
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి లోగన్ దర్శకత్వం వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేష్ రైనా క్రికెట్ నేపథ్యంలో రానున్న ఈ తమిళ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేయనున్నారు. డ్రీమ్ నైట్ స్టోరీస్ బ్యానర్‌పై శ్రవణ కుమార్ ఈ సినిమా నిర్మించనున్నారు. చెన్నైలో జరిగిన వేడుకలో ఈ చిత్రాన్ని ప్రకటించారు. క్రికెటర్ శివమ్ దూబే నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సురేష్ రైనా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘క్రికెట్ మైదానం నుంచి కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న సురేష్ రైనా వర్చ్యువల్‌గా ఈ ఈవెంట్‌లోపాల్గొని, తన సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కుప్రాతినిధ్యం వహించిన రైనా చిన్న తల (చిన్న నాయకుడు)గా తమిళనాడులో విశేష అభిమానులను సంపాదించుకున్నారు.