తొలి సైన్స్‌ ఫిక్షన్‌ ఆదిత్య 369.. జ్ఞాపకాలు పంచుకున్న సింగీతం, బాలయ్య

Balakrishna Aditya 369 Movie Completed 30 Years - Sakshi

గడియారం గిర్రున వెనక్కి తిరిగితే... ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి రావచ్చు... గిర్రున ముందుకు తిరిగితే... ఫ్యూచర్‌ని చూడొచ్చు. ఇంగ్లిష్‌ సినిమాల్లో ఇలాంటి కథలు కామన్‌. తెలుగు ప్రేక్షకులకూ పాస్ట్‌నీ, ఫ్యూచర్‌నీ చూపించిన ఘనత ‘ఆదిత్య 369’ది. అప్పట్లో గ్రాఫిక్స్‌ సౌకర్యం లేని రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అంటే చిన్న విషయం కానే కాదు. అందుకే తొలి ఇండియన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘ఆదిత్య 369’ క్లాసిక్‌గా నిలిచిపోయింది. నేటి (జూలై 18)తో ఈ చిత్రానికి 30 ఏళ్లు. ఈ టైమ్‌ ట్రావెల్‌ కథ పట్టాలెక్కడానికి ముఖ్య కారణం ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 30 ఏళ్లయిన సందర్భంగా హీరో బాలకృష్ణ – దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌.. ముగ్గురూ బాలూని తలుచుకున్నారు. ఇక ‘ఆదిత్య 369’ గురించి ఈ ముగ్గురూ ఏం చెప్పారో తెలుసుకుందాం.

విమానం స్మూత్‌గా వెళుతోంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పక్క పక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. ఈ ట్రావెల్‌ టైమ్‌లో ఎస్పీబీకి తన మనసులో ఉన్న ట్రావెల్‌ మిషన్‌ స్టోరీ చెప్పారు సింగీతం. ఎస్పీబీ ఎగ్జయిట్‌ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ఈ విషయం గురించి సింగీతం మాట్లాడుతూ – ‘‘ఆ రోజు నేను ఎస్పీబీగారిని కలవకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో. అలాగే శ్రీ కృష్ణదేవరాయలు పాత్రను బాలకృష్ణగారు చేయకపోతే సినిమా లేదని కథ చెప్పినప్పుడే కృష్ణప్రసాద్‌గారు అన్నారు. అయితే టైం మెషిన్‌ను తాను కనిపెట్టినట్లు చెప్తున్నారని, కానీ, హెచ్‌జీ వెల్స్‌ అనే రైటర్‌ రాసిన ది టైమ్‌ మెషిన్‌ అనే పుస్తకం తనకు కాలేజీ రోజుల నుంచే స్ఫూర్తి అని సింగీతం అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా టీం పంచుకున్న విశేషాలు కింద వీడియోలో ఉన్నాయి.


ఎస్పీబీతో బాలకృష్ణ, శివలెంక
బాలకృష్ణగారికి నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ‘నాన్నగారు (ఎన్టీఆర్‌) కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకూ చేయాలని ఉంది’ అని 30 సెకన్లలో సినిమాకి  ఓకే చెప్పారు. అప్పటికి ఇండియాలో తొలి సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ‘ఆదిత్య 369’.  టైమ్‌ మెషీన్‌ నేపథ్యంలో సాగే సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ నిర్మించడానికి ముందుకు వచ్చారు కృష్ణప్రసాద్‌గారు. ప్రతి సినిమా పునః పుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే... ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగితే మేం ఇండియాలో లైవ్‌ లో చూశాం. ఆ తర్వాత చాలామంది ఫోన్‌ చేసి, ‘సార్‌.. మీరు ఆ రోజు ‘ఆదిత్య 369’లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది’ అన్నారు. సినిమాలో పోలీస్‌ స్టేషన్‌ను ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. నేను ఎన్నో సినిమాలు చేశాను. అయితే అవి ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క ‘ఆదిత్య 369’ను మాత్రం అన్వయించుకోవచ్చు’’ అన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఆయనే మా సంధానకర్త. ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడికి ప్యాషన్‌ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. మేం ట్రెండ్‌ సెట్టర్స్‌ అనుకోండి. ఇటువంటి సినిమా ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. అప్పట్లో ‘ఆదిత్య 369’ చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ సినిమాకు గుండెకాయ శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. గ్రాఫిక్స్‌ లేని రోజుల్లో మొట్టమొదటిసారి వి.హెచ్‌.ఎస్‌ కెమెరాతో షూట్‌ చేసి... సినిమా నెగటివ్‌ మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయడం జరిగింది. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. కృష్ణ్ణప్రసాద్‌గారు ‘ఆదిత్య 369’ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి నిర్మాత ఇండస్ట్రీకి అవసరం. ముందు ముందు ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు.


బాలకృష్ణ, సింగీతం, శివలెంక కృష్ణప్రసాద్‌
శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘మా బేనర్‌లో తొలి సినిమా ‘చిన్నోడు పెద్దోడు’ విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న సమయంలో బాలు (ఎస్పీబీ) అంకుల్‌ ‘కృష్ణా.. ఓ పెద్ద సినిమా చెయ్‌. నేను హీరోలతో మాట్లాడతాను’ అన్నారు. సింగీతంగారిని కలమన్నారు. కలిస్తే.. ఆయన ‘ఆదిత్య 369’ కథ చెప్పారు. టైమ్‌ ట్రావెలింగ్‌ కథ. భారతీయ తెరపై రాని కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో అన్నాను. బాలు  అంకుల్‌ అయితే ‘భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా ఒక ల్యాండ్‌ మార్క్‌లా నిలబడుతుంది’ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో సింగీతంగారితో ఈ సినిమా చేస్తా’ అన్నాను. కథ విని, ‘ఆదిత్య 369’ని బాలకృష్ణగారు చేయాలనుకోవడం నా అదృష్టం అనుకోవాలి. 1990లో ఈ సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్‌ పూర్తయ్యాక పీసీ శ్రీరామ్‌ గారికి సుస్తీ చేసింది.

దాంతో కెమెరామేన్‌ వీఎస్సార్‌ స్వామిగారితో బాలకృష్ణగారు మాట్లాడారు. అలా... వర్తమానంలో నడిచే సీన్లకు పీసీ శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు వీఎస్సార్‌ స్వామిగారు, భవిష్యత్తును చూపించే సీన్లకు కబీర్‌ లాల్‌ ఛాయాగ్రాహ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్ర కళాదర్శకుడు పేకేటి రంగాగారికి, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ చేసిన సాంబ శివరావుగారికి నంది అవార్డు వచ్చింది. గౌతమ్‌ రాజుగారి ఎడిటింగ్, ఇళయరాజాగారి మ్యూజిక్, బాలు అంకుల్, జానకిగారు, జిక్కీ గార్ల గానం.. అన్నీ అద్భుతం. అయితే బడ్జెట్‌ పరంగా అనుకున్నదానికంటే పెరిగితే బయ్యర్లు సహకరించారు. వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బు సంపాదిస్తాం. కానీ, పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ‘ఆదిత్య 369’ వల్ల నాకు వచ్చిన గౌరవం 50 ఏళ్లయినా ఉంటుంది. టాప్‌ 100 సినిమాల్లో ఈ సినిమా ఒకటి కావడం నా అదృష్టం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top