Oscar 2023: ఆస్కార్‌ రియల్‌ విన్నర్‌.. అవార్డుకు కారణమైన ఏకైక వ్యక్తి!

Do you know Who Was Behind Why Natu Natu Song Won Oscar Award? - Sakshi

నాటు నాటు.. కేవలం రెండక్షరాల పదం.. ఏముంది ఆ పాటలో అంటారా? అక్కడికే వస్తున్నాం.. అమ్మచేతి పెరుగు ముద్దలో ఉన్నంత కమ్మదనం.. తండ్రి గంభీరం వెనక దాగి ఉన్న ప్రేమ.. పరీక్షలో ఫెయిలై అభాసుపాలైతే ఎలాగైనా క్లాస్‌ ఫస్ట్‌ రావాలన్న కసి.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న లక్ష్యం.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. డీజే పాటలు, అర్థం కాని సంగీతం, తెలుగు, ఇంగ్లీష్ కలగలిపిన లిరిక్స్‌.. ఇవే ట్రెండ్‌గా మారిన తరుణంలో మట్టిలో మాణిక్యాంలా వచ్చింది నాటు నాటు.

అన్నింటినీ పక్కకు నెట్టి అందరి చెవుల్లో అమృతం పోస్తూ, మర్చిపోతున్న పల్లెదనాన్ని ముందుకు తెస్తూ అందరినీ కదిలించిందీ సాంగ్‌.  కేవలం విని సంతోషించేలా కాదు అందరిచేత స్టెప్పులేయించింది. అదీ ఈ పాట గొప్పతనం.. ఈ పాట ఆస్కార్‌ వరకు వెళ్లడం అంత చిన్న విషయం కాదు. మరి దీని వెనక ఉన్నదెవరో తెలుసా? కార్తికేయ. ఈ విషయాన్నే కీరవాణి స్వయంగా ఆస్కార్‌ అందుకునే సమయంలో చెప్పాడు. అంత పెద్ద వేదికపై కార్తికేయకు థ్యాంక్స్‌ చెప్పడంతో అందరి దృష్టి అతడిపై పడింది.

ఎవరీ కార్తికేయ?
కార్తికేయ మరెవరో కాదు రమాకు మొదటి భర్త వల్ల కలిగిన సంతానమే కార్తికేయ. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించి కథ రచన మొదలు.. ఆస్కార్‌ గెలుపుదాకా అన్నింట్లో కార్తికేయ కృషి ఉంది. మార్కెటింగ్‌, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు, ఆస్కార్‌ పొందడానికి తగిన కార్యాచరణ మొత్తం ఆర్గనైజ్‌ చేసింది కార్తికేయ. ఓ సందర్భంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా 'కార్తికేయ వెంటపడతాడు, కార్యశూరుడు' అంటూ మెచ్చుకున్నాడు. విమర్శలు, వివాదాల జోలికి పోకుండా తెర వెనుక సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతాడు. తెరపై మాత్రం రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్‌, ప్రేమ్‌ రక్షిత్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ తదితరులు కనిపిస్తారు.

ఆస్కార్‌ గెలుపుతో చంద్రబోస్‌, కీరవాణికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ ఈ అవార్డు రావడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కాలభైరవే! తను లేకపోతే ఆ అవార్డే లేదు. కనీసం దాని ముంగిటకు కూడా రాకపోయేవారేమో! అందుకే కార్తికేయ కష్టాన్ని గుర్తించిన కీరవాణి అకాడమీ వేదిక మీద తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరుసకు కొడుకైనా కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయాడు. పాట రూపొందించడం ఒక ఎత్తయితే దాన్ని మార్కెటింగ్‌ చేసుకోవడం మరో ఎత్తు. మన పాటకు ప్రపంచమే ఊగిపోవాలె అన్న రీతిలో ప్రమోషన్స్‌ చేశాడు. ఈ విషయంలో కార్తికేయను మెచ్చుకోవాల్సిందే! తనే కనక పట్టుబట్టి ఉండకపోతే ఆస్కార్‌ కల నిజం కాకపోయేదేమో!

గతంలో మనకు ఆస్కార్‌ రాలేదా?
సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా నాటు నాటు పాటే! భారత్‌ గెలిచిన తొలి ఆస్కార్‌ ఇదే అన్నంత రీతిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో మనకు ఆస్కార్‌ రాలేదా? అంటే వచ్చాయి. భాను అథైయా(బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌), సత్యజిత్‌ రే, రసూల్‌ పూకుట్టి(బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌), గుల్జర్‌ (బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ లిరిక్స్‌), ఏఆర్‌ రెహమాన్‌(బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ మ్యూజిక్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌) వివిధ కేటగిరీల్లో అకాడమీ అవార్డులు అందుకున్నారు.  మదర్‌ ఇండియా, లగాన్‌, సలాం బొంబాయి వంటి సినిమాలు ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాయి. కానీ ఏ సినిమా ఇప్పటివరకు ఆస్కార్‌ను గెలుచుకోలేదు. ఈసారి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో ఆస్కార్‌కు పంపుతారనుకుంటే మొండిచేయి ఎదురైంది. భారత్‌ నుంచి గుజరాతీ సినిమా ఛెల్లో షోను పంపారు కానీ ఆదిలోనే దాన్ని తిరస్కరించడంతో సినీప్రియులు నిరాశచెందారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను పంపి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top