Devil Movie Review: డెవిల్‌ మూవీ రివ్యూ

Devil Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: డెవిల్‌
నటీనటులు: కల్యాణ్‌ రామ్‌, సంయుక్త మీనన్‌, మాళవిక నాయర్‌, సంయుక్త మీనన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌, సత్య, ఎస్తర్‌ నోరోన్హా
నిర్మాణ సంస్థ: అభిషేక్‌ పిక్చర్స్‌
కథ-మాటలు: శ్రీకాంత్‌ విస్సా
దర్శకత్వం: అభిషేక్‌ నామా
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌
సినిమాటోగ్రఫీ: సౌందర్‌ రాజన్‌. ఎస్‌
ఎడిటర్‌: తమ్మిరాజు
విడుదల తేది: డిసెంబర్‌ 29,2023

కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది.స్వాతంత్రం కోసం పని చేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్‌ సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తన ఎక్కడ ల్యాండ్‌ అవ్వాలనేది కోడ్‌ రూపంలో తెలియజేయాలని తన ముఖ్య అనుచరుడు త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు. చంద్రబోస్‌ ఇండియాకు వస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటీష్‌ ఆర్మీ.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ(అభిరామి) హత్య జరుగుతుంది.

ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కల్యాణ్ రామ్)కు అప్పజెప్పుతారు. డెవిల్‌కి విజయ కజిన్‌  నైషేద(సంయుక్త మీనన్‌)పై అనుమానం కలుగుతుంది. ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. బోస్‌ను పట్టుకునే ఆపరేషన్‌కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? బోస్‌ ముఖ్య అనుచరుడు త్రివర్ణ ఎవరు?  బోస్‌ ఇండియాకు వస్తున్నట్లు బ్రిటీష్‌ సైన్యానికి ఎలా తెలిసింది? నైషేదను రహస్యంగా కలుస్తున్న వ్యక్తి ఎవరు? ఈ కథలో మాళవిక నాయర్‌ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
డెవిల్‌ కథ, కథనం రెండూ పాతవే. హీరో సీక్రెట్‌ ఏజెంట్‌గా ఉండి ఓ ఆపరేషన్‌లో పాల్గొనడం.. అతను తన ఒరిజినాలిటీ కప్పిపుచ్చి మరోలా నటించడం.. ప్రీక్లైమాక్స్‌ అసలు విషయం తెలియడం.. ఆ తర్వాత ఓ భారీ ఫైట్‌.. శుభం కార్డు.. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డెవిల్‌ కథ కూడా అదే. ​కాకపోతే సుభాష్‌ చంద్రబోస్‌ చుట్ట కథను నడిపించడం ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. కథనం మాత్రం కొత్త సీసాలో పాత సారానే అన్నట్లుగా సాగుతుంది.  ఊపిరి బిగపట్టుకొని చూసే సన్నివేశాలను సైతం చాలా సింపుల్‌గా తెరకెక్కించారు. 

సుభాష్‌ చంద్రబోస్‌ పాయింట్‌తో కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా జమీందారు కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది సస్పెన్స్‌లో పెట్టి ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కహనీ మాత్రం కథను పక్కదోవ పట్టించడమే కాకుండా.. నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ బాగుటుంది. అలాగే అక్కడ ట్విస్ట్‌ రివీల్‌ చేసి ద్వితియార్థంపై ఆసక్తి కలిగించేలా చేశారు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి.

అయితే ఈ తరహా ట్విస్టులు గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఇక అసలు ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక కథపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది. క్లైమాక్స్‌ ఎలా ఉంటుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇక చివర్లో హీరో చేసే యాక్షన్‌ సీన్‌ మరింత బోరింగ్‌ అనిపిస్తుంది. వీఎఫ్‌ఎక్స్‌  మరింత పేలవంగా ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు మారడం.. చివరకు అభిషేక్‌ నామానే ఆ బాధ్యతలు తీసుకొని తెరకెక్కించాడు. అయితే నిర్మాతగా ఆయన సినిమాను రిచ్‌గా తెరకెక్కించగలిగాడే తప్ప.. దర్శకుడిగా మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.

 

ఎవరెలా చేశారంటే..
కల్యాణ్‌ రామ్‌ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడమే కాదు..  ఆ పాత్రల్లో జీవిస్తాడు కూడా. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న డెవిల్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించిన విధానం బాగోలేదు కానీ కల్యాణ్‌ రామ్‌ ఉన్నంతలో చక్కగా నటించాడు. నైషేదగా సంయుక్త మీనన్‌  తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది.  ఇక మాళవిక నాయర్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. ఆమె నిడివి తక్కువే అయినా..గుర్తిండిపోయే పాత్ర తనది.  శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌, సత్య, ఎస్తర్‌ నోరోన్హా, సెఫీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతిక విషయాలకొస్తే..  హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి స్పీడ్‌ బ్రేకర్లుగా అడ్డు తగులుతాయే తప్ప ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది.  ద్వితియార్థంలో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top