సంగీతం నచ్చలేదని నా పేమెంట్‌ ఆపేశారు : ఏఆర్‌ రెహమాన్‌ | AR Rahman Reveals Rockstar Producer Disliked His Music, Delayed Payment By 8 Months | Sakshi
Sakshi News home page

సంగీతం నచ్చలేదని నా పేమెంట్‌ ఆపేశారు : ఏఆర్‌ రెహమాన్‌

Nov 29 2026 2:54 PM | Updated on Nov 29 2026 3:08 PM

AR Rahman Reveals Rockstar Producer Disliked His Music, Delayed Payment By 8 Months

బాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘రాక్‌స్టార్‌’ సినిమాకు సంగీతం అందించిన ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రానికి పనిచేసే సమయంలో నిర్మాత తన సంగీతాన్ని ఇష్టపడలేదని.. అందుకే సినిమా విడుదలైన తర్వాత కూడా తన పారితోషికం కోసం దాదాపు 8 నెలలు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయం దర్శకుడు ఇంతియాజ్‌ అలీకి కూడా చెప్పలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి: ‘ఆటో జానీ’గా చిరంజీవి.. కొత్త పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన ‘కాకా’

డెహ్రాడూన్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ఇంతియాజ్‌ అలీతో కలిసి పాల్గొన్న రెహమాన్‌.. తమ సుదీర్ఘ క్రియేటివ్‌ జర్నీలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ‘రాక్‌స్టార్‌’, ‘హైవే’ సినిమాల సమయంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ఇద్దరూ గుర్తుచేసుకున్నారు.

నా సంగీతం నచ్చలేదు
‘రాక్‌స్టార్‌’కు సంబంధించిన పారితోషికం గురించి రెహమాన్‌ మాట్లాడుతూ.. నిర్మాత తన సంగీతం నచ్చలేదని చెప్పడంతో తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని నిలిపివేశారని తెలిపారు. ఆ సమయంలో సంగీతకారుల పారితోషికాలతో పాటు తన ప్రయాణ ఖర్చులను కూడా తానే భరించానని చెప్పారు. ‘నిర్మాత నుంచి నాకు ఒక్క పైసా కూడా రాలేదు. ఈ విషయం ఇంతియాజ్‌కు కూడా చెప్పలేదు. సినిమా విడుదలైన తర్వాత దాదాపు ఎనిమిది నెలలకు నాకు చెక్‌ వచ్చింది’అని రెహమాన్‌ వెల్లడించారు.

ఒక్క పాట అనుకుంటే.. 14 పాటలయ్యాయి
‘రాక్‌స్టార్‌’ తర్వాత రెహమాన్‌–ఇంతియాజ్‌ జోడీ ‘హైవే’ కోసం మరోసారి కలిసి పనిచేసింది. ఈ సినిమాకు తొలుత ఒక్క పాట మాత్రమే ఉంటుందని ఇంతియాజ్‌ భావించారట. కానీ రెహమాన్‌తో కలిసి పనిచేయడం మొదలైన తర్వాత ఆ సంఖ్య ఏకంగా 14కి చేరింది. దీంతో ‘రాక్‌స్టార్‌’ కంటే ‘హైవే’లోనే ఎక్కువ పాటలు ఉన్నాయని ఇంతియాజ్‌ సరదాగా గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ఎన్టీఆర్‌.. సీక్వెల్స్‌తో ప్రభాస్‌

నచ్చని పాటే భారీ హిట్‌
ఏ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ముందుగానే అంచనా వేయడం కష్టమని రెహమాన్‌ అన్నారు. ‘రాక్‌స్టార్‌’లోని ‘షహర్‌ మే హూన్‌ మై తేరే’ పాట తమకు తొలుత అంతగా నచ్చలేదని చెప్పారు. అయితే అదే పాట యూఏఈలో దాదాపు నాలుగు నెలల పాటు నంబర్‌ వన్‌గా నిలిచిందని గుర్తుచేసుకున్నారు.

2011లో విడుదలైన ‘రాక్‌స్టార్‌’లో రణ్‌బీర్‌ కపూర్‌, నర్గిస్‌ ఫక్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రెహమాన్‌ అందించిన సంగీతం విశేష ఆదరణ పొందింది. ‘రాక్‌స్టార్‌’, ‘హైవే’తో మొదలైన రెహమాన్‌–ఇంతియాజ్‌ అలీ ప్రయాణం ‘తమాషా’, ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’ వరకు కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement