ANR 100th Birthday Celebrations: నాగేశ్వరరావుగారు నట విశ్వవిద్యాలయం | Sakshi
Sakshi News home page

ANR 100th Birthday Celebrations: నాగేశ్వరరావుగారు నట విశ్వవిద్యాలయం

Published Thu, Sep 21 2023 1:02 AM

ANR 100th Birthday: Akkineni Nageswara Rao Statue Unveiled by Venkaiah Naidu - Sakshi

‘‘తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్‌ రెండు కళ్లు అని ఎప్పుడూ చెబుతుంటాను. తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం నాగేశ్వరరావుగారిలోని గొప్పతనం. అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మహా కవి కాళిదాసు.. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగి΄ోయేవారు. నాగేశ్వరరావుగారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ విశ్వ విద్యాలయంలో విద్యార్థిననుకుని, ఆ గుణగణాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌కు మంచి ప్రణాళికలు వేసుకున్నట్లవుతుంది’’ అన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

బుధవారం (సెప్టెంబరు 20) ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు మహానటులు.. మహా మనిషి. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావుగారు. అవతలివాళ్లు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సంప్రదాయాలు, విలువల్లో ఆయన జీవించి, నటించి మనకు చూపించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తే అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. నాగేశ్వరరావుగారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, జీవిత చరమాంకంలోనూ నటిస్తూనే ఉన్నారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. జీవిత కాలం పూర్తయిన తర్వాత కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో అక్కినేని నాగేశ్వరరావుగారు అగ్రగణ్యులు. ఆయన మంచి నటులే కాదు.. పరిణతి చెందిన గొప్ప ఆశావాది కూడా. ఆయన నాస్తికుడు. గొప్ప తాత్త్వికుడు. ఆయన పెద్దగా చదువుకోలేదని అంటారు. కానీ జీవితాలను చదివారు. జీవితంలో ఆయన ΄ోరాటం చేశారు.. జీవితాన్ని ప్రేమించారు.. ఆస్వాదించారు. జీవితంలో నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు’’ అని అన్నారు.

 యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘1950 సమయంలో నాగేశ్వరరావుగారు సినిమాల్లో నటించడంప్రారంభించాక, సొంతిల్లు కట్టుకోవడానికి ముందే మద్రాస్‌ విశ్వ విద్యాలయానికి పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాతిక వేలు ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి కూడా పాతిక వేలు విరాళం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. 1959లోలక్ష రూపాయల విరాళం ఇచ్చి గుడివాడ కళాశాలను నిలబెట్టారు. నాలాంటివారు ఎందరో చదువుకోగలిగారు. ఆ విధంగా ఆప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఓ విప్లవానికి ఆయన నాంది పలికారు’’ అన్నారు.  

డీజీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ – ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి కష్టం, కళల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆయన్ను ఓ లెజెండ్‌ని చేశాయి. యువ నటీనటులకు నాగార్జునగారు స్ఫూర్తి అని నా ఫ్రెండ్స్‌ సర్కిల్స్‌లో చెబుతుంటారు. నాగార్జునగారేమో తన తండ్రి చూపించిన మార్గంలో నడిచానని చెబుతుంటారు’’ అన్నారు.
 
నాగార్జున మాట్లాడుతూ–
‘‘ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే.. ఆయన ఓ మహానుభావుడు... ఆయన మనతో లేరనే భావన నా మనసులో చిన్నతనం నుంచే ముద్రపడింది. ఏ విగ్రహం చూసినా నాకు అదే అనిపించేది. అందుకే వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించేంతవరకూ నేను నాన్నగారి విగ్రహాన్ని చూడలేదు. చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాన్నగారు మాతో లేరనే విషయాన్ని అంగీకరించాల్సి వస్తుందేమోనని... శిల్పి వినీత్‌ ఈ విగ్రహాన్ని అద్భుతంగా చెక్కాడు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని జీవించారు. తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి.. ఇలా వివిధ రకాలుగా నాన్నగారు అందరికీ తెలుసు.

మాకు మాత్రం నాన్నగారు మా గుండెలను ప్రేమతో నింపిన వ్యక్తి. నన్ను, నా తోబుట్టువులను, మా పిల్లలను.. అందర్నీ చల్లగా చూసిన వ్యక్తి. మాకు మనసు బాగున్నా, బాగోలేకున్నా నాన్నగారి దగ్గరికి వెళ్లి కూర్చుంటే చాలు అన్నీ సర్దుకునేవి. అన్నపూర్ణ స్టూడియోస్‌ నాన్నగారికి నచ్చిన స్థలం. నచ్చిన చోట విగ్రహం పెడితేప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు అంటారు. సో.. ఆయన ప్రాణంతో మా దగ్గరే ఉన్నారని,ప్రాణంతో మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. నా ఆలోచనల్లోనే కాదు.. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో నాన్నగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినవారికి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన నాన్నగారి అభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు.  

ఏయన్నార్‌ పెద్ద కుమారుడు వెంకట్‌ అక్కినేని మాట్లాడుతూ– ‘‘మనిషి ఎంత కీర్తి సంపాదించినా, ఎంత ధనం గడించినా తలగడ మీద తల పెట్టగానే నిద్ర΄ోవడం అనే ఆస్తి, సౌకర్యం ఏ ధనం ఇవ్వలేదు. ఏయన్నార్‌గారు తలగడ మీద తల పెట్టగానే హాయిగా నిద్ర΄ోయేవారు. 1974లో బైపాస్‌ సర్జరీ జరిగింది. సర్జరీ ముందు రోజు నర్సు నిద్రకోసం మాత్ర ఇస్తే తీసుకోలేదు. ఏ మాత్ర వేసుకోకుండానే హాయిగా నిద్ర΄ోయారు. ఆ తర్వాత ఆయన జీవితం అందరికీ తెలిసిందే. నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. అన్నపూర్ణ సంస్థ, ఏయన్నార్‌ ఫిల్మ్‌ స్కూల్, కాలేజీ, ఆయన చిత్రాలు, ఫ్యాన్స్‌ తీపి గుర్తులు’’ అన్నారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావు గారు ఒక గ్రంథం. ఆయన ‘మరపురాని మనుషులు’ సినిమాకు అసోసియేట్‌గా చేశాను. అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాల్లో నటించాను’’ అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్న వ్యక్తి నాగేశ్వరరావుగారు. మహానట వృక్షం. కళాకారులకు గొప్ప వరం. స్వయంశిల్పి. స్నేహశీలి. అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి’’ అన్నారు.

ఎస్‌ఎస్‌ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఓ వేడుకలో నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం లభించింది. స్టార్‌ అయిన మీరు ‘మిస్సమ్మ’ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు చేశారు? అని ఆయన్ను అడిగాను. ‘దేవదాసు’ తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే వస్తున్నాయని, ఇమేజ్‌ మార్చుకోక΄ోతే ఇబ్బందవుతుందేమోనని, ఆ పాత్రను తానే అడిగి మరీ చేశానని చె΄్పారు. నాగేశ్వరరావుగారికి ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకానికి నమస్కారం చేయాలనిపించింది’’ అన్నారు.

జయసుధ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయడం నా అదృష్టం. క్రమశిక్షణతో పాటు ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు.  
ఏయన్నార్‌ కుమార్తె నాగ సుశీల మాట్లాడుతూ– ‘‘అందరికీ పండగలు ఉంటాయి. కానీ మా అక్కినేని అభిమానులకు నాన్నగారి జయంతే పండగ. అభిమానుల ్ర΄ోత్సాహం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. అమ్మానాన్నలు మేం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేవారు. అలా మేమందరం కలిసే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేశాం’’ అన్నారు.

సుశాంత్‌ మాట్లాడుతూ– ‘‘తాతగారు తన జీవితంలో కృతజ్ఞతకు విలువ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో తారా స్థాయికి ఎదిగిన ఆయనకు కళామతల్లికి తిరిగి ఇవ్వాలని ఉండేది. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఇంటర్‌నేషనల్‌ ఫౌండేషన్, ఏయన్నార్‌ నేషనల్‌ అవార్డు, అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా.. ఇలా ఎన్నో ఆయన కృతజ్ఞతలోంచి వచ్చిన ఆలోచనలే’’ అన్నారు.
‘‘నాగేశ్వరరావుగారి విగ్రహం పనులను నాకు అప్పగించిన అక్కినేని కుటుంబ సభ్యులకు ధన్య వాదాలు. దాదాపు ఐదున్నర నెలలు వర్క్‌ చేశాం’’ అన్నారు విగ్రహ రూపకర్త వినేష్‌ విజయన్‌.

నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్‌గారంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్‌ ఐకాన్‌గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ప్రేరణ కలిగించే కేస్‌ స్టడీగా చాలా మంది ఫిల్మ్‌ స్కూల్స్‌లో చదువుతుంటారు. ఈ జాబితాలో నేనూ ఉన్నాను. తాతగారితో నేను కలిసి నటించడం నా అదృష్టం. మన పుట్టుక మన చేతిలో ఉండదు. అలాంటిది అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడిగా పుట్టడం నా అదృష్టం’’ అని అన్నారు. తాత ఏయన్నార్‌కు అఖిల్‌ నివాళులర్పించారు.
 
ఈ కార్యక్రమంలో అమల, సుప్రియ, సుమంత్‌.. ఇలా అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, మంచు విష్ణు, నాని, నాజర్, అనుపమ్‌ ఖేర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, సి. కల్యాణ్, కేఎల్‌ నారాయణ, ‘దిల్‌’ రాజు, చినబాబు, నాగవంశీ, బి. గోపాల్, వైవీఎస్‌ చౌదరి, పి. కిరణ్, గుణ్ణం గంగరాజు, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొని, అక్కినేని నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement