Dasara Review: ‘దసరా’మూవీ రివ్యూ

Dasara Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: దసరా
నటీనటులు: నాని, కీర్తి సురేశ్‌, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు
నిర్మాణ సంస్థ:  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ 
నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి
దర్శకుడు: శ్రీకాంత్‌ ఓదెల
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌
సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూరన్‌
ఎడిటర్‌: నవీన్‌ నూలి
విడుదల తేది: మార్చి 30, 2023

వైవిధ్యమైన పాత్రలు అలవోకగా చేసుకుంటూ నేచురల్‌ స్టార్‌గా ఎదిగాడు నాని. ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్స్‌ని ట్రై చేయడం ఆయనకు అలవాటు. అయితే నానికి ఈ మధ్య కాలంలో మాత్రం సాలిడ్‌ హిట్‌ లభించలేదు. చివరి చిత్రం ‘అంటే సుందరానికి..’ బాక్సాఫీస్‌ వద్ద దారణంగా బోల్తాపడింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకున్న నాని.. ఈ సారి పాన్‌ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని ఊరమాస్‌గా నటించిన చిత్రం ‘దసరా’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా నిర్వహించడంతో..‘దసరా’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 30)విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
కరీంనగర్‌ జిల్లా వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన ధరణి(నాని), సూరి(దీక్షిత్‌ శెట్టి) ప్రాణ స్నేహితులు. బొగ్గు రైళ్లను కొల్లగొడుతూ.. వచ్చిన డబ్బుతో ఊర్లోని సిల్క్‌ బార్‌కి వెళ్లి మద్యం సేవిస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. ధరణి, సూరిల చిన్నప్పటి స్నేహితురాలు వెన్నెల(కీర్తి సురేశ్‌) ఓ అంగన్‌వాడి టీచర్‌. వెన్నెల అంటే ధరణికి చాలా ఇష్టం. కానీ సూరి కూడా వెన్నెలని ప్రేమించడంతో.. స్నేహం కోసం ధరణి తన ప్రేమను త్యాగం చేస్తాడు.

అయితే సిల్క్‌ బార్‌లో జరిగిన ఓ గొడవ కారణంగా వీళ్ల జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. ధరణి స్నేహితులపై ఓ ముఠా ఎందుకు దాడి చేసింది? శివన్న(సముద్రఖని), రాజన్న(సాయి కుమార్‌) రాజకీయ వైరం వల్ల గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చిన్న నంబి (షైన్ టామ్ చాకో)తో ధరణి చేసిన చాలెంజ్‌ ఏంటి? సూరి ఇష్టపడిన అమ్మాయి వెన్నెలను ధరణి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ధరణి ప్రేమను వెన్నెల అర్థం చేసుకుందా?  తన స్నేహితులకు జరిగిన అన్యాయంపై ధరణి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
తెలంగాణ నెటివిటితో సాగే ఓ రివేంజ్‌ డ్రామా చిత్రం ‘దసరా’. ఈ తరహా చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి మొన్నటి రంగస్థలం వరకు ఈ తరహా చిత్రాలు చాలానే వచ్చాయి. అయితే ఈ రొటీన్‌ కథకు సింగరేణి బ్యాక్‌డ్రాప్‌ పాయింట్‌ని జోడించి రియలిస్టిక్‌గా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. తొలి చిత్రమైనా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. తను రాసుకున్న ప్రతి పాయింట్‌ని వాస్తవికతకు దగ్గరగా ఉన్నది ఉన్నట్లుగా తెర రూపం ఇచ్చాడు. 

ఇది రివేంజ్‌ డ్రామా అయినా.. అంతర్లీనంగా అందమైన ప్రేమ కథతో పాటు స్నేహ బంధం, ఊరి రాజకీయాలు, తెలంగాణ గ్రామ ప్రజల జీవన శైలిని సజీవంగా చూపిస్తూ కథను రక్తి కట్టించాడు. ఫస్టాఫ్‌ మొత్తం ధరణి, సూరిల స్నేహ బంధం చుట్టూ తిరుగుతుంది. వాటితో పాటు ఊర్లోని సిల్క్‌ బార్‌పై ఆదిపత్యం కోసం రాజన్న, శివన్న చేసే రాజకీయాలను చూపించారు. ఇక ఇంటర్వెల్‌ ముందు వచ్చే ఫైట్‌ సీన్‌ అదిరిపోతుంది. ఒక్క చిన్న ట్విస్ట్‌తో విరామం పడుతుంది.

 ఇక సెకండాఫ్‌ మొత్తం తన స్నేహితులను అన్యాయం చేసినవారిపై ధరణి ఎలా రివేంజ్‌ తీసుకున్నాడనేది చూపించారు. అయితే కథనం మొత్తం ఊహకందేలా సాగడం మైనస్‌.  స‌వ‌తి సోద‌రులు శివ‌న్న‌, రాజ‌న్న మ‌ధ్య రాజ‌కీయ వైరం అంటూ కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ రెండు క్యారెక్టర్ల మధ్య వైరాన్ని మాత్రం బలంగా చూపించలేకపోయాడు. అలాగే ఓ చిన్న ట్విస్ట్‌ ఇచ్చి సెకండాఫ్‌లో కథ మొత్తాన్ని సైడ్‌ట్రాక్‌ పట్టించాడు. కథ స్వభావం రిత్యా ఎమోషన్స్‌ ఇంకాస్త పండించి ఉంటే బాగుండేది. అయితే దర్శకుడు మాత్రం చాలా నిజాయితీగా చిత్రాన్ని తెరకెక్కించాడు. 

ఎవరెలా చేశారంటే.. 
నాని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా జీవించడం ఆయనకు అలవాటు. అతని నటన చాలా సహజంగా ఉంటుంది.అందుకే నేచురల్‌ స్టార్‌ అయ్యాడు.అయితే ఇప్పటి వరకు నాని చేసిన పాత్రలు ఒకెత్తు.. ధరణి పాత్ర మరో ఎత్తు. తన కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్‌ ఇచ్చాడు నాని. ధర‌ణి క్యారెక్ట‌ర్ కోసం మేకోవ‌ర్ అయిన తీరు బాగుంది. ఊరమాస్‌ పాత్రలో జీవించేశాడు.

ఇక వెన్నెలగా కీర్తి సురేశ్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెలంగాణలోని పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా నటించింది. సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. సూరి పాత్రకు దీక్షిత్‌ శెట్టి న్యాయం చేశాడు. ఇక రాజన్నగా సాయికుమార్‌, శివన్నగా సముద్రఖని పర్వాలేదపించారు. పూర్ణ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకి ప్రాణం పోసింది ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా.  22 ఎకరాల్లో వేసిన వేసిన విలేజ్‌ సెట్‌ అద్భుతం. సినిమా కోసం ఓ పల్లెటూరిని నిజంగానే సృష్టించాడు. సంతోష్‌ నారాయణన్‌ నేపథ్య సంగీతం, పాటలు ఈ సినిమాకు ప్లస్‌ అయ్యాయి.  సత్యన్‌ సూరన్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. 

-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3/5)

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top