సినీ ప్రేక్షకులకు పండుగే..బడా ఫిల్మ్స్‌ రిలీజ్‌కు రెడీ

Big Bollywood Films To Release As Theatres Open In Maharashtra - Sakshi

థియేరట్లకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.. రిలీజ్‌కు బడా చిత్రాలు

‘‘ఇక థియేటర్లు తెరవొచ్చు’’ అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అక్టోబర్‌ 22నుంచి థియేటర్లు తెరవడానికి అనుమతించింది. ఇలా అనుమతి వచ్చిందో లేదో అలా విడుదల పర్వం మొదలైంది. ఆదివారం ఏకంగా హిందీ పరిశ్రమ పది సినిమాలకు పైగా రిలీజ్‌ తేదీలు ప్రకటించడం విశేషం. ఒక్క యశ్‌ రాజ్‌ సంస్థ నుంచే నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధం కావడం విశేషం. ఇక రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న చిత్రాలేంటో చూద్దాం. 

కరోనా సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ముందుగా విడుదల కానున్న చిత్రం ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’. నవంబర్‌ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వరుణ్‌ వి. శర్మ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిలింస్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్‌ బంటీగా సైఫ్‌ అలీఖాన్, జూనియర్‌ బంటీగా సిద్ధార్థ్‌ చతుర్వేది, బబ్లీగా రాణీ ముఖర్జీ నటించారు. ఇది కాకుండా యశ్‌ రాజ్‌ మరో మూడు చిత్రాల విడుదల తేదీలను కూడా ప్రకటించింది. అక్షయ్‌ కమార్, మనూషీ చిల్లర్, సంజయ్‌ దత్‌ ప్రధాన తారాగణంగా డా.చందప్రకాశ్‌ ద్వివేదీ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ నిర్మించిన ‘పృథ్వీరాజ్‌’ సినిమా 2022 జనవరి 21న విడుదల కానుంది.

చౌహానా వంశానికి చెందిన చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా విడుదలైన నెలకు ఫిబ్రవరి 25న యశ్‌ రాజ్‌ నుంచి రానున్న మరో చిత్రం ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’. సోషల్‌ కామెడీ డ్రామా నేపథ్యంలో రణ్‌వీర్‌ సింగ్, షాలినీ పాండే జంటగా దివ్యాంగ్‌ తక్కర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మార్చి నెలలో 18వ తేదీన యశ్‌ రాజ్‌ నుంచి రానున్న మరో చిత్రం ‘షంషేరా’. రణ్‌బీర్‌ కపూర్, సంజయ్‌ దత్, వాణీ కపూర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ పీరియాడికల్‌ మూవీకి కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించారు.

ఇక యశ్‌ రాజ్‌ నుంచి రానున్న నాలుగు చిత్రాలతో పాటు ఇంకా విడుదల ఖరారు చేసుకున్న చిత్రాల్లో 2021 చివరి నెలలో డిసెంబర్‌ 3న ‘తడప్‌’ ఒకటి.. అహన్‌ శెట్టి, తారా సుతారియా జంటగా సునీల్‌ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాని మిలన్‌ లూథ్రియా దర్శకత్వంలో సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించారు. ఇక క్రిస్మస్‌కి పండగకి తెలుగు తెరపై క్రికెట్‌ చూపించడానికి రెడీ అయింది ‘83’ టీమ్‌. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో టీమిండియా వరల్డ్‌ కప్‌ ఎలా సాధించింది? అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కపిల్‌ దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ చేశారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన ఓ వారానికి మళ్లీ క్రికెట్‌ సినిమానే ప్రేక్షకులు చూడనున్నారు.

క్రికెట్‌ నేపథ్యంలో నాని నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్‌  డిసెంబర్‌ 31న విడుదల కానుంది. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరియే హిందీ రీమేక్‌ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, ‘దిల్‌’ రాజు, అమన్‌ గిల్‌ నిర్మించారు. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా ఆమిర్‌ ఖాన్, నాగచైతన్య, కరీనా కపూర్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుంది.

ఇంకా అక్షయ్‌కుమార్‌ హీరోగా ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వంలో సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించిన ‘బచ్చన్‌ పాండే’ మార్చి 4న, కార్తీక్‌ ఆర్యన్, టబు, కియారా అద్వానీ కాంబినేషన్‌లో అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భూల్‌ భులయ్యా 2’ మార్చి 25న, అజయ్‌ దేవగన్‌ నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘మేడే’ ఏప్రిల్‌ 29న, అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో టైగర్‌ ష్రాఫ్, తారా సుతారియా నటిస్తున్న చిత్రం మే 6న, అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నటిస్తున్న ‘రామ సేతు’ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఇలా.. ఒకేరోజున ఇన్ని చిత్రాల విడుదల తేదీల ప్రకటన రావడం సినిమా లవర్స్‌కు ఓ పండగ అని చెప్పొచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top