Azadi Ka Amrit Mahotsav 2022: వెండితెరపై వందేమాతరం

Azadi Ka Amrit Mahotsav 2022: Patriotic movies with stories of heroes on the silver screen - Sakshi

సినీ ప్రేక్షకులకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఎలాగంటే రానున్న రోజుల్లో పలు దేశభక్తి చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా దేశభక్తి ఉప్పొంగనుంది. పలువురు స్వాతంత్య్రోద్యమ వీరుల చరిత్రలు, కాల్పనిక కథలతో దేశభక్తి చిత్రాలు రూపొందుతున్నాయి. వెండితెరపై వందేమాతరం అంటూ రానున్న ఆ ప్రాజెక్ట్స్‌ విశేషాలు తెలుసుకుందాం.

బయోపిక్‌ల వెల్లువ
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్‌ బోస్‌ జీవితం వెండితెరపైకి రానుంది. ‘ఖుదీరామ్‌ బోస్‌’ టైటిల్‌తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్‌ జాగర్లమూడి నిర్మించారు. ఖుదీరామ్‌ పాత్రను రాకేష్‌ జాగర్లమూడి పోషించారు. ఇతర పాత్రల్లో వివేక్‌ ఒబెరాయ్, అతుల్‌ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్‌ కనిపిస్తారు. విద్యాసాగర్‌ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను, ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు.

అటు హిందీలో స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర వీర్‌ సావర్కర్‌ జీవితం ఆధారంగా ‘స్వతంత్య్ర్‌ వీర్‌ సావర్కర్‌’ టైటిల్‌తో సినిమా రూపొందుతోంది. వీర్‌ సావర్కర్‌ పాత్రను రణ్‌దీప్‌ హుడా చేస్తున్నారు. నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే 1971లో భారత్‌–పాక్‌ యుద్ధంలో పోరాడిన ఆర్మీ చీఫ్‌ సామ్‌ మానెక్‌ షా జీవితం ఆధారంగా సినిమా రానుంది. ‘సామ్‌ బహదూర్‌’ టైటిల్‌తో విక్కీ కౌశల్‌ టైటిల్‌ రోల్‌లో మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

1971 భారత్‌ – పాక్‌ యుద్ధంలో పోరాడిన మరో వీర జవాను బ్రిగేడియర్‌ బల్‌రామ్‌సింగ్‌ మెహతా జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్‌రామ్‌ సింగ్‌ మెహతా పాత్రను ఇషాన్‌  కట్టర్‌ చేస్తున్నారు. బల్‌రామ్‌ సింగ్‌ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్‌ చఫీస్‌’ పుస్తకం ఆధారంగా రాజా కృష్ణమీనన్‌  దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబర్‌ 9న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలను     కుంటున్నారు.

1971 యుద్ధంలోనే వీర మరణం పొందిన యువ సైనికుడు అరుణ్‌ ఖేతర్పాల్‌ జీవితంతో రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్‌’. ఖేతర్పాల్‌ పాత్రను వరుణ్‌ ధావన్‌  పోషిస్తుండగా శ్రీరామ్‌ రాఘవన్‌  దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

జీవిత కథలు కాదు కానీ..
ఒకవైపు జీవితకథలతో సినిమాలు రూపొందుతుంటే మరోవైపు కాల్పనిక దేశభక్తి చిత్రాలు కూడా రానున్నాయి. వీటిలో ‘భారతీయుడు 2’ ఒకటి. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో రూపొందిన చిత్రం ‘ఇండియన్‌’ (భారతీయుడు). కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రా నికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుంది. కమల్‌హాసన్‌–శంకర్‌ కాంబినేషన్‌లోనే సీక్వెల్‌ రూపొందు తోంది. అటు హిందీలో కార్తీక్‌ ఆర్యన్‌  నటిస్తున్న ‘కెప్టెన్‌  ఇండియా’ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్‌  ఆధారంగా దర్శకుడు హన్సల్‌ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్‌ పైలెట్‌ పాత్ర చేస్తున్నారు. ఫీమేల్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తేజస్‌’. కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో సర్వేశ్‌ మేవారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగన  ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘ఆకాశాన్ని ఏలాలనుకున్న ఓ మహిళ స్ఫూర్తిదాయకమైన కథ ఇది’ అన్నారు కంగనా రనౌత్‌. అక్టోబర్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.

ఓటీటీకి గాంధీ బయోపిక్‌
జాతి పిత మహాత్మా గాంధీ జీవితంతో  వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌గా గాంధీ జీవితం రానుంది. గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులను, భారత స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని, గాంధీ జీవితంలో తెలియని కోణాలతో పలు సీజన్లుగా ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించనున్నారు. ఈ సిరీస్‌లో గాంధీ పాత్రను ప్రతీక్‌ గాంధీ పోషించనున్నారు.  ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్‌ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్‌ దట్‌ ఛేంజ్డ్‌ ద వరల్డ్‌’ పుస్తకాల ఆధారంగా దర్శకుడు హన్సల్‌ మెహతా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు.
ఇంకా పలు దేశభక్తి చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు రానున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top