చిన్న చిన్న విషయాలకు కూడా ‘థ్యాంక్యూ’ చెబుతున్నారు: డైరెక్టర్‌

Director Vikram K Kumar Talks About Thank You Movie - Sakshi

‘‘మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మందికి థ్యాంక్స్‌ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అహం లేకుండా మనం థ్యాంక్స్‌ చెబితే ఎదుటివారు పడే ఆనందం మన మనసుకు సంతృప్తినిస్తుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చాలామంది కథ. అందరికీ కనెక్ట్‌ అవుతుంది’’ అని డైరెక్టర్‌ విక్రమ్‌ కె. కుమార్‌ అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ విలేకరులతో చెప్పిన విశేషాలు.

► ‘మనం’ తర్వాత నేను, చైతు మరో సినిమా చేద్దామని నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఆ సమయంలో బీవీఎస్‌ రవిగారు రాసిన ‘థ్యాంక్యూ’ కథ వచ్చింది. ఆ కథ వినగానే కనెక్ట్‌ అయ్యాను. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ నేనే కథలు రాశాను. తొలిసారి ఓ రచయిత కథకి దర్శకత్వం వహించాను. ఈ చిత్రం సోల్, హార్ట్‌ రవిదే.. కానీ ట్రీట్‌మెంట్‌ నాది.
► ‘థ్యాంక్యూ’ అనేది పవర్‌ఫుల్‌ పదం. దాని విలువ చాలామందికి తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్‌ చెబుతున్నారు. థ్యాంక్స్‌ విలువని మా సినిమాలో చెప్పాం. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లితండ్రులకు థ్యాంక్స్‌ చెప్పాలి. నేను మా నాన్నకి థ్యాంక్స్‌ చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు.
► ఈ చిత్రంలో అభిరామ్‌ పాత్రలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. ఒక్కో వేరియేషన్‌కి ఒక్కో హీరోయిన్‌ ఉంటుంది. అభిరామ్‌ జీవితంలో రాశీ ఖన్నాది ముఖ్యమైన పాత్ర. మాళవికా నాయర్‌ కూడా వందశాతం ఎఫర్ట్‌ పెట్టి నటించింది. అవికా గోర్‌ కూడా అద్భుతమైన నటి.
► ‘ఆర్య’ సినిమా నుంచి ‘దిల్‌’ రాజుగారితో పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.. అది ‘థ్యాంక్యూ’తో కుదిరింది. మా కాంబినేషన్‌లో వస్తున్న పర్ఫెక్ట్‌ మూవీ ఇది. ఇక మా చిత్రానికి తమన్‌ అందమైన సంగీతం ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్‌ పీసీ శ్రీరామ్‌గారితో ‘థ్యాంక్యూ’ నా మూడో సినిమా. ప్యాషనేట్‌ ఫిల్మ్‌ మేకర్‌ అయిన ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని ఎడిటర్స్‌లో బెస్ట్‌ ఎడిటర్‌ నవీన్‌ నూలిగారు. అద్భుతంగా ఎడిటింగ్‌ చేశారు.
► నాగచైతన్యతో నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దూత’ వెబ్‌ సిరీస్‌ హారర్‌ నేపథ్యంలో ఉంటుంది. నాగచైతన్య పోర్షన్‌ షూటింగ్‌ పూర్తయింది. పదిహేను రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది.
► ‘24’ సినిమాకు సీక్వెల్‌ ఆలోచన ఉంది. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్‌ జోనర్‌ సినిమాలంటే ఇష్టం. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత తెలుగులో మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఓ చిత్రం ఉంటుంది..    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top