Court Movie Review: నాని ‘కోర్ట్‌’ మూవీ రివ్యూ | Court: State Vs A Nobody Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Court Movie Review: నాని నిర్మించిన ‘కోర్ట్‌’ మూవీ ఎలా ఉందంటే?

Published Thu, Mar 13 2025 10:36 AM | Last Updated on Thu, Mar 13 2025 4:54 PM

Court: State Vs A Nobody Movie Review In Telugu

టైటిల్‌:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' 
నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్‌, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులు
సమర్పణ: నాని
నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
కథ, దర్శకత్వం: రామ్ జగదీష్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: దినేష్‌ పురుషోత్తమన్‌
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
విడుదల తేది: మార్చి 14, 2025

హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్‌’. ‘‘కోర్ట్‌’ నచ్చకపోతే నా ‘హిట్‌ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్‌ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్‌ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్‌) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్‌ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్‌ చదువుతున్న జాబిలి.. ఇంటర్‌ ఫెయిల్‌ అయి పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్న వాచ్‌మెన్‌ కొడుకు చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు(రోషన్‌)తో ప్రేమలో పడుతుంది. 

ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్‌ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్‌’ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్‌’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్‌ యూజ్‌ చేస్తున్నారు? ఇలాంటి పవర్‌ఫుల్‌ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్‌, మైనస్‌ పాయింట్స్‌ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్‌ జగదీష్‌.

దర్శకుడు ఎంచుకున్న టాపిక్‌ చాలా సెన్సిబుల్‌. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్‌ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్‌ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్‌ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్‌ దాము(హర్ష వర్ధన్‌) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది.  క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఎమోషనల్‌ సీన్లను బలంగా రాసుకున్నాడు.  క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. 

ఎవరెలా చేశారంటే.. 
ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్‌ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్‌ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది.  ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది.  

సాయి కుమార్‌, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement