అడుసు తొక్కనేల.. కాలు కడగనేల! గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సారీ చెప్పాడు తమిళ దర్శకుడు, నటుడు ఆర్.పార్తీబన్. ఓపక్క హీరో విజయ్ విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లాడీ హీరో. దీంతో కొన్నాళ్లపాటు త్రిష బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని పార్తిబన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది.
కుల ప్రస్తావన
ఇంతలోనే మరో వివాదంలో ఇరుక్కున్నాడు పార్తిబన్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన కులం గురించి ప్రస్తావిస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. స్టేజీపై కులం ప్రస్తావన తేవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. నేను ఎలాంటి తప్పునైనా సరే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. నిజం చెప్తున్నా.. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు.
ఇదే మొట్టమొదటిసారి
ఏదో నోరు జారాను. ఇన్నేండ్ల అనుభవంలో కుల ప్రస్తావన తేవడం ఇదే మొట్టమొదటిసారి. కానీ, కులానికి ప్రాధాన్యతనిచ్చేవారిని నేను అస్సలు ఇష్టపడను. కుల వ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. అనుకోకుండా పొరపాటు జరిగింది. అందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలతో ఎంతోమందిని బాధపెట్టానని అర్థమైంది.
క్షమించండి
నేను కేవలం నా ప్రతిభను నమ్ముకుంటానే తప్ప కులాన్ని వాడుకునే వ్యక్తిని కాను. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదని మాటిస్తున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహించండి.
సినిమా
మీరు నాపై ఉంచిన ప్రేమను, నమ్మకాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాను అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.
చదవండి: పీలింగ్స్ సాంగ్ బానే చూశారుగా.. ఈ పాటకెందుకంత రాద్ధాంతం?


