
ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులను ప్రకటిస్తామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఏలూరులో జరిగిన భైరవం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మాదిరిగానే విశాఖను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అక్కడ స్టూడియోల నిర్మాణంతో పాటు డబ్బింగ్, రీరికార్డింగ్ వంటి థియేటర్లు నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పాలసీ తెచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.
కొద్దిరోజుల్లో సినిమా పరిశ్రమకు చెందిన పలు నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో ఏపీ ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి, నంది అవార్డుల గురించి చర్చిస్తామని తెలిపారు. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చేందుకు గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. వారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను చేర్చారు. కొద్దిరోజుల క్రితం పలు సినిమాల నుంచి నామినేషన్స్ కూడా తీసుకున్నారు.