
టాలీవుడ్‌లో చాలా తక్కువ గానీ బాలీవుడ్‌లో మాత్రం హీరోహీరోయిన్ల ప్రేమ, రిలేషన్, పెళ్లి, బ్రేకప్ లాంటివి కాస్త ఎక్కువే. కలిసి నటించిన వాళ్లు చాలామంది ఉంటారు. అదే టైంలో గాఢంగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోని వాళ్లు కూడా కాస్త ఎక్కువగానే ఉంటారు. అలాంటి వాళ్ల లిస్ట్ తీస్తే గత కొన్నేళ్లలో చూసుకుంటే స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది ఉంటారు. వారిలో కొందరు గురించి మీకోసం.
అభిషేక్ - కరిష్మా కపూర్
అమితాబ్ బచ్చన్ కొడుకుగా అభిషేక్ అందరికీ పరిచయమే. 2000ల్లో హీరోయిన్ కరిష్మా కపూర్‌తో అభిషేక్ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశాడు. దీంతో వీళ్లిద్దరికీ పెద్దలు నిశ్చితార్థం కూడా చేశారు. కానీ 2003 టైంలో కారణాలేం చెప్పకుండా దీన్ని రద్దు చేసుకున్నారు. తర్వాత అభిషేక్.. ఐశ్వర్యారాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఆరాధ‍్య అనే అమ్మాయి కూడా పుట్టింది.
అక్షయ్ కుమార్-రవీనా-శిల్పాశెట్టి
90ల్లో అక్షయ్ కుమార్ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అలా రవీనా టండన్‌తో కలిసి 'మోహ్రా' అనే సినిమా చేశాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి డేటింగ్ కూడా చేశారు. మరి ఏమైందో ఏమో గానీ 2001లో అలా విడిపోయారు. అనంతరం కొన్నాళ్లకు రవీనా.. అనిల్ తడానిని వివాహం చేసుకుంది.
ఇదే అక్షయ్ కుమార్.. 90ల్లో శిల్పాశెట్టితోనూ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. 'మైన్ ఖిలాడీ తు అనారీ' సినిమా టైంలో ప్రేమ మొదలైందని మాట్లాడుకున్నారు. అలాంటిది వీళ్లిద్దరూ కూడా విడిపోయారు. అలా రవీనా, శిల్పా శెట్టితో విడిపోయిన అక్షయ్.. ట్వింకిల్ ఖన్నాని పెళ్లి చేసుకున్నాడు.
రణ్‌బీర్-దీపిక-కత్రినా కైఫ్
రణ్‌బీర్ కపూర్ పేరు చెప్పగానే అతడి సినిమాలతో పాటు డేటింగ్ స్టోరీలే గుర్తొస్తాయి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు మాట్లాడుకున్నారు. కానీ దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ పేర్లు మాత్రం కాస్త ఎక్కువగా వినిపించాయి. కలిసి సినిమాలు చేసిన రణ్‌బీర్-దీపిక.. రెండు మూడేళ్లపాటు డేటింగ్ చేసుకున్నారు. కానీ 2009లో విడిపోయారు. ఇది జరిగి ఎన్నాళ్లు కాలేదు. రణ్‌బీర్-కత్రినా కైఫ్ డేటింగ్ రూమర్స్ వినిపించాయి. దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. తర్వాత ఈమె నుంచి కూడా రణ్‍బీర్ విడిపోయాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా వేర్వేరుగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్-కత్రినా కైఫ్
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఇతడు.. గతంలో ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌తో 1990-2000 వరకు ప్రేమ-డేటింగ్‌లో ఉన్నారని అప్పట్లో ఇండస్ట్రీలో తెగ మాట్లాడుకున్నారు. కానీ సల్మాన్ ప్రవర్తన కారణంగా ఐశ్వర్య ఇతడిని 2002 నుంచి దూరం పెట్టేసిందట. ఈమె తర్వాత కత్రినా కైఫ్‌తో కొన్నేళ్ల పాటు సల్మాన్ రిలేషన్‌షిప్ మెంటైన్ చేశాడు. కానీ ఈమెతోనే బ్రేకప్ అయిపోయింది. ఐశ్వర్య, కత్రినా వేర్వేరుగా పెళ్లి చేసుకున్నారు గానీ సల్మాన్ మాత్రం ఒంటరిగానే ఉండిపోయాడు.
షాహిద్ కపూర్-కరీనా కపూర్-ప్రియాంక చోప్రా
మిలీయనల్స్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న షాహిద్ కపూర్.. 2004-07 టైంలో కరీనా కపూర్‌తో డేటింగ్ చేశాడు. కలిసి సినిమాలు చేస్తున్నప్పుడే వీళ్ల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కానీ 'జబ్ ఉయ్ మెట్' అనే మూవీ చేస్తున్న టైంలో బ్రేకప్ చెప్పుకొన్నారు. కానీ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈమె తర్వాత ప్రియాంక చోప్రాతోనూ షాహిద్ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి కానీ ఎక్కడా వీళ్లు దీన్ని ధ్రువీకరించలేదు. కొన్ని రూమర్స్ మాత్రం వినిపించాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు ఎవరికి వాళ్లు వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నారు.

రణ్‌దీప్ హుడా-సుస్మితా సేన్
మిస్ యూనివర్స్ సుస్మితా సేన్.. నటుడు రణ్‌దీప్ హుడాతో 2000 టైంలో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కానీ ఇది కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. తర్వాత కాలంలో రణ్‌దీప్.. నటి లిన్ లైస్రామ్‌ని పెళ్లి చేసుకోగా.. సుస్మితా మాత్రం ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇలా బాలీవుడ్‌లో చాలానే 'భగ్న' ప్రేమకథలు ఉన్నాయి!