కంటెంట్‌ క్వీన్‌ ఎలిమినేట్‌ అవడానికి కారణాలివే! | Bigg Boss Telugu 6: Reason For Geetu Royal Elimination From BB6 House | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఈ కారణాల వల్లే గీతూ ఎలిమినేట్‌ అయిందా?

Published Sun, Nov 6 2022 10:32 PM | Last Updated on Tue, Nov 8 2022 12:21 AM

Bigg Boss Telugu 6: Reason For Geetu Royal Elimination From BB6 House - Sakshi

బిగ్‌బాస్‌ షోను ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఈసారేంటో సీజన్‌ అస్సలు బాలేదని ఎంతోమంది పెదవి విరుస్తున్నారు. అలాంటివారికోసం కావాల్సినన్ని గొడవలు, కొట్లాటలు, మైండ్‌ గేమ్‌లతో ముందుకొచ్చింది గీతూ రాయల్‌. నేనుండగా సీజన్‌ ఫ్లాప్‌ కానిచ్చేది లేదని కంకణం కట్టుకుంది. ఫిజికల్‌గా ఆడకపోయినా బుద్ధిబలంతో ఆడతా, మిగతావారిని కూడా ఆటాడిస్తానంది. 

అలా అని అందరినీ మోటివేట్‌ చేసి ఆడించలేదు. రెచ్చగొట్టి, టార్గెట్‌ చేసి, ఎత్తుకు పైఎత్తులు వేసి, ఎమోషన్స్‌ హర్ట్‌ చేసి ఆడించాలనుకుంది. ఈ క్రమంలో తనపై ఎక్కడలేని నెగెటివిటీ పోగయ్యింది. ఎమోషన్స్‌తో ఆడుకోవడమేంటని బాహాటంగానే విమర్శలు వచ్చాయి. కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోక తప్పదు, గీతూ ఇదంతా కేవలం ఆటలో భాగంగానే చేసింది. బిగ్‌బాస్‌కు వచ్చాక తనకు గేమే సర్వస్వం అనుకుంది. గేమ్‌ తర్వాతే ఎవరైనా అని ఎప్పుడో చెప్పేసింది, అదే ఆచరించింది కూడా!

అసలు గీతూ కంటే కూడా గేమ్‌ ఆడని కంటెస్టెంట్లు హౌస్‌లో చాలామంది ఉన్నారు. కానీ గత రెండు వారాలుగా ఆమె చేజేతులా తన గేమ్‌ను నాశనం చేసుకుంది. ముఖ్యంగా గీతూ- సత్య కాంబినేషన్‌ చాలామందికి నచ్చలేదు. పూల టాస్కులో వీళ్లు మిగతావాళ్లతో పోలిస్తే అంతగా ఆడలేదు, కానీ నోరు పారేసుకోవడంలో ముందున్నారు. చేపల చెరువు టాస్కులో ఇనయ- రేవంత్‌ బాగా ఆడారు. ఈ గేమ్‌లో సంచాలక్‌గా గీతూ హద్దులు మీరి ఆడటం, మెరీనా- బాలాదిత్యలను టార్గెట్‌ చేయడం, చివర్లో రేవంత్‌ చేపలన్నీ శ్రీసత్య- శ్రీహాన్‌లకు వచ్చేలా చేయడం వారి అభిమానులకు నచ్చలేదు. 

ఎప్పుడైతే మిషన్‌ పాజిబుల్‌ టాస్క్‌ ఇచ్చారో గీతూ, సత్యలపై నెగెటివిటీ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఈ టాస్క్‌లో రెండు టీమ్స్‌గా విడిపోమనగానే శ్రీసత్య ఎలాంటి చర్చ పెట్టకుండా తనకు నచ్చినవారి పేర్లు టకటకా చెప్పేసి తామంతా రెడ్‌ టీమ్‌లో ఉంటామంది. రెడ్‌ టీమ్‌ సభ్యులు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుని ఆటాడారు. ఇందులోనూ గీతూ గేమ్‌ ఎక్కువ హైలైట్‌ అయింది. బాలాదిత్యను ఏడిపించడం, ఆదిరెడ్డిని మోసం చేయడం ఆమెకు నెగెటివ్‌ అయింది. ఆమె వల్ల ఆదిరెడ్డి కెప్టెన్సీకి పోటీపడే అవకాశం కోల్పోగా, నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్‌ పూర్తి చేయకపోడంతో గతవారం కెప్టెన్‌ అయిన శ్రీహాన్‌ నెక్స్ట్‌ వీక్‌ కెప్టెన్సీకి పోటీపడే ఛాన్స్‌ మిస్సయ్యాడు. అలా ఆమె తప్పుల వల్ల ఇతరులు బాధపడ్డారు.

ఒకానొక దశలో గీతూ బిగ్‌బాస్‌ ఆదేశాలను కూడా వినిపించుకోని స్థాయికి వెళ్లిపోయింది.​ బొచ్చులో ఆట అని నాగార్జున విమర్శించాక కూడా ఆమె తన తీరు మార్చుకోకపోవడంతో ఇలాంటి చేదు ఫలితం అనుభవించాల్సి వచ్చింది. కానీ బిగ్‌బాస్‌ చరిత్రలో గీతూ లాంటి కంటెస్టెంట్లు మాత్రం చాలా అరుదుగా వస్తుంటారు.

చదవండి: గీతూ అవుట్‌, ఏడ్చిన శ్రీహాన్‌, ఫైమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement