తిరుత్తణి నేపథ్యంలో విక్రమ్‌ 62వ చిత్రం | Sakshi
Sakshi News home page

తిరుత్తణి నేపథ్యంలో విక్రమ్‌ 62వ చిత్రం

Published Thu, Dec 21 2023 6:56 AM

Chiyaan Vikram 62th Film Announced - Sakshi

కోలీవుడ్‌ నటుడు విక్రమ్‌ చిత్రం అంటే కచ్చితంగా కొత్తగా ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు విశ్వసిస్తారు. దాన్ని ఆయన వమ్ము కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకోసం విక్రమ్‌ శాయశక్తులా శ్రమిస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం తంగలాన్‌. పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 2024 జనవరి 26వ తేదీన రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో విక్రమ్‌ అసాధారణ నటనను చూడవచ్చని ఆయన గెటప్‌, టీజర్‌ చూస్తే అనిపిస్తోంది. తంగలాన్‌ చిత్రం కోసం విక్రమ్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యారు.

ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇది విక్రమ్‌ నటించే 62వ చిత్రం అవుతుంది. దీనికి అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు పన్నైయారుమ్‌ పద్మినియుమ్‌, సేతుపతి, చిత్రా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. విక్రమ్‌ 62వ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్నారు. దీన్ని రియా శిబు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనతో కూడిన టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు.

ఇది తిరుత్తణి నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. చిత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు అరుణ్‌కుమార్‌ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రా చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో ఈయన విక్రమ్‌ హీరోగా తెరకెక్కించనున్న చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement