DeAr Movie Review : గురక కాన్సెప్ట్‌తో వచ్చిన ‘డియర్‌’ ఎలా ఉందంటే? | Sakshi
Sakshi News home page

DeAr Movie Review : భార్య పెట్టే గురకతో భర్త పడే కష్టాలు.. ‘డియర్‌’ ఎలా ఉందంటే?

Published Fri, Apr 12 2024 6:59 PM

Dear Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: డియర్‌
నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులు
నిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేని
దర్శకత్వం: ఆనంద్‌ రవించంద్రన్‌
సంగీతం: జీవీ ప్రకాశ్‌
విడుదల తేది: ఏప్రిల్‌ 12, 2024​

అర్జున్‌(జీవీ ప్రకాశ్‌ కుమార్‌) ఓ న్యూస్‌ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్‌ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్‌(కాళి వెంకట్‌), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్‌కి పెళ్లి చేయాలని ఫిక్స్‌ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్‌). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్‌కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి.   అర్జున్‌ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్‌కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
కొత్త పాయింట్‌తో ఓ  సినిమా వచ్చి​..అది సూపర్‌ హిట్‌ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్‌తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్‌ సినిమా కాన్సెప్ట్‌ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్‌’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్‌నైట్‌’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్‌’.

‘గుడ్‌నైట్‌’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్‌నైట్‌ సినిమాలో వర్కౌట్‌ అయిన  ఎమోషన్‌  ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్‌గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో  హీరో పేరేంట్స్‌ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.

పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు.  ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్‌కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్‌ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య  బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్‌గా అయినా చూపించారా అంటే అదీ లేదు.  తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు  ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్‌గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది.  ఫస్టాఫ్‌ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్‌ మరింత సాగదీతగా ఉంటుంది.  పేరెంట్స్‌ని కలిపే ఎపిసోడ్‌ మెయిన్‌ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటుంది. గుడ్‌నైట్‌ సినిమా చూడనివారిని ఈ సినిమా  కాస్త అలరిస్తుంది. 

ఎవరెలా చేశారంటే.. 
అర్జున్‌గా జీవీ ప్రకాశ్‌ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్‌ ఒదిగిపోయింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్‌ పాత్రే. కాళీ వెంక‌ట్, ఇళ‌వ‌ర‌సుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్‌ ఓకే. జీవీ ప్రకాశ్‌ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు  బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement
 

తప్పక చదవండి

Advertisement