దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అంటే గుర్తొచ్చేది అద్భుతమైన సినిమాలు.. బాక్సాఫీస్ రికార్డులు.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన విజయాలు. కానీ, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా భార్య రామా రాజమౌళితో ఆయన ప్రేమకథ ఎలా మొదలైంది? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు? వారి దాంపత్య జీవితం ఇన్నేళ్లుగా ఇంత అన్యోన్యంగా సాగడానికి కారణమేంటి? గతంలో ఓ ఇంటర్వ్యూలో రామా రాజమౌళి పంచుకున్న విషయాలు ఈరోజు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా మరోసారి వైరల్ అవుతున్నాయి.
కుటుంబ పరిచయం నుంచి ప్రేమ వరకు..
రామా రాజమౌళి మాట్లాడుతూ.. తమ బంధం ఎలా మొదలైందో వివరించారు. రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి బంధువులని, కీరవాణి భార్య వల్లి ద్వారా ఆయనతో తమ కుటుంబానికి పరిచయం ఏర్పడిందని తెలిపారు. అలా మొదలైన పరిచయం కొన్నేళ్లపాటు కుటుంబ స్నేహంగా కొనసాగిందన్నారు. ఆ సమయంలో తమ మధ్య ప్రత్యేకమైన భావాలు ఏమీ లేవని చెప్పారు. అయితే, కాలక్రమేణా ఒకరినొకరు మరింత దగ్గరగా అర్థం చేసుకున్నామని, జీవితాంతం కలిసి ప్రయాణించగలమనే నమ్మకం కలిగిందని వెల్లడించారు. తమది పెద్ద ప్రేమకథ కాదని, ఒకరిపై మరొకరికి ఏర్పడిన అవగాహనే బంధాన్ని బలపరిచిందని వివరించారు.
‘శాంతినివాసం’ రోజుల్లో మరింత దగ్గరగా..
రాజమౌళి, రామా రాజమౌళి మధ్య పరిచయం మరింత బలపడటంలో ‘శాంతినివాసం’ రోజులూ కీలకంగా మారాయి. ఆ సమయంలో ఒకరినొకరు మరింత దగ్గరగా తెలుసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత రాజమౌళికి ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడంతో వారి బంధంపై మరింత స్పష్టత ఏర్పడిందని తెలిపారు. ‘రాజమౌళి చాలా సిగ్గుపడే వ్యక్తి. ఆయన పనిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. సినిమాలే ఆయన ప్రపంచం. అయితే కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. దర్శకుడిగా ఎంతటి పనిలో ఉన్నా కుటుంబ బంధాలను ప్రేమగా చూసుకుంటారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాల్లో పెద్దగా అభిప్రాయ భేదాలు ఉండవు. దాదాపు 99 శాతం విషయాల్లో తమ అభిప్రాయాలు కలుస్తాయి. సినిమాలకు సంబంధించిన పనుల విషయంలో అప్పుడప్పుడు చిన్నచిన్న భేదాలు వచ్చినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒకే ఆలోచనతో ముందుకు సాగుతాం’ అని వెల్లడించారు.
సినిమాలే కాదు.. ప్రయాణాలంటేనూ ఇష్టం!
రాజమౌళి, రామా రాజమౌళికి సినిమాలతో పాటు ప్రయాణాలంటే కూడా ఎంతో ఇష్టమట. సెలవులు దొరికినప్పుడు వివిధ దేశాలను సందర్శించడం తమకు ఇష్టమైన వ్యాపకమని రామా రాజమౌళి వెల్లడించారు. భవిష్యత్తులో రిటైర్మెంట్ తర్వాత ఏయే ప్రాంతాలు, దేశాలు చూడాలనే విషయంపై కూడా తరచూ మాట్లాడుకుంటామని చెప్పారు. అంతేకాదు.. తాము సందర్శించిన దేశాలకు సంబంధించిన నాణేలను సేకరించి, వాటిని ఒక ఫ్రేమ్‌లో భద్రపరచుకోవాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నామని తెలిపారు. సినిమాల ప్రపంచంలో నిరంతరం బిజీగా ఉండే రాజమౌళి దంపతులు వ్యక్తిగత జీవితానికి, ప్రయాణాలకు కూడా సమయం కేటాయించాలనుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: రణబాలి బడ్జెట్ 120 కోట్లు.. విజయ్, రష్మికల రెమ్యునరేషన్ ఎంతంటే?)


