బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన చేదు బాల్యాన్ని బయటపెట్టింది. తన తండ్రి దర్శకనిర్మాత కమ్రాన్ ఖాన్ నిర్మించిన ఒక్క సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్నామంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ మాట్లాడుతూ.. ఐసా భీ హోతా హై సినిమాపై నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీశాడు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది.
కటిక పేదరికంలోకి
ఆ మూవీ శుక్రవారం రిలీజైతే ఆదివారానికల్లా కటిక పేదరికంలోకి నెట్టివేయబడ్డాం. ఎంతో ధనవంతుడైన నాన్న పేదవాడయిపోయాడు. తన కలలు ఛిద్రం కావడం తట్టుకోలేకపోయాడు. మద్యపానానికి బానిసయ్యాడు. రాత్రి అయిందంటే చాలు మేమంతా వణికిపోయేవాళ్లం. అంతలా తాగేవాడు. ఒకే ఒక్క సినిమా మమ్మల్ని ఐదారేళ్లు వెనక్కు నెట్టేసింది. ఆయన తలెత్తుకోలేకపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు.
ఎవరికీ తెలీదు
13 ఏళ్లు ఏ పనీ చేయలేదు. అమ్మానాన్న విడిపోయినా కూడా ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. నాన్న దర్శకుడిగా విఫలమైనందున నేను డైరెక్టర్ అయి మంచి పేరు తేవాలనుకున్నాను. అలా చిన్నతనంలో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఎక్కువ చిత్రాలు చూసేవాదాన్ని. అయితే నాన్న ఎప్పుడూ కొడుకు గురించి ఆశపడేవాడు. సాజిద్ (ఫరా సోదరుడు) పుట్టాక నన్ను కాస్త పక్కనపెట్టేశాడు.
నాన్న చనిపోయినప్పుడు
నాన్నకు నేనంటే ప్రేమ ఉందని తెలుసు.. కానీ ఫోకస్ అంతా కొడుకుపైనే ఎక్కువ ఉండేది. అప్పుడు సక్సెస్ అవ్వాలన్న సంకల్పం నాలో మరింత బలపడింది. నాన్న చనిపోయినప్పుడు ఆయన జేబులో రూ.30 మాత్రమే ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ అన్నట్లుగానే హిందీ ఇండస్ట్రీలో మొదట కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకురాలిగా మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూయర్, తీస్‌మార్ ఖాన్ వంటి ఎన్నో సినిమాలు తెరకెక్కించింది.


