Chalo Premiddam Review: ‘ఛలో ప్రేమిద్దాం’ ఎలా ఉందంటే..?

Chalo Premiddam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : ఛలో ప్రేమిద్దాం
నటీనటులు : సాయి రోన‌క్‌, నేహా సోలంకీ, పొసాని కృష్ణమురళి, హేమ, అలీ, బాహుబలి ప్రభాకర్‌, సూర్య తదితరులు
నిర్మాణ సంస్థ : హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్
నిర్మాతలు : ఉద‌య్ కిర‌ణ్‌ 
దర్శకత్వం : సురేష్ శేఖ‌ర్ రేపల్లే
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌
సినిమాటోగ్రఫీ: అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి
విడుదల తేది : నవంబర్‌ 19, 2021

`బ్లాక్ అండ్ వైట్‌`, ప్రియుడు సినిమాల‌తో టాలీవుడ్ లోకి నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చిన ఉద‌య్ కుమార్ తాజాగా హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ పతాకంపై  నిర్మించిన చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.  `ప్రెజ‌ర్  కుక్క‌ర్‌` ఫేమ్  సాయి రోన‌క్‌,  `90 ఎమ్ ఎల్`  ఫేమ్ నేహ సోలంకి జంట‌గా న‌టించారు. సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. అందమైన ప్రేమకథతో పాటు, థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్సాన్స్‌ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్‌ 19)థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ‘ఛలో ప్రేమిద్దాం’ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. 

‘ఛ‌లో ప్రేమిద్దాం’కథేంటంటే..
వైజాగ్‌కు చెందిన ఆత్మరావు అలియాస్‌ రావు (సాయి రోనక్‌) ఇంజనీరింగ్‌ చదువు కోసం హైదరాబాద్‌కు వస్తాడు. అదే కాలేజీలో చదువుతున్న మధుమతి(నేహా సోలంకీ)తో ప్రేమలో పడతాడు. మధుమతికి కూడా రావు అంటే ఇష్టం ఉన్నప్పటీ ఆ విషయం అతనికి చెప్పదు. చిత్తూరులో ఉన్న తన మామయ్య, ఊరిపెద్ద పెద్దప్ప(నాగినీడు), సోదరుడు శివుడు(సూర్య)లకు నచ్చితేనే తన ప్రేమను ఆత్మరావుకు చెప్పాలని ఫిక్స్‌ అవుతుంది. తన సోదరి పెళ్లికి ఆత్మరావుతో పాటు మిగతా స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తుంది మధుమతి. కట్‌ చేస్తే.. మధుమతి కిడ్నాప్‌కి గురవుతుంది. ఈ వ్యవహారంలో ఆత్మరావుతో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అసలు మధుమతిని కిడ్నాప్‌ చేసిందేవరు? ఎందుకు చేశారు? ఈ కేసులో ఆత్మరావును పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారు? ప్రియురాలి కోసం ఆత్మరావు చేసిన సాహసం ఏంటి? చివరకు మధుమతి తన ప్రేమ విషయాన్ని ఆత్మరావుకు చెప్పిందా లేదా? అనేదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే.. 
కాలేజ్‌ స్టూడెంట్‌ ఆత్మరావు పాత్రలో సాయి రోనక్‌ ఒదిగిపోయాడు. డాన్స్‌తో పాటు ఫైట్‌ సీన్స్‌ కూడా అదరొట్టాడు. ఇక అల్లరి పిల్ల మధుమతిగా నేహా సోలంకీ తనదైన నటనతో మెప్పించింది. హే భగవాన్ అల్లా జీసస్ అంటూ నవ్వులు పూయించడంతో పాటు తెరపై అందంగా కనిపించింది. `ఫోన్ ఎక్కువ మాట్లాడకండి.. మ్యాటర్‌ పనిచేయదు` అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌ బాగా పేలింది. గ్రామపెద్దగా నాగీనీడు, అతనికి నమ్మదగిన వ్యక్తి శివుడు పాత్రలో సూర్య అద్భుత నటనను కనబరిచారు. కారుమంచి రఘు కామెడీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ గా భరత్‌,పవన్‌ ఫర్వాలేదనిపించారు.హీరో తండ్రిగా పోసాని, తల్లిగా హేమతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఎలా ఉందంటే..
స‌ర‌దాగా జాలీగా ఉండే అమ్మాయి, అబ్బాయి ప్రేమ‌లో ప‌డిన త‌రువాత వారి ప్రేమ ఎన్ని ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న‌ది.  ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి, వాటిని ఎలా ఎదుర్కొని నిల‌బ‌డ్డారు అనేదే ‘ఛలో ప్రేమిద్దాం’కథ. యూత్‌కు నచ్చే పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు సురేష్ శేఖ‌ర్ రేపల్లే.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించాడు. యూత్‌ఫుల్ డైలాగ్స్, కథ, కథనంతో  ల‌వ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెరకెక్కించాడు. ఒకపక్క కాలేజీ లవ్‌స్టోరి చూపిస్తూనే.. మరోపక్క యాక్షన్‌ ఎపిసోడ్‌ని నడిపిస్తూ ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. అయితే సినిమా నిడివి మాత్రం ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ సాగదీతగా అనిపిస్తాయి. ‘అత్తారింటికి దారిది’హోటల్‌ ఎపిసోడ్‌ నవ్వులు పూయిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో గేతో వచ్చే సన్నీవేశాలు కూడా యూత్‌ని నవ్విస్తాయి.  క్లైమాక్స్ మాత్రం మరింత క్రిస్పిగా రాసుకోవాల్సింది. ఎక్కువ సేపు క్లైమాక్స్ ఎపిసోడ్‌ ఉండటంతో ఆడియెన్స్  సహనం పరీక్షించేలా అనిపిస్తుంది.ఇక సాంకేతిక విషయానికొస్తే.. భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. సురేష్ గంగుల‌ రాసిన‘ఏమైందిరో’,‘జిందగి’పాటలలో పాటు మిగిలిన సాంగ్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. ఎడిటర్‌ ఉపేంద్ర జ‌క్క‌ తన కత్తెరగా ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top