సింగ్‌ గీతం చేయడం నా అదృష్టం: దేవిశ్రీ ప్రసాద్‌ | Devi Sri Prasad about Sing Geetham movie | Sakshi
Sakshi News home page

సింగ్‌ గీతం చేయడం నా అదృష్టం: దేవిశ్రీ ప్రసాద్‌

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

Devi Sri Prasad about Sing Geetham movie

‘‘సింగీతం శ్రీనివాసరావుగారు చేసినన్ని ప్రయోగాలు ఎవ్వరూ చేసి ఉండరు. ‘సింగ్‌ గీతం’ ప్రాజెక్ట్‌ చేస్తున్నామని మూడేళ్ల క్రితం ఆయన చెప్పినప్పుడు హ్యాపీ అనిపించింది. నాగ్‌ అశ్విన్‌గారు, స్వప్నగారు, వైజయంతి మూవీస్‌తో కలిసి ఈ సినిమా రూపొందడం మరింత ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని దేవిశ్రీ ప్రసాద్‌ తెలిపారు.

ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగ్‌ గీతం’. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పిన విశేషాలు.

నేను సింగీతంగారికి వీరాభిమానిని. మా నాన్న సత్యమూర్తిగారిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను ఆరాధనగా చూసేవాడిని. అలాంటిది సింగీతంగారితో కలిసి పని చేయడం ఒక ఆశీర్వాదంగా అనిపించింది. సింగీతంగారు ఎప్పుడూ ట్రెండ్‌కి తగ్గట్టు కథలు ఆలోచించలేదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఇంతకు ముందు రానిది, తర్వాత కూడా రానిదిగా ఉంటుంది. ‘పుష్పక విమానం’ ఇప్పటికీ చాలా అడ్వాన్డ్స్‌ మూవీ. ‘సింగ్‌ గీతం’ ఐడియా కూడా అంతే కొత్తగా ఉంటుంది. 

ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక కేవలం పాటల రూపంలోనే సంభాషించే కథ ఇప్పటివరకు రాలేదు. అది ‘సింగ్‌ గీతం’లో కొత్తగా ఉంటుంది. నా కెరీర్‌లో సవాల్‌తో కూడుకున్న సినిమా ఇది. ఇది కేవలం కామెడీ సినిమా కాదు... అద్భుతమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. కమల్‌హాసన్‌గారు సినిమా చూసి, ‘ఇలాంటి సినిమాలో నేను కూడా భాగం కావాల్సింది’ అనడం మాకు ఆనందాన్నిచ్చింది. 

చిన్నప్పటి నుంచి ప్రతి అక్ష రాన్ని సంగీతంగా మార్చే అలవాటు నాకుండేది. అప్పుడు న్యూస్‌పేపర్‌ తీసుకుని అందులో ఉన్న వార్తలనే ట్యూన్స్‌గా మార్చుకునేవాడిని. అది ‘సింగ్‌ గీతం’కి ఉపయోగపడింది. ఈ సినిమా కోసం ప్రతిదీ ముందుగానే మ్యూజికల్‌గా చేసి ఇచ్చాం. తర్వాత షూట్‌ చేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ పాడగలిగారు. 94 ఏళ్ల వయసులోనూ కొత్త ఆలోచనతో, ఉత్సాహంగా సినిమా చేసిన సింగీతంగారి నుంచి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారు.  

Advertisement
 
Advertisement
Advertisement