చిరంజీవి-బాబీ, రామ్‌ చరణ్‌-సుకుమార్‌.. హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ | Chiranjeevi, Bobby, Ram Charan, Sukumar, Hit Combination Repeat In Tollywood | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌-సుకుమార్‌తో సహా హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తున్న స్టార్‌ హీరోలు!

May 17 2026 9:53 AM | Updated on May 17 2026 10:36 AM

Chiranjeevi, Bobby, Ram Charan, Sukumar, Hit Combination Repeat In Tollywood

ఓ సినిమా హిట్‌ అయిందంటే ఆ చిత్రకథానాయకుడు–దర్శకుడు, హీరో–హీరోయిన్‌... వీరిది ‘హిట్‌ కాంబినేషన్‌’ అనే ఇమేజ్‌ ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హిట్‌ కాంబినేషన్స్‌ రిపీట్‌ ట్రెండ్‌ బాగా కొనసాగుతోంది. ఓ హీరో–ఓ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో ఒక హిట్‌ మూవీ వచ్చిందంటే చాలు.. వారి కాంబినేషన్‌లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇప్పటికే తమకు హిట్‌ ఇచ్చిన దర్శకులతో పని చేయడానికి హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్‌ హీరో–డైరెక్టర్‌ కాంబోని రిపీట్‌ చేసేందుకు నిర్మాతలు కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే హిట్‌ కాంబినేషన్‌లో మరో మూవీ వస్తోందంటే బిజినెస్‌ పరంగానూ నిర్మాతలకు బాగా కలిసి వస్తుంది. 

అలాగే ప్రస్తుతం చిరంజీవి–బాబీ, వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌–అనిల్‌ రావిపూడి, బాలకృష్ణ– గోపీచంద్‌ మలినేని, రామ్‌చరణ్‌–సుకుమార్, నాని–శ్రీకాంత్‌ ఓదెల, విజయ్‌ దేవరకొండ–రాహుల్‌ సాంకృత్యాయన్, శ్రీ విష్ణు– రామ్‌ అబ్బరాజు వంటి హీరోలు–డైరెక్టర్స్‌ కాంబినేషన్స్‌ రిపీట్‌ అవుతున్నాయి. అయితే ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’కి సీక్వెల్‌గా ‘సలార్‌ 2’, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానున్న ‘కల్కి 2898 ఏడీ 2’, ఎన్టీఆర్‌–కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ వంటి సీక్వెల్‌ సినిమాలు కూడా రానున్నాయి. ఆ విధంగా వీరి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతున్నట్లే. అయితే సీక్వెల్స్‌తో కాకుండా డైరెక్ట్‌ మూవీస్‌తో సిల్వర్‌ స్క్రీన్‌పై మరోసారి హిట్‌ మ్యాజిక్‌ని రిపీట్‌ చేయనున్న హీరోలు–దర్శకుల సినిమాల గురించి తెలుసుకుందాం.  

రెండోసారి...  
హీరో చిరంజీవి–డైరెక్టర్‌ బాబీ కొల్లిలది (కేఎస్‌ రవీంద్ర) హిట్‌ కాంబినేషన్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో హీరో రవితేజ నటించడం విశేషం.  

‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్‌ మూవీ తర్వాత చిరంజీవి– బాబీ కొల్లి కాంబినేషన్‌లో రెండో సినిమాకి శ్రీకారం చుట్టారు. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రమిది. ‘చిరుబాబీ2’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీని అనౌన్స్‌ చేశారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌పై వెంకట్‌ కె. నారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి చిరంజీవి లుక్‌ టెస్ట్‌ని కూడా పూర్తి చేసినట్లు ఏప్రిల్‌ 28న చిత్రయూనిట్‌ ప్రకటించింది. ‘‘చిరుబాబీ2’ మరో ప్రతిష్టాత్మక ్ర΄ాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. 

ఈ మూవీ లుక్‌ టెస్ట్‌ విజయవంతంగా పూర్తయింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్, స్ట్రైకింగ్‌ లుక్‌లో చిరంజీవి కనిపించబోతున్నారు. మాస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ను తనదైన స్టైల్‌లో అద్భుతంగా అందించే బాబీ ఈసారి చిరంజీవి కోసం మరింత ఇంటెన్స్‌ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారు. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్‌ చేసేలా స్క్రిప్ట్‌ సిద్ధం అవుతోంది. 

ఈ కాంబినేషన్‌ నుంచి ఓ భారీ ఎంటర్టైన్మెంట్‌ ప్యాకేజ్‌ రాబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్‌ షూటింగ్‌ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం.  ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్‌ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ  ప్రాజెక్ట్‌పై ఇటు ట్రేడ్‌ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. 

కాగా ఈ చిత్రానికి ‘కాకాజీ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ నెల చివరి వారంలో ఈ సినిమాని ప్రారంభించి జూన్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభించనున్నారని టాక్‌. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో శరవేగంగా తెరకెక్కించనున్నారట బాబీ.  

క్రేజీ మల్టీస్టారర్‌ 
హీరో వెంకటేశ్‌–డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడిలది క్రేజీ కాంబినేషన్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ఎఫ్‌ 2’. ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌ మరో హీరోగా నటించారు. 2019 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో వినోదాల జల్లులు కురిపించింది. ‘ఎఫ్‌ 2’ వంటి హిట్‌ మూవీ తర్వాత వెంకటేశ్‌–వరుణ్‌ తేజ్‌లతో అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్‌ 3’ 2022 మే 27న రిలీజై విజయం సాధించింది. 

వెంకటేశ్‌ సోలో హీరోగా అనిల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు... వెంకటేశ్‌ తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్‌లో చేశారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్‌ రావిపూడి. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్‌ వెంకీ గౌడ అనే  కీలకమైన పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే... హీరోలు వెంకటేశ్‌–కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్‌ మూవీని ప్రకటించారు అనిల్‌ రావిపూడి. ‘పటాస్‌’ (2015) సినిమాతో అనిల్‌ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేశారు కల్యాణ్‌ రామ్‌. పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌ రెండోసారి రిపీట్‌ అవుతుండటం విశేషం. ‘‘ఈ కొత్త చిత్రాన్ని క్లీన్, టిపికల్‌ ఎంటర్‌టైనర్‌గా అందరికీ కనెక్ట్‌ అయ్యే కథాంశంతో రూ΄÷ందించనున్నారు అనిల్‌ రావిపూడి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌లా ఉంటుంది. అనిల్‌ ట్రేడ్‌ మార్క్‌ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందించనున్న మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్‌ ట్రీట్‌గా నిలిచేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ–్ర΄÷డక్షన్‌ దశలో ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

పవర్‌ఫుల్‌ జడల్‌   
హీరో నాని పూర్తి స్థాయి ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించిన చిత్రం ‘దసరా’. ఈ మూవీతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే నాని వంటి క్లాస్‌ హీరోని ఊర మాస్‌ లుక్‌లో చూపించి, హిట్‌ అందుకున్నారు దర్శకుడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా 2023 మార్చి 30న విడుదలై సూపర్‌ హిట్‌గా  నిలిచింది. ‘దసరా’ వంటి హిట్‌ కాంబినేషన్‌ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

 కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్‌ బాబు, రాఘవ్‌ జుయల్, సంపూర్ణేష్‌ బాబు కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. ‘దసరా’లో నానీని ఫుల్‌ మాస్‌ లుక్‌లో చూపించిన శ్రీకాంత్‌ ఓదెల ‘ది ప్యారడైజ్‌’లో అంతకు మించి అన్నట్లుగా రా రస్టిక్‌ పాత్రలో చూపించనున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్‌ అనే శక్తిమంతమైన ΄ాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్‌ లుక్‌లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ సినిమా తెలుగుతో ΄ాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానుంది.

మరోసారి... 
హీరో బాలకృష్ణ– డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘వీర సింహారెడ్డి’. 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ‘వీర సింహారెడ్డి’ వంటి హిట్‌ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో రూ΄÷ందుతోన్న ద్వితీయ చిత్రం ‘ఎన్‌బీకే 111’ (వర్కింగ్‌ టైటిల్‌). వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబయ్‌ నేపథ్యంలో సాగే స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని జన్వాడలో జరుగుతోంది. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌తో సుమారు 30 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి, దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ ΄్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్‌బీకే 111’లో హీరోయిన్‌గా తొలుత నయనతార పేరు వినిపించింది. ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ నటించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి.  

ఆర్‌సీ 17 కోసం...  
రామ్‌ చరణ్‌ కెరీర్‌లోని హిట్‌ మూవీస్‌లో ‘రంగస్థలం’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ‘చిరుత’ (2007) ‘ధృవ’ (2016) వరకూ లవర్‌ బాయ్‌గా, స్టైలిష్‌ క్యారెక్టర్స్‌లో కనిపించిన ఆయన్ను  ‘రంగస్థలం’ చిత్రంలో పూర్తి స్థాయి మాస్‌ లుక్‌లో చూపించారు సుకుమార్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ప్రత్యేకించి ఈ సినిమా కోసం ఫుల్‌ మాస్‌ లుక్‌లో రామ్‌చరణ్‌ మేకోవర్‌ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత రామ్‌ చరణ్‌– సుకుమార్‌ కాంబినేషన్‌లో రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది. 

‘రంగస్థలం’ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప: ది రైజ్‌’ (2021), ‘పుష్ప 2: ది రూల్‌’ (2024) వంటి సినిమాలు తెరకెక్కించి, పాన్‌ ఇండియా హిట్స్‌ అందుకున్నారు సుకుమార్‌. ఈ చిత్రాల తర్వాత రామ్‌ చరణ్‌ హీరోగా ‘ఆర్‌సీ 17’ (వర్కింగ్‌ టైటిల్‌) చేయనున్నారు సుకుమార్‌. ‘పుష్ప’ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న సినిమా కావడంతో ప్రకటనతోనే ‘ఆర్‌సీ   17’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ‘పెద్ది’ రిలీజ్‌ తర్వాత ‘ఆర్‌సీ 17’ షూటింగ్‌లో పాల్గొంటారట రామ్‌ చరణ్‌. ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిందని సమాచారం. జూన్‌ 25 నుంచి ఈ మూవీ షూటింగ్‌ ్ర΄ారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా సుకుమార్‌ ఒక వినూత్నమైన ΄ాయింట్‌ను ఎంచుకున్నట్లు తెలిసింది.ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసేలా ఉంటుందని ఇన్‌సైడ్‌ టాక్‌. 

వాస్తవ ఘటనలతో...  
హీరో విజయ్‌ దేవరకొండ–డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాయన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’.  2017 నవంబరు 17న విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ–రాహుల్‌ సాంకృత్యాయన్‌ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న రెండో చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న భారీ ΄ాన్‌ ఇండియా మూవీ ఇది. 1854–1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందుతోంది. మే 9న విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్‌ స్పెషల్‌ మేకింగ్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. 

ఈ చిత్రంలోని హార్స్‌ రైడింగ్‌ సన్నివేశాల కోసం స్టాలియన్‌  బ్రీడ్‌ గుర్రాలపై స్వారీ చేయడానికి విజయ్‌ ఎలాంటి కఠినమైన శిక్షణ తీసుకున్నారు? ఈ క్రమంలో గాయాల్ని తట్టుకుని ఎలా విజయవంతంగా స్వారీ చేశారు? అన్నది ఈ గ్లింప్స్‌లో చూపించారు. ‘‘రణబాలి’లో ఈ సన్నివేశాలు స్క్రీన్‌ మీద చూసేందుకు చాలా బాగుంటాయి. అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్‌ చేస్తున్నాను’ అని విజయ్‌ దేవరకొండ చెప్పారు. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ ΄ాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. రణబాలి పాత్రలో విజయ్‌  హార్స్‌ రైడింగ్‌ సీన్స్‌, భారీ యాక్షన్‌ సీక్వెన్సులు హైలైట్‌గా నిలుస్తాయి.  సెప్టెంబరు 11న ఈ సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement