రజినీ, కమల్‌తో సినిమాలు.. ఆపై వ్యభిచారం..చివరికి ఎయిడ్స్‌తో..! | Ekta Kapoor Announces The Dirty Picture 2 Rumours Point To Tragic Star Nisha Noor Story, Know Unknown Interesting Facts About Her | Sakshi
Sakshi News home page

The Dirty Picture 2: సిల్క్‌స్మిత తర్వాత మరో విషాదగాథ.. ఈమెదేనా?

Oct 13 2026 1:08 PM | Updated on Oct 13 2026 1:43 PM

Ekta Kapoor Announces The Dirty Picture 2 Rumours Point To Tragic Star Nisha Noor Story

ఒకప్పుడు వెండితెరపై గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని.. అగ్ర హీరోల సరసన నటించి.. చివరకు అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూసిన నటీమణుల జీవితాలు ఎన్నో ఉన్నాయి.అలాంటి కథతోనే తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్‌’ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.  సిల్క్‌ స్మిత జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా రూపొందిన ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాత ఏక్తా కపూర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

 చిత్ర పరిశ్రమలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఓ మహిళ నిజజీవిత కథతో ‘ది డర్టీ పిక్చర్‌ 2’ను రూపొందించనున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో కథానాయికగా కనిపించబోయేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.  ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో వెలిగిన నటి నిషా నూర్‌ జీవితమే  ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ సినిమాల్లో..
1980 కాలంలో తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నిషా నూర్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి అగ్ర నటుల సినిమాలతో పాటు పలు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో ఆమె నటించారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెకు గ్లామర్‌ పాత్రలతో మంచి గుర్తింపు లభించింది.

నిషా నూర్‌ నటించిన చిత్రాల్లో ‘టిక్‌ టిక్‌ టిక్‌’, ‘కళ్యాణ అగతిగళ్‌’, ‘అయ్యర్‌ ది గ్రేట్‌’, ‘ఇళమై కోలంగల్‌’, ‘ఎంగ ఊరు కవల్కారన్‌’ వంటి సినిమాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.  వీటిలో ‘టిక్‌ టిక్‌ టిక్‌’లో కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించగా, ‘కళ్యాణ అగతిగళ్‌’లో నిషా నూర్‌ కీలక పాత్ర పోషించారు. మలయాళ చిత్రాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేశారు.

అవకాశాలు తగ్గడంతో !
సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ సాగిన ఆమె కెరీర్‌ ఆ తర్వాత అనూహ్యంగా మలుపు తిరిగింది. అవకాశాలు తగ్గడం, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని పలు కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఆమెను వ్యభిచారంలోకి నెట్టాడనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇలా ఆమెకు ఎయిడ్స్‌ సోకిందని, చివరి రోజుల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవించారని అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి.  అయితే అధికారికంగా ధ్రువీకరించలేదు. చివరిగా 2007లో ఆమె కన్నుమూశారు.

‘ది డర్టీ పిక్చర్‌ 2’ కథ?
సిల్క్‌ స్మిత జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్‌’లో విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ది డర్టీ పిక్చర్‌ 2’ తెరకెక్కనుందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

(ఇదీ చదవండి: 'ఆ కారణం వల్లే సినిమాలకు బ్రేక్'.. మృణాల్ ఠాకూర్)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement