తప్పు తనదే అన్నాడు.. చరణ్‌లా ఏ హీరో ఒప్పుకోరు : ఫైట్‌ మాస్టర్‌ | Fight Master Nabakanth Talks About Peddi Movie | Sakshi
Sakshi News home page

‘పెద్ది’లో చరణ్‌ సిక్సర్‌ కొట్టే షాట్‌ నేనే కంపోజ్‌ చేశా

May 17 2026 10:21 AM | Updated on May 17 2026 10:49 AM

Fight Master Nabakanth Talks About Peddi Movie

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్‌ 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫైట్‌ మాస్టర్‌గా వర్క్‌ చేసిన నబా కాంత్‌ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ–‘‘మాది మణిపూర్‌. నా చిన్నప్పుడే నాన్నగారు హైదరాబాద్‌ వచ్చారు. నాన్నగారి స్ఫూర్తితో ఇదే ఫీల్డ్‌లో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నాను. స్టంట్స్‌లో నాకు  18 ఏళ్ల అనుభవం ఉంది. విజయ్, రామ్‌–లక్ష్మణ్‌ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్‌ మాస్టర్‌గా వర్క్‌ చేశాను. 

‘పుష్ప’ చిత్రంతో యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ అయ్యాను. ఆ సినిమా క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ చూసి, ‘మా పేరు నిలబెట్టావ్‌’ అని రామ్‌–లక్ష్మణ్‌ మాస్టర్లు అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. 

పుష్ప 2, మన శంకర వరప్రసాద్‌గారు, డెకాయిట్‌’ సినిమాలకు వర్క్‌ చేశాను. తాజాగా ‘పెద్ది’ సినిమా చేశాను. ఫస్ట్‌ గ్లింప్స్‌లో సరికొత్త బ్యాటింగ్‌ స్టైల్‌తో చరణ్‌గారు సిక్సర్‌ కొట్టే షాట్‌ను నేనే కంపోజ్‌ చేశాను. మా గురువుగారు రామ్‌–లక్ష్మణ్‌మాస్టర్లు ఈ సినిమాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌ ఎపిసోడ్‌ చేశారు. 

ఈ సినిమాలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తున్నప్పు‍డు చరణ్‌కి గాయమైంది.  ఓ రోల్‌ మూమెంట్‌లో తనకి పొరపాటున అలా జరిగింది. ఆ క్షణంలో నేను ఏడ్చేశాను. కానీ, చరణ్‌ మాత్రం పొరపాటు తనవైపే ఉందని చెప్పారు. నిజంగా ఏ హీరో అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్‌కి ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేయించుకుని మరుసటి రోజే షూట్‌కి వచ్చేశారు. నేనైతే షాక్‌ అయిపోయా.

ఇందులో కుస్తీ సీక్వెన్స్‌ కోసం బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌గారి నాన్నగారు శ్యామ్‌ కౌశల్‌ను సంప్రదించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ‘పెద్ది’ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఎమోషన్స్‌కు కనెక్ట్‌ అవుతారు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్‌’, విజయ్‌ దేవరకొండ ‘రౌడీ జనా ర్ధన’, చిరంజీవి–బాబీ, సల్మాన్‌ఖాన్‌–వంశీగార్ల సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement