సక్సెస్ అందుకోవడం కన్నా దాన్ని కొనసాగించడం చాలా కష్టం. కానీ, కెరీర్ మొదలైనప్పటినుంచి అపజయమనేదే ఎరుగకుండా విజయాల పరంపరతో దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అతడు డైరెక్ట్ చేసిన 9వ సినిమా మన శంకరవరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇందులో చిరు స్టైల్, డ్యాన్స్, కామెడీ చూసి ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది.
రజనీకాంత్‌ను అలా ఊహించుకోగలమా?
అయితే కొందరు మాత్రం చిరంజీవి వయసుకు తగ్గ పాత్రలు చేయాలని, తాతగా నటిస్తే బెటర్ అని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు గట్టి కౌంటరిచ్చాడు అనిల్ రావిపూడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రతి హీరోకు కొన్ని బలాలుంటాయి. వాటిని వదిలేసి మనమెప్పుడూ ప్రయోగాలు చేయకూడదు. రజనీకాంత్‌గారిని తన వాకింగ్ స్టైల్ లేకుండా ఒక సినిమా చేయమనండి, మనం చూడగలమా?
అలాగే చిరంజీవి కూడా..
ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా రజనీకాంత్‌గారి సినిమా ఊహించుకోగలమా? అది రజనీకాంత్‌గారి స్టైల్. అలాంటి రజనీకాంత్‌తో పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమా చేస్తే జనాలు ఒప్పుకోరు. ఆయనకు తగ్గ ఎలిమెంట్స్ ఆయన సినిమాలో కచ్చితంగా ఉండాలి. అలాగే చిరంజీవికి తగ్గ అంశాలు ఆయన మూవీలో ఉండాలి. చిరంజీవిగారు అనగానే మనకు గుర్తొచ్చేవి డ్యాన్సు, ఫైట్లు, పాటలు, కామెడీతో పాటు మంచి పర్ఫామెన్స్ లేదా కథాబలం.
నేను చేసి చూపించా..
ఆయన ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయాలా? అంటే దానికి తగ్గట్లుగా కథ రాస్తే చేయొచ్చు. నేను తీసి చూపించానుగా! చిరంజీవి- నయనతార మధ్య లవ్‌స్టోరీ పెట్టాను. ఎక్కడా ఓవర్‌గా చూపించలేదు. ఆయన వయసుకు తగ్గట్టుగా చాలా హుందాగా ఉంది. ఇలాంటి ప్రయోగాలు మనం చేయొచ్చు. ప్రేక్షకులు ఆ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు. హీరో బలాలను వాడుకుంటేనే సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరో విషయం.. చిరంజీవిగారు తన లుక్స్ మెయింటైన్ చేస్తారు.
తాత పాత్రలెందుకు చేయాలి?
అలుపు, ఆయాసం లేకుండా హుషారుగా హుక్ స్టెప్ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు. ఆయన అలాగే ఉండాలని కోరుకుంటాను. ఒక మనిషి అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నప్పుడు మనమెందుకు ఆయన తండ్రి, తాత పాత్రలు మాత్రమే చేయాలని రుద్దాలి? కావాలని ఒక వ్యక్తిని తగ్గించడానికే కొందరు ఇలా మాట్లాడుతున్నారు. చిరంజీవి.. గాడ్‌ఫాదర్, సైరా నరసింహారెడ్డి అని మధ్యమధ్యలో ప్రయోగాలు చేశారు.. కానీ ఈ సినిమాకే ఎందుకింత పెద్ద ఫలితం వచ్చిందంటే జనాలు ఆయన్ను పాత చిరంజీవిగా చూడాలనుకున్నారు అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.


