Devi Sri Prasad : నాన్నకి 32ఏళ్లప్పుడు గుండెపోటు వచ్చింది.. అప్పుడు అమ్మ..

Devi Sri Prasad About Aadavallu Meeku Johaarlu - Sakshi

‘‘నేను సంగీత ప్రేమికుణ్ణి.. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. సంగీతానికి ఎప్పుడూ స్వర్ణయుగమే. అందుకే వందేళ్ల క్రితం పాటలను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాం. మైఖేల్‌ జాక్సన్, ఎం.ఎస్‌. విశ్వనాథన్, ఇళయరాజా.. వంటి వారు సంగీతం చేసినప్పుడు సోషల్‌ మీడియా లేదు. అయినప్పటికీ సంగీతం తీరాలు దాటి వెళ్లింది.. వెళుతూనే ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు. శర్వానంద్, రష్మికా మందన్న జంటగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ విలేకరులతో చెప్పిన విశేషాలు.

కిశోర్‌ తిరుమలగారు క్రియేటివ్‌ పర్సన్‌. ఆయన సినిమా కథలన్నీ పాటల ప్రాధాన్యంగా సాగుతాయి. ఎక్కడ పాట రావాలనేది కథ చెప్పేటప్పుడే స్పష్టంగా వివరిస్తారు. కిశోర్‌గారి సినిమాల్లో ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుంది. కథ చెప్పగానే నాకు ఐడియా వచ్చేస్తుంది.. అందుకే ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కిశోర్‌ కెరీర్లో బెస్ట్‌ మూవీ అవుతుంది. ఈ సినిమాలోని ‘మాంగళ్యం తంతునానేనా..’ పాట సందర్భాన్ని ఫోన్లో విని, వెంటనే ట్యూన్‌ కట్టేశాను. ∙‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లో కుటుంబ భావోద్వేగాలున్నా కూడా ప్రేమకథ, వినోదం ఉంటాయి. ఈ సినిమా కథలో అంత స్పాన్‌ ఉంది కాబట్టే సంగీతం బాగా కుదిరింది. ఇందులో నాలుగు పాటలే కాకుండా మరో సర్ర్‌పైజ్‌ సాంగ్‌ కూడా ఉంది.

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమా అప్పటినుంచి శర్వానంద్‌ తెలుసు. మేమిద్దరం ఓ సినిమా చేయాలనుకునేవాళ్లం.. అది కిశోర్‌గారి వల్లే కుదిరింది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లో శర్వానంద్‌ బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. రష్మికకు ‘పుష్ప’ తర్వాత ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ రావడం ప్లస్‌ అవుతుంది. ఖుష్బూ, రాధిక, ఊర్వశిగార్లు ఈ సినిమాకు హైలైట్‌. ∙నేను జోహార్లు చెప్పాల్సి వస్తే మొదట మా అమ్మకే చెబుతాను. ఇప్పటికీ మా ఫ్యామిలీలో అంతా సంతోషంగా ఉండటానికి కారణం మా అమ్మే. మా నాన్నకి 32 ఏళ్లప్పుడు  గుండెపోటు వస్తే, మా అమ్మ చిన్నపిల్లాడిలా చూసుకున్నారు. ‘మా ఆవిడకు ముగ్గురు పిల్లలు కాదు.. నాతో కలిపి నలుగురు పిల్లలు’ అని మా అమ్మ గురించి నాన్న చెబుతుండేవారు.  

సినిమా సినిమాకి తప్పకుండా వేరియేషన్‌ చూపించాలి. ‘పుష్ప’ రగ్డ్‌ సినిమా. ‘ఆడవాళ్ళు మీకు..’ కూల్‌ మూవీ. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ని దర్శకులు సుకుమార్‌గారు, అనిల్‌ రావిపూడి, బాబీ ఇలా చాలామంది మెచ్చుకున్నారు. ∙ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’ చేస్తున్నాను. చిరంజీవిగారు హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు మూడు పాటలు చేశా. వైష్ణవ్‌ తేజ్‌తో ‘రంగరంగ వైభవంగా’, హరీష్‌ శంకర్‌–పవన్‌ కళ్యాణ్‌గారి సినిమాతో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాను. ఈ నెల 28న మా గురువు మాండొలిన్‌ శ్రీనివాస్‌గారి జయంతి సందర్భంగా కొత్త ప్రోగ్రామ్‌ చేస్తున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top