నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు

Anand Devarakonda Chit Chat About His New Movie Middle Class Melodies - Sakshi

‘‘నేను ఏ సినిమా ఒప్పుకున్నా ప్రేక్షకుడిలా అలాంటి సినిమాని ఎంజాయ్‌ చేస్తానా?  లేదా? అని ఆలోచిస్తాను. అలాగే దర్శకుడు ఆ కథలో నన్ను ఎందుకు అనుకుంటున్నాడు అని కూడా అడుగుతాను’’ అన్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన హీరోగా వినోద్‌ అనంతోజు తెరకెక్కించిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. వర్ష బొలమ్మ కథానాయిక. వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20 నుంచి అమేజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆనంద్‌ చెప్పిన విశేషాలు.  

పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్‌ పెట్టాలనుకునే కుర్రాడి కథ ఇది. ఈ సినిమాలో మిడిల్‌ క్లాస్‌ జీవితాల గురించి చెప్పాం. ఆ జీవితాల తాలూకు ఎత్తుపల్లాలను చూపించాం. అవన్నీ కలిపితే ఓ మెలోడీలా ఉంటుంది. అందుకే ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ అని టైటిల్‌ పెట్టాం. 

దర్శకుడు వినోద్‌ కథ చెప్పినప్పుడు ‘నన్నెందుకు హీరోగా అనుకుంటున్నావు?’ అని అడిగాను. ‘ఈ కథలో హీరో మనలో ఒకడిలా ఉండాలి. మనకు తెలిసిన అబ్బాయిలా అనిపించాలి. నువ్వలా అనిపిస్తున్నావు’ అన్నాడు. ఈ సినిమాలో ప్రతీ పాత్రకు ఓ మ్యానరిజం, ఓ స్టయిల్‌ ఉంటాయి. అన్ని పాత్రలను దర్శకుడు అద్భుతంగా డిజైన్‌ చేశారు. అందుకే ఇది దర్శకుడి సినిమా.. హీరో సినిమా కాదు.   

ఈ సినిమా కోసం గుంటూరు యాస నేర్చుకున్నాను. అలాగే దోసె వేయడం, బొంబాయ్‌ చట్నీ చేయడం బాగా నేర్చుకున్నాను. మూమూలుగా అయితే నాకు వంట అంతగా రాదు. నేను జాబ్‌ చేస్తున్నప్పుడు వండుకునేవాణ్ణి. వండుకోవాలి కాబట్టి అన్నట్టు ఉండేది నా వంట. అమ్మ ఏదైనా రెసిపీ పంపితే, అది చూసి చేసుకునేవాణ్ణి.  

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్‌ కరెక్టే అనిపించింది. అలాగే థియేటర్స్‌లో రిలీజ్‌ అంటే ఎక్కువ థియేటర్స్‌ ఉంటాయా? లేదా? రెండు వారాల్లో అందరికీ చేరుతుందా? లేదా అని చిన్న టెన్షన్‌. కానీ అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. తెలుగు ప్రేక్షకులు కాకుండా అన్ని ఇండస్ట్రీల వాళ్లు చూస్తే, మన తెలుగు సినిమా పేరు కూడా పెరుగుతుంది.  

నా తర్వాతి సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఆ సినిమాను కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌ (విజయ్‌ దేవరకొండ నిర్మాణ సంస్థ), టాంగా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి. 

ఒక ప్రేక్షకుడిగా నేను ఎలాంటి సినిమాలు ఇష్టపడతానో అలాంటి సినిమాలే చేయాలనుకుంటాను. అంతేకానీ విజయ్‌ తమ్ముడు కాబట్టి ఇలాంటి సినిమాలు చేయాలి, అతని స్టార్‌డమ్‌కి తగ్గ సినిమాలు చేయాలనే ఆలోచన అస్సలు లేదు. నా కథలు కూడా నేనే ఎంపిక చేసుకుంటాను. నా సినిమాల్లో విజయ్‌ ప్రమేయం ఇప్పటివరకూ అయితే ఏం లేదు. ఒకవేళ పెద్ద బడ్జట్‌ సినిమా ఏదైనా కమిట్‌ అయితే తన అభిప్రాయం అడుగుతాను.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top