కోల్పోవాల్సి వస్తుందని ఊహించం కదా! ఆ బాధ నుంచి అంత సులువుగా బయటకు రాలేకపోయాను.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
ఆ తర్వాతే నాకు కొడుకు జెహాన్ పుట్టాడు. ఇప్పుడు నేను 40 దాటేశాను. ఇప్పుడు రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ కనలేను. నా ఫస్ట్ , సెకండ్ ప్రెగ్నెన్సీల సమయంలో నేను షూటింగ్‌కు వెళ్లేదాన్ని. యాక్షన్ రోల్‌లో నటించాను. ఇప్పుడు మూడో ప్రెగ్నెన్సీ సమయంలో ఫౌజీ 2 సీరియల్‌లో బాంబ్ బ్లాస్టింగ్ సీన్‌లో యాక్ట్ చేశాను. ప్రాజెక్టు ఒప్పుకున్నాక దాన్ని అర్ధాంతరంగా వదిలేయలేను. నటిగా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అదేంటో కానీ, గర్భం దాల్చినప్పుడే క్లిష్టమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తోంది అని గౌహర్ చెప్పుకొచ్చింది.
ఆ పాటతో టాలీవుడ్‌లో ఫేమస్
గౌహర్.. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన జైద్ దర్బార్‌ను 2020లో పెళ్లి చేసుకుంది. 2023లో వీరికి బాబు పుట్టాడు. త్వరలోనే మరోసారి తల్లి కాబోతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో నా పేరే కాంచనమాల అనే స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది. బాలీవుడ్‌లో గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాల్లో నటించింది. తాండవ్ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ ఏడో సీజన్ విజేతగానూ నిలిచింది.
చదవండి: పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే!: విష్ణు