Bigg Boss 5 Telugu: సన్నీ ఎమోషనల్‌.. మచ్చా లవ్యూ అంటూ కన్నీళ్లు

Bigg Boss 5 Telugu: VJ Sunny And Shanmukh Jaswanth Emotional Journey In BB House - Sakshi

Bigg Boss Telugu 5, Episode 101: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ఈ బిగ్‌ రియాల్టీ షోకి శుభం కార్డు పడనుంది. హౌస్‌లో  ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఐదుగురు ఉన్నారు. వారికి మధురజ్ఞాపకాలను అందిస్తున్నాడు బిగ్‌బాస్‌. సోమవారం ఎపిసోడ్‌లో శ్రీరామ్‌, మానస్‌ల బిగ్‌బాస్‌ జర్నీ చూపించి, వారిలో జోష్‌ నింపాడు. మంగళవారం ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌, సన్నీల జర్నీని చూపించి, అలరించాడు బిగ్‌బాస్‌. మొదటగా షణ్ముఖ్‌ని పిలిచాడు. అతనికి సంబంధించిన ఫోటోలను చూపించాడు. అందులో ఎక్కువగా మోజ్‌ రూం ఫోటోలే ఉండడంతో.. మోజ్ రూం.. మోజ్ రూం అంటూ కేకలు వేశాడు షణ్ముఖ్‌. 

తర్వాత షణ్ముఖ్ జర్నీ గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. ‘ఈ తరం వారికి ముఖ్యంగా సోషల్‌ మీడియా ఉపయోగించే వారికి షణ్ముఖ్‌ జస్వంత్‌ అనేపేరు ఎంతో సుపరిచితం. మీరు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి పోటీలా నిలిచారు. ఇది వేరే ప్రపంచం.  ఇక్కడ నిజమైన మనుషులు, విభిన్న వ్యక్తిత్వాలు, కోపం, ప్రేమ ఇలా ప్రతి ఒక్కటి నిక్కచ్చిగా ఉంటాయి. నీలోని ప్రతి కోణాన్ని ఒక్కొక్కటిగా.. అందంగా ఈ ప్రయాణం బయటకు తీసుకొచ్చింది. అర్థం చేసుకునే మనుషులు ఉండడం మనుసును తేలిక పరచడం కాగ, ఆటలో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటి అర్థం చేసుకునే స్నేహితులు నీకు ఈ ఇంట్లో దొరికారు. మీ కోపాన్ని, అసహనాన్ని దూదిలాగా పీల్చుకుంటూనే.. నీలోని నిప్పుని నిరంతరం వెలిగిస్తూ.. ముందుకు తీసుకొచ్చారు. 

మీ మనసుకి దగ్గరైన వారితో అభిప్రాయభేదాలు వచ్చిన ప్రతిసారి.. మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారు. ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు.. మీకు ఎంత ముఖ్యమో.. మీరు వారి కోసం నిలబడ్డ తీరు తెలియజేస్తుంది.  వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్ని గొడవలైనా.. చివరి వరకూ ఒకటిగానే ఉన్నారు. ఎప్పుడైతే మీ మనసులోని భారం తగ్గిందో అప్పటి నుంచి టాస్కుల్లో పట్టుదల చూపి, బుద్ది బలం ఉపయోగించి ఇంటి కెప్టెన్‌ కావడమే కాకుండా అందరితో బ్రహ్మా అనిపించుకున్నారు. మీకు ఇష్టమైన చోటు మోజ్ రూం అని బిగ్ బాస్‌కి తెలుసు. అక్కడ మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు.. మీలోకి కోపం, బాధ, ప్రేమ అన్నింటిని ఆ గది చూసింది. మీ తీరులో ఆటను ఒక్కో లెవల్‌ తీసుకొచ్చి ఫినాలే వరకు వచ్చారు’అని బిగ్‌బాస్‌ చెప్పుకొచ్చాడు. 

ఆ తర్వాత సన్నీ జర్నీని చూపించాడు బిగ్‌బాస్‌. సరదా మరియు సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని..  మీరు అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి ఈ షో చూస్తున్న అందరికి మీరు గుర్తు చేశారు. ఈ ఇంట్లో మీరు కోరుకున్న బంధాలు.. మీమ్మల్ని కోరుకునే స్నేహితులు..  గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఇలా మీరు పోగు చేసుకున్నవి ఎన్నో జ్ఞాపకాలు. ఇలా అన్ని కలిసి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా,  అందరి మొహంపై నవ్వు తీసుకువచ్చే ఎంటర్‌టైనర్‌గా ఆవిష్కృతం చేసుకొని అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు.. వాళ్లు మిమ్మల్ని ఇష్టపడినా లేకున్నా.. మీలోని స్నేహితుడు వాళ్లని పరిచయం చేశాడు. మీలోకి కోపం మీకు ఇబ్బందులు తీసుకుని వచ్చి.. అందరి ముందు దోషిగా నిలబెట్టిన క్షణాలు.. మీ మనసుని ఎంతో బరువుగా  చేసిన విషయాన్ని బిగ్ బాస్ గమనించారు.

 ప్రతి టాస్క్‌లో గెలవాలనే మీ తపన.. గెలిచేవరకూ పోరాడే పట్టుదల..  ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా.. మీ ఓర్పు మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాగించిన ప్రయాణమే మళ్లీ  గుర్తు చేస్తుంది.  మీరు వెతుకున్న స్వప్న సుందరి కూడా మీకు  త్వరలోనే దొరకాలని బిగ్‌బాస్‌ ఆశిస్తున్నాడు. అప్నా టైం ఆయేగా.. అన్న మీ మాట మిమ్మల్ని ప్రేమించే వారికి గట్టిగా వినిపించింది. సన్నీ ఇప్పుడు  మీ సమయం వచ్చేసింది’ అంటూ సన్నీ జర్నీని చూపించారు బిగ్ బాస్.

తన జర్నీని చూసుకుని ఎమోషనల్ అయ్యాడు సన్నీ. బిగ్ బాస్ షోకి రావాలనేది నా డ్రీమ్.. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికీ మచ్చా లవ్యూ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం  ఒక ఫొటోగ్రాఫ్‌ని మీతో తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో.. తన తల్లితో ఉన్న ఫొటోతో పాటు.. మానస్‌తో ఉన్న ఫొటోని కూడా తీసుకున్నాడు.వెళ్తూ వెళ్తే.. బిగ్ బాస్ తనకి గిఫ్ట్‌గా ఇచ్చిన కేక్‌ని కూడా తీసుకుని వెళ్లాడు సన్నీ. ఆ రోజు అందరితో షేర్ చేసుకుని కేక్‌ని తినలేకపోయా.. ఇప్పుడు సర్ ప్రైజ్ చేస్తా అని ఆ కేక్‌ని తీసుకుని వెళ్లాడు సన్నీ. మొత్తంగా ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్‌కి సంబంధించిన జర్నీలలో ఇప్పటికైతే సన్నీదే హైలెట్‌ అని చెప్పాలి. ఈ వీడియోతో సన్నీకి పడే ఓట్ల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. కప్పు కూడా అతను గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిరి జర్నీ వీడియో బుధవారం ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top