ఇంతపెద్ద సీనా... ఎవరు చేస్తారండీ | Director Subhash Ghai Talk On Hero Movie In Indian Idol 12 | Sakshi
Sakshi News home page

నటుడి  మైనస్‌ను ప్లస్‌ చేసిన దర్శకుడు

Jan 25 2021 11:06 AM | Updated on Jan 25 2021 11:07 AM

Director Subhash Ghai Talk On Hero Movie In Indian Idol 12 - Sakshi

‘హీరో’లో జాకీష్రాఫ్‌

‘హీరో’ సినిమా కోసం జాకీష్రాఫ్‌ను తీసుకున్నాక దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ ‘నీకు ఫ్లూట్‌ తెలుసా?’ అని అడిగాడు. ‘ఆ... దూరం నుంచి ఒకసారి చూశాను’ అన్నాడు జాకీష్రాఫ్‌. సుభాష్‌ ఘాయ్‌ గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ‘హీరో’ సినిమాలో హీరో ఫ్లూటిస్ట్‌. సినిమా సంగీతం అంతా ఫ్లూట్‌ మీదే ఆధారపడి ఉంది. జాకీ ష్రాఫ్‌కు ఫ్లూట్‌ పట్టుకోవడం కూడా రాదు. ఈ మైనస్‌ను తాను ఎలా ప్లస్‌ చేశాడో ‘ఇండియన్‌ ఐడెల్‌’ తాజా ఎపిసోడ్‌లో సుభాష్‌ ఘాయ్‌ విశేషంగా చెప్పారు.

1983లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ‘హీరో’. సుభాష్‌ ఘాయ్‌ని ‘షో మేన్‌’ను చేసిన సినిమా ఇది. దీనికి ముందు సుభాష్‌ ఘాయ్‌ రిషి కపూర్‌తో ‘కర్జ్‌’ ఇచ్చాడు. అయితే ఈసారి పూర్తిగా కొత్త వాళ్లతో సినిమా తీద్దామనుకున్నాడు. ఈ విషయం తెలిసిన జాకీ ష్రాఫ్‌ సుభాష్‌ ఘాయ్‌ని కలిశాడు. అతను అప్పటికి మోడల్‌గా పని చేస్తున్నాడు. ‘నీకు యాక్టింగ్‌ వచ్చా’ అని అడిగాడు సుభాష్‌ ఘాయ్‌. ‘రాదు’ అన్నాడు జాకీ. ‘ఏదీ... ఈ సీన్‌ చేసి చూపించు’ అనంటే సీన్‌పేపర్‌ తీసుకుని ‘ఇంతపెద్ద సీనా... ఎవరు చేస్తారండీ’ అన్నాడు. ఆ ఫ్రాంక్‌నెస్‌ సుభాష్‌కు నచ్చింది. ‘నువ్వే నా సినిమా హీరో’ అని అప్పటికప్పుడు చెప్పేశాడు. దానికి జాకీ ష్రాఫ్‌ ఆశ్చర్యపోయి ‘సార్‌... నేను నిజాలు మాట్లాడే మనిషిని. ఈ మధ్యే ఒక సినిమాలో శక్తికపూర్‌ అసిస్టెంట్‌కు అసిస్టెంట్‌గా నటించా.

నన్ను మీరు హీరో అంటున్నారు. ఆలోచించుకోండి’ అన్నాడు. ఆ మాటలకు ఇంకా నచ్చేశాడు సుభాష్‌ ఘాయ్‌కు. ‘హీరో’ సినిమా షూటింగ్‌ మొదలైంది. అందులో హీరో ఫ్లూట్‌ వాయిస్తుంటాడు. ‘నాకు ఫ్లూట్‌ పట్టుకోవడం కూడా రాదు’ అన్నాడు జాకీ ష్రాఫ్‌. టేప్‌ రికార్డర్‌లో ఫ్లూట్ల బిట్‌ వస్తుంటే తెల్ల ముఖం వేసుకుని చూస్తున్నాడు. ‘సరే... నీకు మెడ ఊపడం వచ్చా?’ అని అడిగారు సుభాష్‌ ఘాయ్‌. ‘వచ్చు’ అన్నాడు జాకీ ఫ్రాఫ్‌. ‘అయితే ఫ్లూట్‌ పట్టుకుని దాని ధ్వని ఎలా పోతుంటే అలా తల ఊపు. అప్పుడు నీ తలను చూస్తారు. వేళ్లను కాదు’ అన్నారు సుభాష్‌ ఘాయ్‌. జాకీ ష్రాఫ్‌ అలాగే ఊపాడు. సినిమా చూస్తే అతను నిజంగా వాయిస్తున్నట్టు ఉంటుంది. 

ఈ విశేషాలు జనవరి 23న ప్రసారం అయిన ‘ఇండియన్‌ ఐడెల్‌’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుభాష్‌ చెప్పారు. ‘కర్జ్‌’లో ‘ఓం శాంతి ఓం’ పాట రికార్డు చేయడానికి కిశోర్‌ కుమార్‌ కోసం 4 నెలలు వెయిట్‌ చేశారట ఆయన. ‘నా కోసం ఎందుకు? వేరే ఎవరి చేతైనా పాడించవచ్చుగా’ అని కిశోర్‌ కుమార్‌ అడిగితే ’ఈ పాటకు నాకు పెర్ఫార్మర్‌ కావాలి. మీకు మించిన పెర్‌ఫార్మర్‌ ఎవరున్నారు’ అన్నారట సుభాష్‌. ‘ఆ పాట ఆయన వల్లే అంత బాగుంది’ అన్నారాయన.

‘తాళ్‌’ సినిమా కోసం రహమాన్‌ని బుక్‌ చేశాక రహమాన్‌ని తీసుకొని గీత రచయిత ఆనంద్‌ బక్షీ ఇంటికి వెళ్లారట. అక్కడ ఇద్దరికీ ఒకరినొకరిని పరిచయం చేసి 15 నిమిషాలు కూచుంటే ఇద్దరూ ఒక్క మాట మాట్లాడుకోలేదట. దానికి కారణం ఆనంద్‌ బక్షీకి ఇంగ్లిష్‌ రాదు. రహమాన్‌కు హిందీ రాదు. ‘సుభాష్‌ ఘాయ్‌ వల్లే నేను హిందీ నేర్చుకున్నాను’ అని రహమాన్‌ ఈ ఎపిసోడ్‌లో వీడియో సందేశంలో అన్నాడు. తాళ్‌ పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. నిజంగా సుభాష్‌ ఘాయ్‌ పెద్ద షో మేన్‌. పామరుణ్ణి రంజింప చేసిన దర్శకుడు. జనవరి 24 ఆయన జన్మదినం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement