ఆమె మరణం తీరని లోటు | Film industry mourns legendary singer Asha Bhosle | Sakshi
Sakshi News home page

ఆమె మరణం తీరని లోటు

Apr 13 2026 6:01 AM | Updated on Apr 13 2026 6:01 AM

Film industry mourns legendary singer Asha Bhosle

ప్రముఖుల నివాళి

‘‘ఓ మధురమైన స్వరాన్ని కోల్పోయాం. ఆమె మరణం తీరని లోటు’’ అంటూ పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆశా భోంస్లేకి నివాళి అర్పించారు.

తరతరాలుగా విభిన్నమైన భావోద్వేగాలను పలికిస్తూ, ఆశా భోంస్లేగారి గాత్రం భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి పాటకూ గ్రేస్, విలక్షణతను తీసుకువచ్చిన ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తాను. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని స్వరాన్ని కోల్పోయింది.
– నటుడు చిరంజీవి

శాశ్వతమైన గాయనీ...! అంటూ తాను నటించిన ‘చాచీ 420’ సినిమాలో ఆశా భోంస్లే పాడిన పాట ‘జాగో ఘోరీ..’ను, ఆమెతో తాను ఉన్న క్లిప్పింగ్స్‌ను షేర్‌ చేశారు.
– నటుడు కమల్‌హాసన్‌.

ఆశా భోంస్లేగారి మరణంతో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె స్వరం కేవలం సంగీతం మాత్రమే కాదు... మన జీవితాల్లోని ప్రతి దశను స్పృశిస్తూ మనతో జీవించిన ఒక భావోద్వేగం. తరతరాలుగా ఆమెలా ప్రజల హృదయాలను తాకిన కళాకారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆమె మనల్ని వదిలి వెళ్లిపోయి ఉండొచ్చు. ఆమె స్వరం ఎప్పటికీ నిలిచే ఉంటుంది.    
– నటుడు మోహన్ బాబు

దశాబ్దాల పాటు ఆశా భోంస్లేగారి మ్యాజికల్‌ వాయిస్‌ భారతీయ సినిమాకు ్రపాణంగా నిలిచి, లక్షలాది హృదయాలను తాకింది. తరతరాలుగా నిలిచిపోయే జ్ఞాపకాలను ఆమె వదిలి వెళ్లారు. ప్రేమ, గౌరవాలతో ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం.    
    – నటుడు ఎన్టీఆర్‌

భారతీయ సంగీతానికి తీరని లోటు. ఆశా భోంస్లేగారి గాత్రం స్వచ్ఛమైన మ్యాజిక్‌ అండ్‌ ఎమోషన్ . ఆమె లెగసీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆశాగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.    
– నటుడు రామ్‌చరణ్‌

ఆశా భోంస్లేగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. తరతరాలను నిర్వచించిన ఆమె స్వరం ఎప్పటికీ నిలిచిపోతుంది.    
– అల్లు అర్జున్‌

భారతీయ సంగీతానికి తీరని లోటు. మీ స్వరానికి సాటి లేదు... మీ పాటలు తరతరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. 
    – నటుడు సల్మాన్  ఖాన్‌

ఆశా తాయ్‌ (మరాఠీలో పెద్దక్క అని అర్థం) మరణవార్త బాధ కలిగించింది. భారతీయ సినిమాకు ఆమె గాత్రం ఒక మూలస్తంభంలాంటిది. భవిష్యత్‌లో శతాబ్దాల పాటు ఆశాగారి గాత్రపు మాధుర్యం కొనసాగుతూనే ఉంటుంది.     
 – నటుడు షారుక్‌ ఖాన్‌

ఆశాగారి మరణం దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆమెకు నేను పెద్ద అభిమానిని. గొప్ప గాయకులు రఫీ, కిషోర్, లతగార్లు లేరు. ఇప్పుడు ఆశాగారూ మనకు దూరమయ్యారు. ఓ శకం ముగిసిందని నాకు అనిపిస్తోంది. ఆశాగారి మరణం ఫిల్మ్‌ ఇండస్ట్రీకి మాత్రమే కాదు... దేశం, ప్రపంచానికే నష్టం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. 
    – నటుడు ఆమిర్‌ ఖాన్‌

మన దేశానికి స్వాతంత్య్రం లభించి, 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘హర్‌ ఘర్‌ తిరంగ’ అనే పాటను ఆమెతో కలిసి రికార్డు చేసే అవకాశం నాకు లభించింది. మా అమ్మని కాకుండా నేను అమ్మా అని పిలిచే మరొక వ్యక్తి ఆశాగారు మాత్రమే. ‘శ్రీవల్లీ..’ సాంగ్‌ (పుష్ప: ది రైజ్‌’లోని పాట..) ఆమెకు నచ్చింది. ఆశా అమ్మ... మిమ్మల్ని చాలాసార్లు కలిసే చాన్స్‌ నాకు దక్కింది. అది నాకు పెద్ద ఆశీర్వాదం. సంగీతం పట్ల మీ అంకితభావం, ప్యాషన్ ను నేను ప్రత్యక్షంగా చూశాను.    
– సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌

ఆమె గాత్రం ఒక మ్యాజిక్‌. ఆమెతో ఓ సాంగ్‌ను షేర్‌ చేసుకునే గౌరవం నాకు లభించింది. ఆశాగారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. భారతీయ సంగీతానికి ఆమె మరణం తీరని లోటు. 
– నటుడు సంజయ్‌ దత్‌

ఒక శకం ముగిసింది. నేను ముంబైలో ఎక్కడున్నా ప్రభుకుంజ్‌ (ముంబైలో ఆశా ఎక్కువ కాలం నివసించిన భవనం) దాటి వెళ్తున్నప్పుడు తొలుత లతాగారికి ఫోన్  చేసేదాన్ని. ఆ తర్వాత ఆశాజీగారిని కలిసేదాన్ని. ఆమె స్థానాన్ని మరొక సింగర్‌  భర్తీ చేయలేరు.
– గాయని ఉషా ఉతుప్‌

మనందరికీ, భారతీయ సంగీతానికి ఎంతో బాధాకరమైన రోజు ఇది. మన ప్రియమైన ఆశా సోదరి ఇక లేరన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆమె స్వరం ఎప్పటికీ జీవించే ఉంటుంది.
– గాయకుడు–సంగీతదర్శకుడు శంకర్‌ మహదేవన్‌

తన పాటలకు జీవకళను అద్ది, ఎంతో ప్రత్యేకతను చాటుకున్న ఆశాగారు ఇక లేరనే విషయం నమ్మశక్యంగా లేదు. ఆశాగారితో నాకు ప్రత్యేకమైన భావోద్వేగంతో కూడిన అనుబంధం ఉంది. అందుకే ఆమె ఇక లేరన్న విషయం నాకు కష్టంగా అనిపిస్తోంది. నేను నటించిన సినిమాల్లోని పాటలను ప్రత్యేకమైన తన గాత్రం, శైలితో పాపులర్‌ చేశారామె. చిత్ర పరిశ్రమలో నా ఎదుగుదలలో భాగస్వామ్యమైన లతా, ఆశాగార్లతో నాకు మంచి అనుబంధం ఉంది. 
    – నటి హేమ మాలిని

భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిభాశాలి అయిన ఒక గాయనిని కోల్పోయిన రోజు ఇది. ఆమె నాతో ఎంత ప్రేమాభిమానాలతో ఉండేవారో, గాయనిగా అంతే గౌరవమర్యాదలతో నడుచుకునేవారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేని ఓ స్థానంలో ఉంటారామె. వేరే ఏ స్వరంతోనూ పోల్చలేని ఓ ప్రత్యేకమైన స్వరం ఆమెది. ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా నన్ను కలిసేవారు. నా ఆత్మీయ సోదరి.   
 – సంగీతదర్శకుడు ఇళయరాజా

ఆశాగారు తన గాత్రంతో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఆమె గొప్ప కళాకారిణి.     
– సంగీతదర్శకుడు, ఏఆర్‌ రెహమాన్‌

ఆమె గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోతాయా? ఆమె సాధించలేనిదంటూ ఏమైనా ఉందా? పనులు ఎలా చేయాలో మా అందరికీ చూపించిన వ్యక్తి. నిజమైన మార్గదర్శకురాలు.    
– గాయని చిన్మయి

ఆశాజీ మరణవార్త విని నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆశాజీని కోల్పోవడం అంటే మా అమ్మగారిని రెండోసారి కోల్పోయిన ఫీలింగ్‌ కలుగుతోంది. ఈ సంగీత ప్రపంచంలో నా వేలు పట్టుకుని, నా చేత తొలి అడుగులు వేయించి, నాకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, నా మొట్టమొదటి స్వరకల్పనకు గాత్రం అందించారు ఆమె. బహుముఖ ప్రజ్ఞాశాలి. అద్భుతమైన గాయని. ఆమెలా మరొకరు ఎప్పటికీ రారు. ఒక శకం ముగిసింది.    
– గాయకుడు అనూ మాలిక్‌

ఆశా తాయ్‌ ఒక సింగర్‌గా, మంచి మానవతావాదిగా, లెజెండ్‌లా ఎప్పటికీ నిలిచిపోయే ఉంటారు. ఆమె స్వరానికి తగ్గట్లుగా మేం నటించేందుకు ముందే ప్రిపేర్‌ అయి, వస్తుంటాం. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆశాగారి సాంగ్‌ రికార్డింగ్‌ చూశాను. ఓ సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆ మెలోడి సాంగ్‌కు ఆమె చూపిన ప్రతభలో నటిగా నేను పది శాతం ప్రతిభ చూపినా నేనో గొప్ప యాక్టర్‌ అవుతానని ఆమెకు చెప్పాను.     
– నటి కాజోల్‌

నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సింగర్‌ ఆశాగారి మరణం నన్ను ఆలోచనల్లో పడేసింది. అప్పట్లో రెహమాన్  లాంటి కొత్త  సంగీత దర్శకుడితో ప్రయోగాలు చేయాలనే ఉత్సుకతతో వచ్చి, విప్పారిన కళ్లతో చూసిన ఓ పాపలా ఆమె కనిపించారు. చిన్న అడ్జెస్ట్‌మెంట్‌తో సింగిల్‌ టేక్‌లోనే ఈ పాట పూర్తయింది. ఆశ్చర్యకరంగా నా ‘కంపెనీ’ సినిమాలో ఆమె ‘ఖల్లాస్‌’ పాటను పాడారు. ఈ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తవుతున్నాయి. శాస్త్రీయ సంగీత మూలాలను, ఆధునిక లయల్లో విభిన్నమైన భావోద్వేగాలతో పలు భాషలకు అనుసంధానిస్తూ ఆమె స్వరం తరతరాలుగా నదీ ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది. మానవ భావోద్వేగాలను ఆమె ఆవిష్కరించినట్లు మరెవరూ ఆవిష్కరించలేరు. ఆశాజీ... మీరు మరొక చోటుకు వెళ్లి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ సంగీతం శాశ్వతంగా నిలిచే ఉంటుంది.
– దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ

ఆశా భోంస్లేగారు మధురమైన గానంతో ఎన్నో తరాలను అలరించారు. ఆమె ప్రతిభ, ఆమె స్వరం ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయి ఉంటాయి. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు అమూల్యమైనవి. ఈరోజు చాలా దుఃఖమైన రోజు. మహాగాయని మనతో లేకపోవడాన్ని నమ్మలేకపోతున్నాను. ఆమె నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. బాలీవుడ్‌లో తన అద్భుతమైన స్వరంతో నాకిచ్చినటువంటి అమోఘమైన పాటలు మరపురానివి. ‘శరాబీ’ చిత్రంలో ‘దే దే ప్యార్‌ దే..’, ‘తోఫా తోఫా’ పాటలు కానీ... తెలుగులో ‘పాలు నీళ్లు’ సినిమాలో ‘ఇది మౌనగీతం...’ అనే పాటను కానీ అద్భుతంగా ఆలపించారు. లతా మంగేష్కర్‌గారు కానీ, ఆశా భోంస్లే దీదీ కానీ నా జీవితంలో నాకిచ్చినటువంటి ఈ అనుభూతిని మర్చిపోలేను. ఆశా భోంస్లే లేని లోటు నాకే కాదు... వ్యక్తిగతంగా ప్రజలకు, సంగీత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ వారికి చెప్పలేని లోటు. అలాంటి గాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇక మనకు దొరకరేమో!    
    – నటి జయప్రద 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement