హీరోయిన్ సెలీనా జైట్లీ పదిహేనేళ్ల తర్వాత తిరిగి చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వి. సముద్ర దర్శకత్వం వహించిన ‘సూర్యం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సెలీనా జైట్లీ సుపరిచితురాలే. 2004 డిసెంబరు 2న ఆ మూవీ విడుదలైంది. ఆ చిత్రం తర్వాత ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు కానీ బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేశారు.
సెలీనా హీరోయిన్‌గా నటించిన చివరి చిత్రం ‘శ్రీమతి’. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ కన్నడ సినిమా 2011 జూలై 8న విడుదలైంది. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సెలీనా తాజాగా బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదిత బయోపిక్‌లో ఆమె నటించనున్నారు. ఈ మూవీకి రామ్‌కమల్ ముఖర్జీ దర్శకుడు.
‘‘సిస్టర్ నివేదిత సేవల గురించి నా చిన్నతనంలో మా అమ్మ నుంచి తెలుసుకున్నాను. ఇప్పుడు ఆమె బయోపిక్‌లో కనిపించనుండటం మరపురాని అనుభవం. పదిహేనేళ్లు ఐరో పాలో గడిపిన నేను మళ్లీ మూలాలను వెతుక్కుంటూ మాతృదేశానికి తిరిగి వచ్చి, సనాతన ధర్మంతో అనుసంధానం కావడం హ్యాపీగా ఉంది’’ అని సెలీనా జైట్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... 1867లో ఐర్లాండ్‌లో జన్మించిన సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ నోబెల్. 1898లో వివేకానందుడి శిష్యరికాన్ని స్వీకరించి సిస్టర్ నివేదితగా పేరు మార్చుకున్నారు. 1911లో 43 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూశారు.


