
కోలీవుడ్ కమెడియన్ యోగిబాబుపై మన హాస్యనటుడు బ్రహ్మనందం ప్రశంసలు కురిపించారు. తమిళ ఇండస్ట్రీలో ఆయనకు క్రేజ్ అంతా ఇంతా కాదన్నారు. ఈ మధ్య యోగిబాబు హీరోగా చేసిన ఓ కన్నడ చిత్రంలో నేను కూడా నటించానని అన్నారు. నాకంటే వయస్సులో చిన్న వాళ్లయినా అద్భుతంగా చేస్తున్నారని కొనియాడారు. యోగిబాబును చూస్తే కామెడీ చేస్తారని ఎవరూ అనుకోరన్నారు. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలని... అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గుర్రం పాపిరెడ్డి సినిమా ఈవెంట్ సందర్భంగా బ్రహ్మనందం కామెంట్స్ చేశారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ - 'గుర్రం పాపిరెడ్డి సినిమా నాకొక స్పెషల్ మూవీ. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించా. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. నన్ను ఈ మూవీలో డిఫరెంట్గా చూపించాడు. ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ వీళ్లతో పాటు నేను మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నించా. అలాగే యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. తమిళ చిత్ర పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
కాగా.. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న చిత్రం గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా గుర్రం పాపిపెడ్డి సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందంతో పాటు యోగిబాబు కూడా పాల్గొన్నారు.