కాన్స్‌లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు | Sakshi
Sakshi News home page

కాన్స్‌లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు

Published Sun, May 26 2024 2:39 AM

Anasuya Sengupta First Indian to win Best Actress at Cannes

భారతీయ నటి అనసూయ సేన్‌ గుప్తా కాన్స్‌ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోని ‘అన్‌సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలో ‘ది షేమ్‌లెస్‌’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్‌ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.

బల్గేరియన్‌ దర్శకుడు కాన్ట్సాంటిన్‌ బోజనవ్‌ ‘ది షేమ్‌లెస్‌’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్‌సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్‌ సోలమన్‌’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్‌ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్‌ డాగ్‌’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్‌), రంగనో న్యాని (ఆన్‌ బికమింగ్‌ ఎ గినీ ఫౌల్‌) అవార్డు అందుకున్నారు.

కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్‌ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్‌కు ప్రస్తుతానికి గుడ్‌ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఆమె షేర్‌ చేశారు. 

‘ది షేమ్‌లెస్‌’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్‌ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్‌లెస్‌’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. 

జర్నలిస్ట్‌ అవ్వాలనుకుని నటిగా... 
అనసూయ సేన్‌ గుప్తా స్వస్థలం కోల్‌కతా. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్‌ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్‌ ఫిల్మ్‌ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్‌ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్‌ దత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.

ఆమె సోదరుడు అభిషేక్‌ సేన్‌ గుప్తా బాలీవుడ్‌లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్‌ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్‌ వంటి సిరీస్‌లకు ్ర΄÷డక్షన్‌ డిజైన్, సెట్‌ డిజైనింగ్‌ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్‌లో 2020 జూన్‌లో ‘ది షేమ్‌లెస్‌’ సినిమాకు ఆడిషన్స్‌ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్‌ బోజనవ్‌ ఆమెను లీడ్‌ రోల్‌కి ఎంచుకున్నారు.  

సంతోష్‌ శివన్‌కు ప్రతిష్టాత్మక పియర్‌ అవార్డు...
రెట్రో ఫోకస్, మోడ్రన్‌ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త పియర్‌ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్‌ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్‌ శివన్‌ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును  ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్‌ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్‌. 

దర్శక–నిర్మాతగా..
మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్‌ శివన్‌కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్‌గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్‌ సే’, తెలుగు ‘స్పైడర్‌’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్‌ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్‌లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్‌ శివన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement