DID Super Mom 3: How Daily Wage Worker Varsha Bumrah Became Winner - Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బాబు, కూలీ పని చేస్తూ డాన్స్‌ ప్రాక్టీస్‌.. విజేతగా రూ.10 లక్షలు సొంతం

Oct 1 2022 11:13 AM | Updated on Oct 1 2022 5:45 PM

DID Super Mom 3: How Daily Wage Worker Varsha Bumra Became Winner - Sakshi

ఆకలి రుచిని, నిద్ర సుఖాన్ని ఎరగవు అంటారు. ఇదేవిధంగా టాలెంట్‌కు.. బీద, గొప్ప, వయసుతో సంబంధం ఉండదని అనేక సందర్భాల్లో ఎంతోమంది నిరూపించి చూపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో చేరిన వర్షా బుమ్రా కూడా ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పొట్ట కూటికోసం కూలిపని చేసుకుంటూనే, తనకెంతో ఇష్టమైన డ్యాన్స్‌ను ఎంతో కష్టపడి స్వయంగా నేర్చుకుని ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ సూపర్‌ మామ్స్‌ సీజన్‌–3’ విజేతగా నిలిచింది. 

ఇటీవల ముంబైలో జరిగిన జీ టీవీ డ్యాన్స్‌ రియాల్టీషో..‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ సీజన్‌ –3’ ఫినాలేలో టైటిల్‌ విన్నర్‌గా నిలించింది వర్షా బుమ్రా. అనేక మందితో వివిధ రౌండ్లలో కఠినమైన పోటీని ఎదుర్కొని ఐదు లక్షల రూపాయల ప్రైజ్‌ మనీతోపాటు, షో న్యాయనిర్ణేతలను మెప్పించి కొంత, స్పాన్సర్స్‌ నుంచి కొంత ఇలా మొత్తం పది లక్షల రూపాయలు గెలుచుకుంది. కూలి పనిచేసుకుని కేవలం వందల్లో సంపాదించే వర్షకు ఇది చాలా పెద్దమొత్తం. అందరిలా కాకుండా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆమె ఈ స్టేజి మీద విజేతగా నిలవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.



హర్యానాకు చెందిన వర్షా బుమ్రాది నిరుపేద కుటుంబం. పదిహేడేళ్ల వయసులో పెళ్లి అయ్యింది. భవన నిర్మాణ రంగంలో రోజువారి కూలీగా పనిచేస్తున్న భర్తతో కలిసి తను కూడా పనికి వెళ్లి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. వీరికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. వర్షకు డ్యాన్స్‌ అంటే ఎనలేని మక్కువ. పెళ్లికి ముందు డ్యాన్స్‌ చేస్తూ అనేక పోటీల్లో పాల్గొంది. అయితే ఆ విషయం ఎప్పుడూ బయటకు చెప్పలేదు. బాబుకు ఐదేళ్లు వచ్చాక ఓ రోజు డ్యాన్స్‌పై ఉన్న ఇష్టాన్ని భర్తకు చెప్పింది. అతను కూడా వర్షను ప్రోత్సహించడంతో తనకు సమయం దొరికనప్పుడల్లా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుండేది.

వీడియోలు చూసి...
భర్త ఇచ్చిన ప్రోత్సాహం, మరోపక్క కొరియోగ్రాఫర్‌ వర్తికా ఝా వీడియోలను సోషల్‌ మీడియాలో చూసిన వర్షకు డ్యాన్స్‌ నేర్చుకోవాలన్న కసి పెరిగింది. దీంతో రోజూ ఆన్‌లైన్‌లో వీడియోలు చూసి ఒక్కో పాటను పదిసార్లు సాధన చేసేది. ఇలా అనేకరోజులపాటు క్రమం తప్పకుండా సాధన చేసి చాలా రకాల డ్యాన్స్‌ స్టెప్స్‌ను త్వరత్వరగా నేర్చేసు కుంది. డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ సూపర్‌ మామ్స్‌కు ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలుసుకుని ఆడిషన్స్‌కు వెళ్లి, వారిని మెప్పించి పోటీలో పాల్గొనడానికి ఎంపికైంది.

దీంతో కూలిపనికి వెళ్లడం మానేసి పూర్తి సమయాన్ని డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కే కేటాయించింది. టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా కఠోర సాధన చేసింది. ఈ షోలో పన్నెండుమంది డ్యాన్సర్‌లు పోటీపడగా, ఆరుగురు ఫైనల్స్కు చేరుకున్నారు. వర్ష అందర్ని ఓడించి  టైటిల్‌ను సొంతం చేసుకుంది. సిమెంటు, ఇటుకలు మోసిన ఆమె నేడు సూపర్‌ మామ్స్‌ ట్రోఫీని మోసుకురావడంతో ఆమె గురించి తెలిసిన హర్యాణావాసులు బ్యాండు మేళాలతో ఘనస్వాగతం పలుకుతున్నారు. 
 
లక్ష సంపాదిస్తానని కలలో కూడా అనుకోలేదు 
‘‘జీవితంలో లక్షరూపాయలు సంపాదిస్తానని ఎప్పుడూ కలలో కూడా  అనుకోలేదు. కానీ డ్యాన్స్‌ సాధన చేయడం వల్ల ఈరోజు నేను ఇన్ని లక్షల రూపాయలు గెలుచుకోగలిగాను. ఇలాంటి షోల వద్ద సెక్యూరిటీ గార్డులతో కనీసం మాట్లాడే అర్హత కూడా లేని నేను నాకొడుకుకు మంచి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకోగలిగాను.

నేను పడ్డ కష్టాలు మా అబ్బాయి పడకూడదు, వాడికి మంచి జీవితం ఇవ్వాలన్న లక్ష్యంతో సాధన చేసాను. అదే ఈరోజు నన్ను ఈ టైటిల్‌ విన్నర్‌గా నిలబెట్టింది. షోకు వచ్చిన అతిథులు సైతం నా కొడుకు చదువుకయ్యే ఖర్చుని భరిస్తామని చెప్పడం చాలా పెద్దవిషయం. ఇప్పటిదాకా మాకంటు సొంత ఇల్లు లేదు. వచ్చిన మొత్తంలో కొంత వెచ్చించి చిన్న ఇల్లు కొనుక్కుంటాను’’ అని వర్ష ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement