
‘పుష్ప 2’తో అల్లు అర్జున్, జవాన్‌తో దర్శకుడు అట్లీ పాన్ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారు. ఈమేరకు తాజాగా దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్‌తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాకు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఐకాన్, సూపర్‌హీరో వంటి వాటిని ఎంపికచేశారని తెలుస్తోంది. గతంలో దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్‌తో ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. అందుకు ‘ఐకాన్’ టైటిల్‌ను ఆయన అనుకున్నారు. అయితే, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అట్లీ సినిమాకు ‘ఐకాన్’ టైటిల్ అయితే ఎలా ఉంటుందని బన్నీ ఆలోచిస్తున్నారట. అట్లీ కూడా బాగానే ఉందని చెప్పారట. దాదాపు ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారని సమాచారం.
ప్రతి సినిమాకీ ఓ కొత్త లుక్‌తో అభిమానులను అలరిస్తారు అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మాస్ లుక్‌లో కనిపించిన బన్నీ ఇప్పుడు అట్లీ సినిమా కోసం సరికొత్తగా తన లుక్‌ను మార్చుకోనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్‌ను ప్రయత్నించినట్లు సమాచారం. పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడి ఉండే సైన్స్‌ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది.